బాహుబలి-2 పెద్ద హిట్ అయింది. తెలుగు సినిమా మార్కెట్ కు మరిన్ని దారులు తెరిచింది. మరి ఈ దారుల్లో మరో తెలుగు సినిమా వెళ్లాలంటే ఏం చేయాలి. దేశవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైన సబ్జెక్ట్ ను ఎంచుకోవాలి. ప్రస్తుతం అల్లు అరవింద్ అదే పనిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన రామాయణాన్ని భారీ బడ్జెట్ తో వెండితెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు.
నిజానికి మొన్నటివరకు మహాభారతంపై అల్లు అరవింద్ కన్ను ఉండేది. కానీ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఈమధ్యే ఈ సినిమాను వేరే వాళ్లు ఎనౌన్స్ చేశారు. దీంతో రామాయణంను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అల్లు అరవింద్. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
బాహుబలి సినిమా రెండు భాగాలుగా వస్తే, రామాయణం సినిమా 3 భాగాలుగా రాబోతోంది. అల్లు అరవింద్ తో పాటు ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయి.