విదేశాల్లో ఎవడు పడితే వాడు దేశమంతా ఓవర్ నైట్ పాప్యులర్ అయిపోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఏదైనా ఒక ఘన కార్యం చేస్తేనే.. మామూలు జనం చేయలేని పనిచేసి చూపిస్తేనే గాని అలాంటి పాప్యులారిటీ రాదు. ఎందుకంటే అక్కడి మీడియా మన మీడియా లాగా కర్రప్టెడ్ కాదు. అందుకే మనదేశంలో అడ్డమైనవాడూ తెల్లారేసరికి పాప్యులర్ అయిపోతాడు. అలా పాప్యులర్ అవడానికి సవాలక్ష మార్గాలు కూడా ఉన్నై. ఉదాహరణకి మీరు కోటీస్వరులే గాని మీరెవరో ఎవడికీ తెలీదు. తెలియాలంటే ప్రొసీజర్ చాలా చిన్నది.
నమస్తే చానల్ ఎండీ గారూ..
నమస్తేసార్!.. రండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నా.. మీరు దేశమంతా బాగా పాప్యులర్ అవాలనుకుంటున్నారా? లేక కొంచెం స్టేట్ లెవల్లో అయిపోతే చాలా? దేశమంతా అవాలి సార్! కేంద్ర మంత్రులూ రాష్ట్రమంత్రులూ అందర్తో పరిచయాలు కావాలి.. వాళ్ళందరూ నా బిజినెస్‌లో అవినీతిని కవర్ చేయడానికి ఉపయోగపడాలి. నెలరోజుల్లో ఆ పని చేసేస్తాం. మా మీడియా వున్నది మీలాంటి వాళ్ళకు సేవ చేయడానికే కదా.. వెంటనే పదికోట్లు క్యాష్ పంపించండి.. ఓకే.. ఇంతకూ ఏంచేయబోతున్నారు మీరు?
మీరు వెంటనే మీ తండ్రి పేరు మీద ఒక సినీ అవార్డ్స్ సంస్థ ప్రారంభించండి. మీ తండ్రి గారికి ఎలాగైనా సినిమాలు చూసే అలవాటు వుంటుంది కదా.. చూడడు గానీ సినిమా టికెట్లు బ్లాకులో అమ్మేవాడు.. ఆమాట పైకి చెప్పం గానీ ఆయన జీవితమంతా మంచి హిట్ సినిమాలు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు అని చెప్పండి.. చాలు.. ఆ తరువాత కొంతమంది మినిస్టర్ లనూ కొంతమంది సినీ ప్రముఖులనూ అవార్డ్స్ కమిటీ మెంబర్స్‌గా వేయండి.. వాళ్ళు వప్పుకుంటారా? అందమైన సినిమా హీరోయిన్లను పరిచయం చేయండి.. ఇక మిమ్మల్ని వదలరు వాళ్ళు..
మరి హీరోయిన్లు వప్పుకుంటారా?
వాళ్ళ షేర్ వాళ్ళకిస్తాం కదా.. అంతే.. అవార్డ్స్ ఫంక్షన్ అయేసరికి మీ చుట్టూ మొత్తం మంత్రులూ, ముఖ్యమంత్రులూ తిరుగుతూంటారు.. తరువాత ఒక చోటా రాజకీయనాయకు డొస్తాడు. సార్! నేను మా నియోజకవర్గంలో తప్ప బయట ఎవరికీ తెలీదు.. నేను నేషనల్ లెవల్లో పాప్యులర్ అవాలి.. ప్రధాన మంత్రి దృష్టికి రావాలి.. అప్పుడు గాని నాకు కేంద్ర మంత్రి పదవి దక్కే చాన్స్ రాదు.. వెరీ సింపుల్.. మా చానల్‌కి అయిదు కోట్లు ఇవ్వండి.. వెంటనే మేము ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం.. అందులో మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి.. ఏమని..
త్వరలోనే నేను ఒక బ్రిగేడ్ స్టార్ట్ చేస్తున్నా.. ఆ బ్రిగేడ్ వాళ్ళు ఎవరు అక్రమంగా గోవులను తరలిస్తున్నా వాళ్ళను చంపేస్తారు.. అని చెప్పండి చాలు.. గంట సేపట్లో మిమ్మల్ని నేషనల్ సెలెబ్రిటీ గా చేసేస్తాం.. ఒకవేళ పోలీసులతో ప్రాబ్లెం రాదుకదా.. ఇండియా పోలీసుల సంగతి మీకు తెలీన్దేముంది? యాయా..
ఇంకో క్యాడేట్ వస్తాడు..
సార్!. నేను పాప్యులర్ అవాలని అనాధ పిల్లల కోసం ఒక హోమ్ ఏర్పాటు చేసాను.. అయినా ఎవరూ గుర్తించడం లేదు.. మీ చానల్ కూడా పట్టించుకోలేదు.. ఇదిగో.. నీ కేమైనా తెలివుందా.. పాప్యులర్ అవాలంటే నెగెటివ్ పనులు చేయాలి బాబూ.. అంటే ఇలాంటివి? నన్ను ఫలానా అమ్మాయ్ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోందని స్టేట్మెంట్ ఇవ్వండి.. పది నిమషాల్లో ఆలిండియా పాప్యులర్.. లేదా పోర్నోగ్రఫీ వాట్సాప్ లో షేర్ చేయండి.. పాప్యులర్.. ఇలాంటివి నా పరువు ప్రతిష్టలకు బంఘం కలిగిస్తాయేమో.. అయితే దిగ్విజయ్ పాప్యులారిటీ చిల్లర్ ట్రిక్ వాడండి.. ఏంటది? బీజేపీ ముస్లిమ్స్‌ని టార్గెట్ చేస్తోందని ఒక స్టేట్మేంట్ ఇవ్వండి.. గంటలో పాప్యులర్.. లేదా పలానా ముఖ్యమంత్రిని మర్డర్ చేసిన వాడికి కోటి రూపాయలు ఇస్తామనండి.. కాని పోలీసులు.. ఇండియా పోలీసుల సంగతి మీకు తెలియందేముంది సార్.. ఓకే.
-యర్రంశెట్టి సాయి