సినిమా పిచ్చోళ్లపై జాలి అవసరమా?

రూపాయి బస్ టికెట్ పెంచేస్తే గగ్గోలు. నెలవారీ పేపర్ బిల్లు పదిరూపాయిలు పెరిగితే అమ్మో..కరెంట్ చార్జీలు పెరిగి నెలకు వంద అదనంగా పడితే బాబోయ్. కానీ ప్రతీ నెలా ఓ పెద్ద సినిమా వస్తే,…

రూపాయి బస్ టికెట్ పెంచేస్తే గగ్గోలు. నెలవారీ పేపర్ బిల్లు పదిరూపాయిలు పెరిగితే అమ్మో..కరెంట్ చార్జీలు పెరిగి నెలకు వంద అదనంగా పడితే బాబోయ్. కానీ ప్రతీ నెలా ఓ పెద్ద సినిమా వస్తే, హ్యాపీగా యూనిఫారమ్ రేట్ పెట్టినా చూసేస్తారు. ఆంధ్రలోని చిన్న చిన్న ఊళ్లలో సైతం ఇప్పుడు యూనిఫారమ్ రేటు అన్నది కామన్ అయిపోయింది. ఆమాత్రం, ఈ మాత్రం పెద్ద సినిమా వస్తే చాలు మొదటి మూడు రోజులు యూనిఫారమ్ రేటు. యాభై రూపాయిల టికెట్ 150 నుంచి 200. అయినా నో ప్రోబ్లమ్. పది రూపాయిల నేల టికెట్ 150 నుంచి 200 అయినా నో ప్రోబ్లమ్.

కరెంట్, బస్, పేపర్ అంటే నిత్యం వుండేవి. సినిమా అంటే ఎప్పుడో ఓసారి చూసేవి అని వాదించవచ్చు. కానీ సినిమాలు కూడా అలాగే తయారయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూడండి.

జనవరిలో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్రశాతకర్ణి, శతమానంభవతి, నేనులోకల్, ఓంనమోవెంకటేశాయ. వీటిలో నమోవెంకటేశాయ తొలి మూడు రోజులు యూనిఫారమ్ రేటు అమ్మారు. మిగిలినవి పండగ వారం అంతా యూనిఫారమ్ రేటు అమ్మారు. అంటే ఆ నెల నాలుగు సినిమాలు జనం నూరు నుంచి నూటయాభై రూపాయిలు ఒక్కో సినిమాకు అదనంగా ఇచ్చి చూసారు. అంటే చూసిన వాళ్లు సినిమా కోసం అదనంగా ఖర్చు చేసింది నెల మొత్తం మీద నాలుగు నుంచి ఆరు వందలు. 

ఫిబ్రవరిలో కాటమరాయుడు వచ్చింది. అదీ ఇలాగే చూసారు. మార్చిలో మిస్టర్ సినిమాను కూడా మొదటి మూడు రోజులు జిల్లాలో 150కే అమ్మారు. ఈసినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అలాగే అమ్మారు. చూసిన వాళ్లు అలాగే చూసారు. ఇక ఇప్పుడు ఏప్రియల్ లో బాహుబలి వస్తోంది. సినిమా రిజల్ట్ ను బట్టి ఒకవారమా, మరెన్ని వారాలు యూనిఫారమ్ రేటు అన్నది వుంటుంది.

మేలో చిన్న సినిమాలు వున్నాయి. జూన్ లో డిజె రెడీ. ఆ తరువాత స్పైడర్ రెడీ. ఇలా ప్రతినెలా ఫ్యామిలీల సినిమా బడ్జెట్ కనీసం అయిదు వందలు అదనం. ఎందుకు చూడాలి అదనంగా ఇచ్చి అని ఎవ్వరూ అనుకోవడం లేదు. వారం తరువాత చూస్తే, మామూలు రేటుకు చూడొచ్చు కదా అని ఎవ్వరూ అనుకోవడం లేదు. అలా అనుకుని, అందరూ తొలివారం బాయ్ కాట్ చేస్తే, ఈ యూనిఫారమ్ రేటు అన్నది ఏ ప్రభుత్వమూ, ఏ అధికారి అజమాయిషీ లేకుండానే తొలగిపోతుంది.

కానీ స్పెషల్ షోలు వేలకు వేలు పెట్టికొంటున్న ఫ్యాన్స్, అదనపు ధరలను అస్సలు పట్టించుకోవడం లేదు. దాంతో ఈ దందా అలాగే సాగుతోంది. మరి నెల నెలా సినిమాకు అయిదు వందలు అదనంగా పెట్టగలిగిన వాళ్లు, బస్ టికెట్ లు, ట్రయిన్ టికెట్ లు, పేపర్ బిల్లులు కాస్త పెరిగితే గగ్గొలు పెట్టడం విడ్డూరంగా లేదూ? వీళ్లపై జాలి అవసరం అంటారా?