పవన్‌కి చరణ్‌ పొలిటికల్‌ సపోర్ట్‌.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా మెగా కాంపౌండ్‌ నుంచి పవన్‌కళ్యాణ్‌ దూరంగా వున్నారన్నది నిర్వివాదాంశం. పవన్‌కళ్యాణ్‌ వైపు మెగా కాంపౌండ్‌ నుంచి ఎవరూ చూడటంలేదాయె. మీడియా ముందు మాత్రం, 'అబ్బే, మా కాంపౌండ్‌లో ఎలాంటి…

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా మెగా కాంపౌండ్‌ నుంచి పవన్‌కళ్యాణ్‌ దూరంగా వున్నారన్నది నిర్వివాదాంశం. పవన్‌కళ్యాణ్‌ వైపు మెగా కాంపౌండ్‌ నుంచి ఎవరూ చూడటంలేదాయె. మీడియా ముందు మాత్రం, 'అబ్బే, మా కాంపౌండ్‌లో ఎలాంటి విభేదాలకు తావు లేదు.. పవన్‌కళ్యాణ్‌ మొదటి నుంచీ ఓ విచిత్రమైన మనస్తత్వం వున్న వ్యక్తి.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అతను అలాగే వుంటాడు.. అలాగని, మా మధ్య విభేదాలున్నాయనడం సబబు కాదు..' అని మెగా కాంపౌండ్‌కి సంబంధించిన ముఖ్యులు చెబుతుండడం చూస్తూనే వున్నాం. కానీ, 'వాస్తవం' అందరికీ కన్పిస్తోంది. 

ఆ విషయం పక్కన పెడితే, కొత్తగా 'మెగా పవర్‌' స్టార్‌ రామ్‌చరణ్‌ రాజకీయాల్లో పవర్‌స్టార్‌కి 'మెగా' సపోర్ట్‌ ప్రకటించినట్టున్నాడు. 'బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ ఏ కార్యక్రమం చేపట్టినా మెగా అభిమానులంతా ఆయనకు సపోర్ట్‌గా నిలవాలి..' అంటూ చరణ్‌ వ్యాఖ్యానించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన తాజా సినిమా షూటింగ్‌ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న సందర్భంలో, అభిమానుల్ని ఉద్దేశించి చరణ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'కార్యక్రమాలు..' అంటే, అది రాజకీయం కాక ఇంకేమవుతుంది.? 

చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో చేరినా, 2014 ఎన్నికల్లో మెగా అభిమానులు మాత్రం రాజకీయంగా ఆయన వెనకాల నిలబడలేదు. 2009 ఎన్నికల పరిస్థితి వేరు. అప్పుడు పూర్తిగా అభిమానగణం చిరంజీవి వెనకాలే నిలిచింది. అయినా, అధికారం దక్కలేదనుకోండి.. అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్‌ నేత అయినా, ఆయన వెన్నంటే రాజకీయాల్లో నిలిచేందుకు అభిమానులు సుముఖత వ్యక్తం చేయని పరిస్థితి. 

ప్రస్తుత పరిస్థితుల్లో బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీతో జనంలోకి వెళుతున్న దరిమిలా, ఆయనకు అండగా నిలబడాలని అభిమానులకు చరణ్‌ ఇచ్చిన పిలుపుతో కొత్త సమీకరణాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. 'తమ్ముడితో కలిసి పని చేసే అవకాశం లేదు..' అని చిరంజీవి, 'అన్నయ్య, జనసేనలోకి రారు..' అని పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించినప్పటికీ.. ఏమో, సమీప భవిష్యత్తులో రాజకీయంగా ఏమైనా జరగొచ్చుననీ, దానికి చరణ్‌ వ్యాఖ్యలే నిదర్శనమనీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. 

అయితే, అభిమానులు విడిపోకుండా వుండేందుకుగాను, నిర్మాతగా, మెగా హీరోగా చరణ్‌ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడనీ, ఈ క్రమంలో సినిమాటిక్‌గా చరణ్‌ చేసిన వ్యాఖ్యల్ని రాజకీయంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న వాదనా లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. మొత్తమ్మీద, మెగా కాంపౌండ్‌లో ప్యాచప్‌ కోసం చరణ్‌ ప్రయత్నిస్తున్నట్లే కన్పిస్తోంది ఈ 'బిల్డప్‌' అంతా. మరి, ప్యాచప్‌ కుదిరేనా.? వేచి చూడాల్సిందే.