బాస్ ఈజ్ బ్యాక్..మరి చిన్నోళ్లు?

ఈ ఏడాదికి మెగా క్యాంప్ కు శుభారంభం ఖైదీ నెంబర్ 150. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ మురిసిపోయారు. అంతవరకు బాగానే వుంది. కానీ ఆ తరువాతే వచ్చింది…

ఈ ఏడాదికి మెగా క్యాంప్ కు శుభారంభం ఖైదీ నెంబర్ 150. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ మురిసిపోయారు. అంతవరకు బాగానే వుంది. కానీ ఆ తరువాతే వచ్చింది సమస్య అంతా. మెగాస్టార్ మళ్లీ పూర్వ వైభవం చవిచూసారు. కానీ మెగా క్యాంప్ లో మిగిలిన హీరోలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేస్తున్నారు. 

విన్నర్ సినిమాతో సాయిధరమ్ తేజ డిస్సపాయింట్ చేసాడు. మంచి టైటిల్, మంచి హిట్ లు ఖాతాలో వున్న డైరక్టర్ అనుకంటే, ఫలితం తారుమారయింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అంటూ మరో పరాజయాన్ని చవి చూసారు. తమిళ రీమేక్, ష్యూర్ హిట్ అనుకుంటే అది కూడా అలాగే అయింది. లేటెస్ట్ గా వరుణ్ తేజ మిస్టర్ విడుదలయింది. దీనికీ ఏవరేజ్ టాకే వచ్చింది. శ్రీనువైట్ల చాలెంజ్ గా తీసుకుని చేస్తున్నారని అనుకుంటే, అది రివర్స్ కొట్టింది. అందరివాడు, బ్రూస్ లీ తరువాత శ్రీనువైట్ల మెగా క్యాంప్ కు ఇచ్చిన సినిమా ఇది. 

ఇదిలా వుంటే అల్లు శిరీష్ 1971 అంటూ మళయాలంలో ఓ సినిమా చేసాడు తొలిసారిగా. అదీ ఈ మధ్యే అక్కడ విడుదలయింది. అది కూడా అక్కడ ఫట్ మనేసింది. మాంచి ఫార్మ్ లో వున్న సూపర్ స్టార్ మోహల్ లాల్ వున్నా కూడా ఫలితం లేకపోయింది. 

ఇక మిగిలిన హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రమే. బన్నీ నటిస్తున్న డిజె సినిమా మే లో విడుదల అన్నారు కానీ, వాయిదా పడే అవకాశాలే ఎక్కువ వున్నాయి. పైగా ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పుడు ఈ విషయమే బన్నీ ఫ్యాన్స్ ను కలవర పెడుతోంది. ముచ్చటగా మూడు పరాజయాలు వున్నాయి ఈమె ఖాతాలో, ముకుంద, ఒక లైలా కోసం, మెహంజదారో (హిందీ) సినిమాల ఫలితాలు అంతంత మాత్రం. 

ఇక రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఆఫ్ బీట్ టైపు. చెవిటి హీరో, 90లకు ముందటి పల్లెటూరి ప్రేమకథ. మరి జనాలకు ఏరేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.