జనసేనాని పవన్‌కల్యాణ్‌కు కొత్త తలనొప్పి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని పవన్ అంటే, జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అందరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో త్యాగాలకు సైతం సిద్ధమని చంద్రబాబు అన్నారు. ఈ ఇద్దరు నేతల ప్రకటనల నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదురుతుందనే చర్చకు తెరలేచింది.
అయితే గతంలో ఒకటికి రెండుసార్లు టీడీపీ చేతిలో మోసపోయామని, ఆయన పిలుపునకు ఓ దండం అని బీజేపీ తన వైఖరి స్పష్టం చేసింది. బీజేపీ మిత్రపక్షమైన జనసేనాని పవన్ మాత్రం చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ, మెజార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం పెదవి విరుస్తున్నారు.
పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న జనసేన నాయకులు, కార్యకర్తలు మరొకసారి తమ నాయకుడు చంద్రబాబు పల్లకీ మోయిస్తారనే ఆందోళనలో ఉన్నారు.
జనసేన లేనిదే టీడీపీ అధికారంలోకి రావడం కల్లే అనే చర్చ ఊపందుకుంది. దీంతో తమ నాయకుడు పవన్‌కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, 2014లో తమ పార్టీ సాయానికి రుణం తీర్చుకునే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని జనసేన అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లలో చెబుతుండడం విశేషం.
చంద్రబాబు ఏం త్యాగం చేస్తారో చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ లాంటి నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
పవనే సీఎం అభ్యర్థి కావాలనే బలమైన డిమాండ్లు జనసేన అంతరంగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీటికి జనసేనాని పవన్‌కల్యాణ్ అభిప్రాయంతో సంబంధం లేదు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పవన్ వెళితే, జనసేన నష్టపోయే అవకాశాలున్నాయి.
జనసేన, టీడీపీ మధ్య పొత్తు సాఫీగా జరిగిపోతుందని అనుకుంటున్న తరుణంలో నాయకత్వం ఎవరు వహించాలనేది సమస్యగా మారింది. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న తాము కాకుండా జనసేనకు నాయకత్వం ఎలా వహిస్తుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇదే సందర్భంలో 30 శాతానికి పైగా ఓటు బ్యాంకున్న సామాజిక వర్గం మద్దతు పుష్కలంగా ఉన్న పవన్‌కల్యాణ్ కాకుండా ఇతరుల నాయకత్వంలో ఎలా పని చేస్తామనే ప్రశ్న జనసేన నుంచి వస్తోంది. ఇదే రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తుకు చిక్కు తెచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.