మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇది ఎంత కాలమో సీబీఐ చెప్పలేకపోతోంది. ఇదే విషయాన్ని సీబీఐని హైకోర్టు కూడా ప్రశ్నించింది. హత్య కేసు విచారణ కొనసాగింపు నేపథ్యంలో నిందితుల హక్కుల గురించి ఆలోచించాల్సి వుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ కేసులో ప్రధానంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రానివ్వకూడదనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్‌కు, అలాగే ఇటీవల తనను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాలని సీబీఐ అధికారుల కారు డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని సీబీఐతో పాటు వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించడం గమనార్హం.
హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవుల వాదనను ఒకసారి పరిశీలిద్దాం. సీబీఐ ఆధికారుల డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించారని, హత్య కేసు దర్యాప్తు చేస్తున్న అధికారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. శివశంకర్‌రెడ్డిపై హత్య, హత్యాయత్నం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం తదితర సెక్షన్ల కింద మొత్తం 31 కేసులున్నాయన్నారు.
దేవిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వస్తున్న సందర్భంలోనే సీబీఐ అధికారుల డ్రైవర్ తప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర దాగి వున్నట్టు శివశంకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే శివశంకర్‌రెడ్డిపై తప్పుడు కేసులు తెరపైకి తెస్తున్నారని వాపోతున్నారు. వీటి వెనుక భారీ కుట్ర వుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.