సాధారణంగా రెండు భాషల్లో ఒకేసారి విడుదలయ్యే సినిమాలకు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక లాంగ్వేజ్ లో థియేటర్లు దొరికితే మరో భాషలో థియేటర్లు ఉండవు. పొరపాటున ఒక లాంగ్వేజ్ లో ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే ఇక అక్కడ మరో సినిమాకు చోటు ఉండదు. కానీ చెలియా సినిమాకు మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ ఎదురుకాలేదు.
ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికే విడుదలైన కాటమరాయుడు హవా రేపటికి మరింత తగ్గుతుంది. కాస్తోకూస్తో గురు సినిమాతోనే చెలియాకు పోటీ ఉండాలి. కానీ జానర్ పరంగా చూసుకుంటే రెండూ డిఫరెంట్ సినిమాలు. పైగా గురు కూడా వచ్చి వారం అయిపోతుంది కాబట్టి ఆ వేడి తగ్గే అవకాశముంది.
మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో గురు సినిమా పెద్దగా ఆడడం లేదు. ఇది కూడా చెలియాకు కలిసొచ్చే అంశమే. వీటికి తోడు తెలుగులో చెలియాతో పాటు వస్తున్న సినిమాలన్నీ ఊరుపేరు లేని సినిమాలే. సో, ఆ విధంగా కూడా పోటీలేదు. ఇక కోలీవుడ్ విషయానికొస్తే, అక్కడ కూడా పెద్ద హిట్స్ లేవు. బాక్సాఫీస్ చప్పగానే సాగుతోంది. ఇలాంటి టైమ్ లో వస్తున్న చెలియా సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా… ఓకే బంగారం, సఖి సినిమాల టైపులో ఓ రేంజ్ లో బాక్సాఫీస్ ను ఊపేయడం ఖాయం.