పవన్-త్రివిక్రమ్ సినిమా కోసం నిర్మాత బాగానే ఖర్చుపెడుతున్నాడు. నిజానికి బడ్జెట్ లో ఎక్కువ భాగం పవన్, త్రివిక్రమ్ కే సమర్పించుకున్నాడు. తన కెరీర్ లోనే అత్యథిక మొత్తాన్ని పవన్ ఈ సినిమాకు తీసుకున్నాడనే టాక్ ఉంది. వరుస విజయాలతో ఉన్న త్రివిక్రమ్ కూడా భారీగానే ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవాలంటే హీరోయిన్ల బడ్జెట్ లో కోత పెట్టాల్సిందే. ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినట్టు తెలుస్తోంది.
పవన్ పేరు చెప్పి కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ పారితోషికాల్లో భారీగా కోత పెట్టారట. పవన్ సరసన నటిస్తే క్రేజ్ డబుల్ అవుతుందని, రెమ్యూనరేషన్ గురించి ఆలోచించొద్దని బ్రెయిన్ వాష్ చేశారట. పైగా పవన్-త్రివిక్రమ్ ది సూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి ఆటోమేటిగ్గా హిట్ గ్యారెంటీ అంటూ చాలా చెప్పారట. దీంతో తెలుగులో వరుసగా హిట్స్ కొట్టినప్పటికీ పవన్ సినిమా కోసం ఏమాత్రం రేటు పెంచకుండా కాల్షీట్లు కేటాయించిందట కీర్తిసురేష్. ఇక అను ఎమ్మాన్యుయేల్ కైతే ఎంతిస్తున్నారో కూడా చెప్పకుండా సంతకం చేయించుకున్నారట.
పవన్ సరసన నటిస్తే ఏ హీరోయిన్ కైనా క్రేజ్ వస్తుంది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కీర్తిసురేష్, అను లాంటి అమ్మాయిలకైతే పవన్ సినిమాలో ఛాన్స్ రావడమే గొప్ప విషయం. అందుకే పారితోషికం గురించి పట్టించుకోకుండా సెట్స్ పైకి వచ్చేశారు ఇద్దరూ.
కాకపోతే పవన్ సరసన నటించి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. గతంలో భూమిక, ఇలియాన… తాజాగా శృతిహాసన్ మాత్రమే పవన్ తో సినిమాలు చేసి క్లిక్ అయ్యారు. వీళ్ల కోవలోకి కీర్తిసురేష్, అను చేరతారో లేదో చూడాలి.