హీరో రణబీర్ కపూర్ ను గట్టిగా టార్గెట్ చేసినట్టుంది కంగన. ఇప్పటికే ఓసారి ట్విట్టర్ లో అతడిపై పరోక్షంగా విమర్శలు చేసింది. రణబీర్ ను 'మాఫియా సూపర్ స్టార్'గా అభివర్ణించిన ఈ హీరోయిన్..రణబీర్-అలియాల పెళ్లిని ఫేక్ వెడ్డింగ్ గా పేర్కొంది.
ఇప్పుడీ హీరోయిన్, రణబీర్ కు సంబంధించి మరిన్ని వివరాల్ని పరోక్షంగా వెల్లడించింది. తనతో డేటింగ్ కోసం రణబీర్ అర్రులు చాచినట్టు చెప్పుకొచ్చింది. తను ఒప్పుకుంటే ట్రయాంగిల్ డేటింగ్ చేయడానికి కూడా రణబీర్ రెడీ అయినట్టు, అతడి పేరు ప్రస్తావించకుండా చెప్పుకొచ్చింది.
“నేను క్వీన్ సినిమా చేస్తున్న రోజులవి. అప్పటికి ఈ మాఫియా ప్లేబాయ్ కు పెళ్లికాలేదు. నాకు సంబంధించిన సమాచారం మొత్తం సేకరించాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. చివరికి నేను షూట్ కోసం పారిస్ వెళ్తే, అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత నా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. తింగరి వేషాలు వేశాడు. నేనంటే పడి చచ్చేవాడు.”
డేటింగ్ చేద్దామని సదరు హీరో తన కాళ్లవేళ్లా పడ్డాడని, తను నో చెప్పడంతో.. సోషల్ మీడియా ఎకౌంట్స్ హ్యాక్ చేసి వేధించడం మొదలుపెట్టాడని పేర్కొంది కంగన. సినిమా ఆఫర్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ తను తిరస్కరించానని, అలా తనతో మాట్లాడ్డం మానేసిన ఆ హీరో, ఉన్నట్టుండి సడెన్ గా 2021 నుంచి మళ్లీ మాటలు కలిపాడని తెలిపింది.
“రెండేళ్లుగా మళ్లీ మాటలు కలిపాడు. ఇంకో సినిమా ఆఫర్ చేశాడు. పబ్లిక్ గానే నేను తిరస్కరించాను. అతడి మాఫియా నన్ను టార్గెట్ చేసిందని అనుకుంటున్నాను. ఇలాంటి వేధింపులు పదేళ్లుగా చూస్తున్నాను. అన్నింటిని తట్టుకొని ఎదిగాను. ప్రతి రోజూ నాకు యుద్ధమే.”
ఇలా రణబీర్ పేరు ప్రస్తావించకుండా అతడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది కంగన. అయితే కంగనా వ్యాఖ్యలపై రణబీర్-అలియా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని వాళ్లు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.