విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్ట్ 1న వస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మహా నగరంలో ఒక కీలక ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టనున్నారు. ప్రఖ్యాత సంస్థ రహేజా గ్రూప్ విశాఖలో దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ని చేపడుతోంది. విశాఖ నడిబొడ్డున ఉన్న పదిహేడు ఎకరాల స్థలంలో ఆరు వందల కోట్ల రూపాయలతో ఇనార్భిట్ మాల్ ని నిర్మిస్తోంది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
ఈ మాల్ విశాఖలో నంబర్ వన్ గా డిజైన్ చేస్తున్నారు. ఈ మాల్ లో 280 పైగా కంపెనీలకు చెందిన ఔట్ లెట్స్ ఉంటాయి. ఆ విధంగా ప్రత్యక్షంగా రెండు వేల మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఈ మాల్ ఏర్పాటు ద్వారా విశాఖ స్మార్ట్ సిటీ అభివృద్ధి మరో మెట్టు ఎక్కనుందని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖ మీద సీఎం జగన్ కి ప్రేమ ఉండబట్టే పెద్ద ఎత్తున పెట్టుబడులను తెచ్చి ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను ఏర్పాటు చేయిస్తున్నారు అని ఇంచార్జి మంత్రి విడదల రజని పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు వరసగా గ్రౌడింగ్ అవుతాయని, రానున్న నెలలలో మరిన్ని కొత్త ప్రాజెక్టులకు సీఎం విశాఖలో శ్రీకారం చుడతారని వైసీపీ నేతలు అంటున్నారు.
విశాఖ అభివృద్ధి ఏది అని ప్రశ్నిస్తున్న విపక్షాలను కట్టడి చేయడానికి సీఎం మాటల కంటే చేతలనే నమ్ముకున్నారని, ఆ విధంగా కొత్త ప్రాజెక్టులు అనేకం ఈ ప్రాంతానికి వస్తాయని అంటున్నారు. విశాఖలో సీఎం పర్యటన అటు రాజకీయంగానూ ఈసారి ఆసక్తిని రేపనుంది అని తెలుస్తోంది. ఈ సందర్భంగా జరిగే సభలో జగన్ ఏమి మాట్లాడుతారు అన్నది కూడా ఉత్కంఠను రేపుతోంది.