కరెన్సీ సంక్షోభం ఇంకా సమసిపోలేదు.. కరెన్సీ పేరుతో ప్రయోగాలు ఇంకా ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అతి త్వరలో 200 రూపాయల నోటు రాబోతోంది. రద్దయిన వెయ్యి రూపాయల నోటు స్థానంలో కొత్త వెయ్యి రూపాయల నోటు తీసుకురాబోతున్నారు. ఇవన్నీ రానున్న నాలుగైదు నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయట. ఏ క్షణాన అయినా, కొత్త కరెన్సీ ప్రింటింగ్ ప్రారంభం కాబోతోందనే ప్రచారం జరుగుతోంది.
ఓ పక్క దేశవ్యాప్తంగా కరెన్సీ సంక్షోభం కొనసాగుతోంటే, బ్యాంకుల్లో నగదు లేక జనం తిప్పలు పడ్తోంటే, మార్కెట్లోకి వచ్చిన కొత్త నోట్లు ఏమయ్యాయో తెలియని దుస్థితి నెలకొంటే, కొత్తగా మళ్ళీ 200 రూపాయల నోటు, వెయ్యి రూపాయల నోటు ముద్రించడం వల్ల ఏం ఉపయోగం.? ఎవరికి లాభం.? అన్న అనుమానం తలెత్తడం సహజమే.
ప్రధాని నరేంద్రమోడీ అట్టహాసంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ద నోట్ల రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాత నోట్లు రద్దయి, కొత్త నోట్లు వచ్చాయంతే. ఇక్కడ, మేలు కలిగింది నల్ల కుబేరులకు తప్ప, సామాన్యులకు ఏమాత్రం కాదు. పెద్ద పాత నోట్ల రద్దుతో దేశానికి ఎంతో మేలు జరుగుతుందని నరేంద్రమోడీ గొప్పగా చెప్పుకున్నారు. ఏదీ ఆ గొప్ప.? అన్న ప్రశ్నకు సమాధానమే లేదాయె. బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు దాపురించాయి. ఏటీఎంలు ఈగల మోతతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. క్యాష్ లెస్, లెస్ క్యాష్.. వంటి కథలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సామాన్యుల పాట్లు మాత్రం అలాగే వున్నాయి.
డిసెంబర్ 31 తర్వాత పరిస్థితి బాగుంటుందన్నారు.. జనవరి 31 వరకు ఆ 'ఆనందాన్ని' పోస్ట్‌పోన్ చేశారు, ఆ తర్వాత పరిస్థితి అలవాటైపోయింది. అసలు రద్దయిన నోట్లు ఎంత.? వాటి స్థానంలో కొత్తగా వచ్చిన నోట్లు ఎంత.? ఈ ప్రక్రియలో దేశానికి ఒరిగిన లాభమేంటి.? కలిగిన నష్టమేంటి.? ఇలాంటి ప్రశ్నల్లో కొన్నిటికి సమాధానాలు కన్పిస్తున్నా, అవేవీ విశ్వసించదగ్గవిగా కన్పించడంలేదు.
మొత్తంగా చూస్తే, పెద్ద పాత నోట్ల రద్దుతో దేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రయోగ శాలగా మార్చేశారు. ఓ మూర్ఖత్వపు నిర్ణయాన్ని సమర్థించుకోవడం కోసం.. ఇదిగో, ఇలా కొత్త కొత్తగా నోట్లను తీసుకొచ్చే ప్రక్రియ మొదలు పెడ్తున్నారట. కొత్త నోట్లు వస్తున్నాయ్ సరే, వచ్చిన నోట్లు ఏ నల్ల గోదాముల్లోకి వెళ్ళిపోతున్నాయో చెప్పకపోతే ఎలా.?