యుపి ఎన్నికల సందర్భంగా అనేక అంశాలపై యీ కాలమ్‌లో చర్చించడం జరిగింది. బిజెపి హిందూత్వ విధానంతో ముందుకు వెళుతోందని బిసి, ఎస్సీలను ఉపకులాలుగా విడగొట్టి వారికి అగ్రకులాలను కలిపి ముందుకు వెళుతోందని చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ ప్రయోగం ఏ మేరకు సఫలమైంది అన్నది అక్కడకు వెళ్లిన పాత్రికేయులకు, సర్వేయర్లకు సైతం అందలేదు. మొదటి ఐదు విడతల తర్వాత కూడా మూడూ (ఎస్పీ ప్లస్ కాంగ్రెస్, బియస్పీ, బిజెపి) తూకంగా సాగుతున్నాయని, గెలుపు ఎవరి పక్షానా లేదనీ చెపుతూ వచ్చారు. అంతిమంగా చూస్తే అవన్నీ తప్పాయి. బిజెపి అన్ని ప్రాంతాల్లో గెలుపు బావుటా ఎగరేసి, అపూర్వమైన రికార్డు సృష్టించింది. బిజెపి ప్రయోగం అమోఘంగా పనిచేసింది. ఇది భారత రాజకీయాల్లో 'వాటర్‌షెడ్' అనదగిన మలుపు. ఈ విజయం మోదీ, అతని ఆదేశాలు సమర్థవంతంగా పాలించిన అమిత్ షాలదే అని చెప్పాలి. ఇదే విధానాన్ని బిజెపి తక్కిన రాష్ట్రాలలో కూడా అమలు చేస్తుందా, చేస్తే విజయవంతమౌతుందా, యిటువంటి ఎన్నికల విధానం వలన సమాజం ఎలా ప్రభావితమౌతుంది అనే విషయాలు భవిష్యత్తే చెపుతుంది. ప్రస్తుతానికి బిజెపి యీ విజయాన్ని ఎలా సొంతం చేసుకుంది, బియస్పీ, ఎస్పీ, కాంగ్రెసు ఎక్కడ వైఫల్యం చెందాయనేది చర్చించుకుందాం. నిజానికి ఏయే వర్గాలు ఏ యే పార్టీకి ఓట్లేశాయి అనే గణాంక వివరాలు యింకా పూర్తిగా రాలేదు. అవి వచ్చిన తర్వాత కావాలంటే సవరించుకోవచ్చు కానీ యిప్పటివరకు వివిధ పత్రికల్లో వచ్చిన విశ్లేషణల ఆధారంగా తయారవుతున్న యీ వ్యాసం యుపి ఫలితాన్ని అర్థం చేసుకోవడానికి కొంతైనా ఉపకరించవచ్చు.
యుపిలో తమ గెలుపు తథ్యమని బిజెపి నాయకులు ముందు నుంచి అంతర్గతంగా వాదిస్తూ వచ్చారు. 'మాకు 2014 ఎన్నికలలో యుపిలో 42.3% ఓట్లు వచ్చాయి. 2014 తర్వాత జరిగిన 11 అసెంబ్లీ ఎన్నికలలో మా ఓట్ల శాతం సరాసరిన చూస్తే 10% తగ్గింది. యుపిలో కూడా 2017లో అదే జరుగుతుందని అనుకున్నా 32.3% ఓట్లు వస్తాయి. ఎస్పీ, బియస్పీతో తలపడే ముక్కోణపు పోటీలో గెలుపుకు అది చాలు. ఎందుకంటే 2012లో ఎస్పీ 29% ఓట్లతో 224 సీట్లు గెలిచింది.'' అని. అయితే అంతిమంగా చూస్తే 10% ఓట్లు తగ్గలేదు, కేవలం 2.6% మాత్రమే తగ్గాయి. అప్పుడు 80 పార్లమెంటు స్థానాల్లో 71 వాటిలో గెలిచింది. అసెంబ్లీ స్థానాలుగా లెక్క వేస్తే 328! ఇప్పుడు 39.7% ఓట్లతో 312 సీట్లు గెలిచింది. తక్కిన ఏ రాష్ట్రంలోనూ యిది సాధ్యపడలేదు. బిజెపితో బాటు దాని భాగస్వామి పక్షాలు కూడా బాగుపడ్డాయి. అప్నా దళ్ (సోనేలాల్) 9 గెలవగా, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 4 గెలిచింది. దీనికి విపర్యంగా ఎస్పీ-కాంగ్రెసు కూటమి వలన రెండు పక్షాలూ దెబ్బ తిన్నాయి. 2014లో 22.20% ఓట్లు తెచ్చుకున్న ఎస్పీ యీ సారి 21.8% తెచ్చుకుంటే అప్పుడు 7.5% తెచ్చుకున్న కాంగ్రెసు యిప్పుడు 6.2% తెచ్చుకుంది. ఎస్పీకి 47 సీట్లు రాగా కాంగ్రెసుకు అప్నాదళ్ కంటె తక్కువగా 7 మాత్రం వచ్చాయి. వాటి చరిత్రలో యిదే అతి తక్కువ. బియస్పీ విషయానికి వస్తే – 2014 లో 19.6% ఓట్లు తెచ్చుకుంటే యిప్పుడు 22.2% తెచ్చుకుంది కానీ సీట్లు మాత్రం 19యే వచ్చాయి. పార్టీ పెట్టిన కొత్త రోజుల్లో 12 వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత 19 రావడమంటే ఘోరపరాజయమనే చెప్పాలి.
బిజెపి వ్యూహకర్త అమిత్ షా 2014 అక్టోబరు నుంచి యుపిపై దృష్టి సారించి, పార్టీ యిన్ఫ్రాస్ట్రక్చర్ను అద్భుతంగా మలిచాడు. ఆరెస్సెస్ ప్రచారకుల స్థాయి నుంచి ఎదిగిన రాజస్థానీ బ్రహ్మచారులు ఓం ప్రకాశ్ మాథుర్, సునీల్ బన్సాల్లను యుపికి పంపాడు. మాథుర్ 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయానికి దోహదపడగా, బన్సాల్ రాజస్థాన్ ఎబివిపి ద్వారా బిజెపి జనరల్ సెక్రటరీ అయ్యాడు. జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ రామ్‌లాల్‌కు ఆరెస్సెస్ క్యాడర్‌కు, బిజెపికి సంధానకర్తగా నియమించారు. వీళ్లంతా కలిసి బిజెపి అవకాశాలను అంచనా వేశారు. 1991లో రామమందిరం అంశం వేడిమీద వుండగా 221 సీట్లు గెలిచింది. 1996 నాటికి అది చల్లారి 174 అయింది, 2002 నాటికి 88, 2007కి 51, 2012 వచ్చేసరికి 47కి దిగజారింది. దాన్ని 7 రెట్లు చేయాలంటే సాధ్యమా? అనుకోలేదు వారు. 2015 పంచాయితీ ఎన్నికలలో పోటీ చేద్దామని ప్రతిపాదించారు. గతంలో మనం పోటీ చేయలేదు కదా అని స్థానిక నాయకులు వాదించారు. ''గ్రామీణ ప్రాంతాల్లో చొచ్చుకుపోవాలంటే యిది అత్యవసరం.'' అన్నారు వీళ్లు. బిజెపి తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వచ్చారు. వారిలో చాలామంది గెలవలేదు. 3 వేల మంది పోటీ చేస్తే 10% 3 వందల మంది గెలిచారు. కానీ యీ ప్రయత్నం కారణంగా గతంలో బిజెపి వెళ్లని ప్రాంతాలకు యిప్పుడు వెళ్లింది. వెయ్యి గ్రామాల్లో తన ఉనికి చాటుకుంది. వెయ్యి మంది నాయకులు కొత్తగా తయారయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే 142 గ్రామీణ స్థానాల్లో బిజెపి 97, (2012లో 9 మాత్రమే గెలిచారు), ఎస్పీ కూటమి 28 (2012లో 105), బియస్పీ 3 (2012లో 26) గెలిచింది.
వీళ్ల సహాయంతో అమిత్ షా యుపిని పశ్చిమ యుపి, వ్రజభూమి, అవధ్, కాన్పూర్, గోరఖ్‌పూర్, కాశీ అనే ఆరు జోన్లుగా విభజించి ప్లాన్లు రచించాడు. బిహార్ ఎన్నికలలో స్థానిక నాయకులను పక్కన పెట్టి నష్టపోయారు. అవతలివాళ్లు బిహారీ వెర్సస్ బాహరీ (బయటివాళ్లు) నినాదాన్ని అందుకున్నారు. ఈసారి ఆ పొరపాటు చేయకుండా స్థానికులనే భాగస్వాములుగా చేశాడు. బిహార్‌లో ఫైవ్ స్టార్ హోటల్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తే, యీ సారి ఎక్కువగా పార్టీ ఆఫీసులోనే వున్నాడు. 1.40 లక్షల బూతుల్లో ప్రతి బూత్ కమిటిలో 20-25 మంది కార్యకర్తలను నియమించాడు. ఆరు నెలల ముందు నుంచి బిజెపి వారు 88 యువ సమ్మేళనాలు, 77 మహిళా సమ్మేళనాలు, 200 ఒబిసి సమావేశాలు నిర్వహించారు. 8000 కిమీ సాగిన పరివర్తన్ యాత్ర ద్వారా 50 లక్షల మంది ఓటర్లను బిజెపి వారు కలిశారు. ఆ యాత్ర సందర్భంగా చిన్న నాయకులకు ప్రసంగాలిచ్చే అవకాశం యిచ్చి వారిని ఉత్సాహపరిచారు. కాంగ్రెసుకి సలహాదారుగా వున్న ప్రశాంత కిశోర్ టీముని చీల్చి 50 మందిని తనవైపు లాక్కున్నారు. 150 మంది ప్రొఫెషనల్స్‌తో 13 టీములు ఏర్పరచారు. 5 వేల మంది పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియాను ఎలా హ్యేండిల్ చేయాలో తర్ఫీదు యిచ్చారు. ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా తటస్థ ఓటర్లను ఆకర్షించారు. షా పై తయారు చేసిన వీడియో ''యుపి కె మన్ కీ బాత్'' ను ప్రచారం నడిచినంతకాలం ప్రసారం చేశారు. రైతులు, యువత, మహిళలు వంటి భిన్న వర్గాల కోసం 22 ఐవిఆర్ వీడియో రికార్డింగ్‌లు తయారు చేసి ఉపయోగించారు.
45 రోజుల ఎన్నికల ప్రచారంలో 900 బహిరంగ సభలు నిర్వహించారు. మోదీ 23, అమిత్ షా 90, రాజనాథ్ సింగ్ 75, మౌర్య 200, యోగి ఆదిత్యనాథ్ 80 సభలు హాజరయ్యారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 9.30 లక్షల మంది. వారిలో 7 లక్షల మంది విద్యార్థులే. బిజెపి పార్టీ కార్యకర్తలు కాలేజీ క్యాంపస్‌లకు వెళ్లి వాళ్లను కలుసుకుని బిజెపి అభివృద్ధి పైనే దృష్టి పెడుతుందని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు వుందని అమిత్ షా వారిని ఉద్దేశించి రాసిన లేఖలు పంచారు. 18-25 సం||ల గ్రూపులో 34% ఓట్లు బిజెపికి వచ్చాయని ఒక అంచనా. అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని బిజెపి 2016 జూన్‌లోనే ప్రారంభించింది. ప్రతి నియోజకవర్గానికి 3-4 పేర్లు అనుకుని, టీములను పంపించి ఫ్యీడ్‌బ్యాక్ సేకరించింది. అక్కడి ఎంపీలను, జిల్లా యూనిట్లను, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలను పేర్లు ప్రతిపాదించమంది. అన్ని లిస్టుల్లోను కామన్‌గా వున్న పేరును బట్టి, కులసమీకరణాలు కుదిరితే టిక్కెట్టు యిచ్చింది. గెలుస్తారని భావించిన యితర పార్టీల వారిని పార్టీలోకి తీసుకుంది. 2012లో బిజెపి 13 జిల్లాల నుంచి 47 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన 62 మంది ఫిరాయింపుదార్లకు యీ సీట్లలో కాకుండా తక్కిన చోట్ల టిక్కెట్లు యిచ్చింది.
ఎన్నికల ప్రచారం సాగేటప్పుడు యితర పార్టీలపై నిఘా వేసి వుంచడానికి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్లు ఎన్నికల కమిషన్‌కు 100 ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల కారణంగానే ప్రభుత్వ ఆంబులెన్సులపై 'సమాజ్‌వాదీ' అనే మాట తీసివేయవలసి వచ్చింది. 'అవతలివాళ్లు ఓటుకి డబ్బిస్తే తీసుకోండి, మాకు మాత్రం ఓటేయండి' అన్నందుకు అఖిలేశ్ నోటీసు అందుకోవలసి వచ్చింది. నాయకుల పర్యటనలు పర్యవేక్షించిన కమిటీ ఎవరి సభలు ఎక్కడ నిర్వహించాలో నిర్ణయించింది. మోదీ సభలు ఏర్పాటు చేసినప్పుడు ఆగ్రా, గోరఖ్‌పూర్ వంటి పెద్ద నగరాల్లో కాకుండా మీర్జాపూర్, దేవలియా, గోండా వంటి జిల్లా కేంద్రాల్లో పెట్టారు. అలా అయితే చుట్టుపట్ల గ్రామీణులు, రైతులు హాజరవుతారని అంచనా.
ఇతర పార్టీలు బయటి సంస్థలను పెట్టుకుని సర్వేలు చేయించుకోవలసి వచ్చింది. బిజెపికి పార్టీ కార్యకర్తలతో బాటు ఆరెస్సెస్, విఎచ్‌పి, హిందూ జాగరణ్ మంచ్, బజరంగ్ దళ్, కిసాన్ సంఘ్, కేంద్ర మజ్దూర్ సంఘ్ యిలా ఆరెస్సెస్ అనుబంధ సంస్థలన్నిటి సేవలనూ వుపయోగించుకుంది. బ్రాహ్మణ, రాజపుత్, బనియా ఓట్లు బీరుపోకుండా వేయించుకోవాలని వారికై సదస్సులు నిర్వహించి ఆకట్టుకుంది. ఇతర పార్టీల నుంచి అన్ని స్థాయిల్లో మొత్తం 80 కంటె ఎక్కువ మంది నాయకులను ఫిరాయింపు చేసుకుంది. జాట్లను ఆకట్టుకోవడానికి అమిత్ షా స్వయంగా నడుం బిగించాడు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు పశ్చిమ యుపిలో జాట్ నాయకుడు, కేంద్రమంత్రి అయిన చౌధరీ బీరేందర్ సింగ్ యింటికి వెళ్లాడు. అక్కడకు అన్ని జిల్లాల నుంచి జాట్ నాయకులు వచ్చారు. వాళ్లంతా తమకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు యివ్వటం లేదని, 2013లో జరిగిన మతకలహాల్లో ముద్దాయిలుగా తమ యువకులను కేసుల్లో యిరికించి, పోలీసులు వేధిస్తున్నారని చాలా పరుషమైన భాషలో మూడు గంటలపాటు అమిత్‌ను ఊదరగొట్టేశారు. అమిత్ శాంతంగా అదంతా విని, చివరిలో నెమ్మదిగా ''ఏ పార్టీ మీకు రిజర్వేషన్లు యిస్తుంది? మీరు ఎప్పుడూ మద్దతు యిచ్చే ఆర్ఎల్డి నాయకుడు అజిత్ సింగ్‌కు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి కాగలడా? బిజెపి ఓడిపోయే పక్షంలో గెలిచేదెవరో మీకూ తెలుసు. మీరు అలిగితే మీకూ నష్టం, బిజెపికి నష్టం. ఆలోచించుకోండి.'' అని చెప్పి వచ్చేశాడు. జాట్లకు అర్థమైంది, అజిత్ సింగ్‌కు ఓట్లేసి లాభం లేదని. అందుకే ఆర్ఎల్డికి ఒకే సీటు వచ్చింది. బిజెపి పశ్చిమ యుపిలో గెలుపు సాధించింది.
యుపిని కాంగ్రెసు చాలాకాలం పాలించింది. అన్ని కులాలలోను దానికి సమర్థకులు వుంటూ వచ్చారు. కాంగ్రెసును ఓడించే ప్రయత్నంలో ప్రతిపక్షాలు క్రమేపీ కులాల వారీగా సమాజాన్ని విడగొట్టడానికి చూశాయి. లోహియా వాదులు బిసిలను కూడగట్టి రాజకీయంగా బలపడ్డారు. బియస్పీ హరిజనులను కూడగట్టి బలపడింది. బిజెపి అగ్రవర్ణాల వారిని ఆకర్షించారు. వీరిలో ఎవరికీ చాలినంత బలం లేకపోవడంతో ఒక్కోసారి ఒక్కోరితో పొత్తు పెట్టుకుని కాంగ్రెసును నిలవరించారు. బియస్పీ ఎస్పీతో ఓసారి, బిజెపితో మూడు సార్లు పొత్తు పెట్టుకుంది. ఒక దశలో కులాల సమీకరణల్లో తాము నెగ్గుకు రాలేమని గ్రహించిన బిజెపి కులాల కతీతంగా హిందూత్వ పేరు మీద సాధ్యమైనంతమంది హిందువులను సమీకరిద్దామని రథయాత్ర మొదలు పెట్టింది. అప్పుడే 221 గెలిచింది. కానీ అది ఎక్కువకాలం కొనసాగలేదు. మళ్లీ కులాల వారీగా చీలిపోయింది. ఇప్పుడు మళ్లీ నెగ్గాలంటే ముస్లిము వ్యతిరేకతను బాహాటంగా ప్రదర్శించడంతో బాటు కుల సమూహాలను ఉపకులాలుగా చీలుద్దామని పథకం రచించారు.
బియస్పీ దళితుల్లో జాతవులనే ఎక్కువగా ఆదరిస్తోందని, ఎస్పీ బిసిలలో యాదవులనే ఎక్కువగా ఆదరిస్తోందని గ్రహించి జనాభాలో 10% వున్న జాతవేతర దళితులకు, జనాభాలో 25% వున్న యాదవేతర బిసిలకు ప్రాధాన్యత యిచ్చారు. వీళ్లకు 223 టిక్కెట్లు యిచ్చారు. 18% వున్న అగ్రవర్ణాలు ఎలాగూ చేతిలో వున్నాయి. వీరి పైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. బిసిలలో దాదాపు 200 ఉపకులాలుగా వున్న 38 కులాలను కులాలను గుర్తించి వారిని చేరదీశారు. 2016 ఏప్రిల్‌లో కేశవ్ ప్రసాద్ మౌర్య అనే యాదవేతర ఒబిసిని, విశ్వహిందూ పరిషత్ నాయకుణ్ని లక్ష్మీకాంత్ బాజ్‌పేయి అనే బ్రాహ్మణుడి స్థానంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. జిల్లా అధ్యక్ష పదవుల నుంచి, బూత్ కమిటీ సభ్యుల దాకా యీ కులాల ఫార్ములాను అమలు చేశారు. ఎన్నికలలో మొత్తం 126 మంది ఒబిసిలకు టిక్కెట్లిచ్చారు. మొన్నటిదాకా ప్రభుత్వాన్ని యాదవులు యిప్పుడు ప్రాభవం కోల్పోయారు. మొత్తం ఎమ్మెల్యేలలో 18 మందే యాదవులు. వారిలో ఆరుగురు బిజెపి నుంచే! దళితుల విషయానికి వస్తే బిజెపికి చెందిన 40 మంది దళిత ఎంపీలను మొత్తం 403 స్థానాలను పర్యటించమన్నారు. 2016 ఏప్రిల్-అక్టోబరు మధ్య 250 మంది బౌద్ధసన్యాసుల చేత బుద్ధ ధమ్మ యాత్ర నిర్వహింపచేశారు. వాళ్లు 453 సభలు నిర్వహిస్తే 4 లక్షల మంది దళితులు వాటికి హాజరయ్యారు. ఆ విధంగా పశ్చిమ యుపిలోని బియస్పీ దళిత కంచుకోటలోకి బిజెపి చొరబడగలిగింది. అంతిమంగా 84 దళిత స్థానాల్లో బిజెపి 72 గెలిచింది. బియస్పీ 2 మాత్రమే గెలిచింది. దళితుల ఓట్లలో బిజెపికి 17%, బియస్పీకి 62% పడ్డాయట.
బిజెపి కూటమికి యింత ఘనవిజయం ఎందుకంటే – దానికి 41.4% వచ్చాయి. తక్కిన 58% ఓట్లలో ఎస్పీ కూటమి 28%, బియస్పీ 22%, ఇతరులు 8% పంచుకున్నాయి. 2012తో పోలిస్తే ఎస్పీకి 7%, కాంగ్రెసుకు 6%, బియస్పీకి 4%, యితరులకు 10% తగ్గగా అవన్నీ కలిపి బిజెపికి 27% (26.4%) వచ్చి చేరాయి. ఇతరులు గతంలో 24 సీట్లు గెలవగా యీ సారి 5 మాత్రమే గెలిచారు. అంటే బిజెపి కూటమి, ఎస్పీ కూటమి, బియస్పీలనే ప్రధాన పాత్రధారులుగా ఓటర్లు గుర్తించారు. 92% ఓట్లు వాళ్ల మధ్యే పంచారు. 2014లో వచ్చిన 42.6% ఓట్లు వస్తే యీసారి కాస్త తక్కువగా 39.7% వచ్చాయి. ఒక అంచనా ప్రకారం – బిజెపికి ఎప్పుడూ ఓటేస్తూ వచ్చిన అగ్రవర్ణాలలో యీసారి 62% రావడంతో బాటు యాదవేతర ఒబిసిలలో 58%, యాదవుల్లో 7%, జాట్లలో 43%, ముస్లిములలో 2% వచ్చాయట.
రామ మందిరం అంశాన్ని ముందుకు తీసుకుని వస్తే పెద్దగా ప్రయోజనం వుండదని బిజెపి భావించింది. నోట్ల రద్దుపై ఎంత మాట్లాడాలో తేల్చుకోలేక పోయారు. వాణిజ్యవర్గాలు దానిపై అలిగితే బుజ్జగించారట. సాధారణ ప్రజలు మాత్రం నోట్లరద్దు దీర్ఘకాలంలో తమకు మేలు చేస్తుందని నమ్మారు కాబట్టి దాన్ని ఒక వ్యతిరేక అంశంగా పరిగణించలేదు. వివాదం లేని సర్జికల్ దాడులు వంటి అంశాలని ప్రస్తావించి బిజెపి జాతీయ గౌరవాన్ని హైలైట్ చేయాలని అనుకుంది. బియస్పీ పాలన అవినీతికి, యస్పీ పాలన గూండాయిజానికి పేరు బడింది కాబట్టి 10 వేల బిజెపి వ్యాన్లపై 'గూండారాజ్ లేదు, భ్రష్టాచార్ (అవినీతి) లేదు' అనే నినాదాలు రాయించి వూరూరా తిప్పారు. ప్రతీ జిల్లాలో యాంటీ-రోమియో స్క్వాడ్లు పెడతామన్నారు. పెరోల్ మీద బయటకు వచ్చిన నేరస్తులను మళ్లీ జైలుకి పంపుతామన్నారు. రైతులకు ఋణమాఫీ చేస్తామన్నారు. ఇది రైతులను విపరీతంగా ఆకట్టుకుందని అంటున్నారు. యుపిలో విజయం కోసం కేంద్రం ఎప్పణ్నుంచో పక్షపాతం చూపించసాగింది. పేద మహిళలకు గ్యాస్ కనక్షన్ యిచ్చే ప్రధాని ఉజ్జ్వల యోజనాలో 60% ఉత్తర్ ప్రదేశ్‌కే కేటాయించారు. ఈ విధంగా అన్ని వయసుల వారిని ఆకర్షించారు. 26-35 మధ్య వయసువారిలో 36%, 36-50 లో 37%, 51-60లో 40%, 60 కంటె పై వయసువారిలో 42% ఓట్లు పడ్డాయట. వీటన్నిటి కారణంగా యాదవుల కంచుకోటలైన ఎటావా, మయిన్పూరిలలో 7 సీట్లలో 3 గెలిచినట్లు గానే జాతవులు అధికంగా వున్న ఆగ్రా, బుందేల్ ఖండ్లలో కూడా బిజెపి గెలిచింది.
ఎస్పీ-కాంగ్రెసు కూటమి విషయానికి వస్తే ఎన్నికలు ముంచుకు వస్తూండగా అఖిలేశ్‌ను కుటుంబకలహం తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ కలహమేదో ఏడాది క్రితం వచ్చినా అప్పటికి సర్దుకునేదేమో. ఎన్నికల సమయానికి పార్టీలో గందరగోళం ఏర్పడి, కార్యకర్తలు చురుగ్గా పనిచేయలేక పోయారు. శాంతిభద్రతల విషయంలో అఖిలేశ్ వైఫల్యాన్ని బిజెపి బాగా వుపయోగించుకుంది. ఎస్పీ యాదవ పక్షపాతి అనే ముద్ర యితర కులాలకు దూరం చేసింది. దానికి తోడు అతని కాబినెట్లో గాయత్రీ ప్రజాపతి వంటి క్రిమినల్స్, అవినీతి ఆరోపణల్లో తలమునకలైన మంత్రులు అతని ప్రతిష్ఠను దిగజార్చారు. అఖిలేశ్ బందీగా చేసి, అతని మాట సాగకుండా చేసినందుకు ములాయం, అతని సోదరుడికి ఓటర్లు బుద్ధి గరపినట్లయింది. ఆ పార్టీ మద్దతుతోనే ముఖ్యమంత్రి అయినందుకు అఖిలేశ్కూ శిక్ష పడింది. కలహాల్లో మునిగి తేలి, చివరకు తేరుకుని చాలా లేటుగా తొలి షెడ్యూల్ ప్రకటించిన తర్వాతనే కాంగ్రెసుతో కూటమి ఖరారు అయింది. బిజెపి సన్నాహాలు చేసుకున్న తర్వాత ఏడాదికి యీ కూటమి నడుం బిగించింది. ఇద్దరూ కలవడం వలన యీ సారి ఆ కూటమికి 41% రాలేదు. 28% వచ్చాయి. అంటే ఓట్ల బదిలీ జరగలేదనుకోవాలి. 2012లో 28 గెలిచిన కాంగ్రెసుకు 105 యివ్వడం తప్పని ఎస్పీ కార్యకర్తలు భావించారు కానీ పోటీ చేసిన స్థానాల్లో గెలుపు శాతం చూడబోతే కాంగ్రెసు 7% వస్తే, ఎస్పీకి 16% వచ్చాయంతే. ఓట్లశాతంలో చూస్తే కాంగ్రెసుకు 2012 కంటె 5.5% ఓట్లు తగ్గితే, ఎస్పీకి 7.3% తగ్గాయి.
అఖిలేశ్ కాంగ్రెసుతో కలవకుండా వుంటే 100 సీట్లు గెలిచేవాడని కొందరంటారు. ఎస్పీ, కాంగ్రెసు 22 స్థానాల్లో పరస్పరం పోటీ పడ్డారు. కాంగ్రెసుకు 105 సీట్లు యివ్వడానికి 60 మంది ఎస్పీ సభ్యులను తప్పించడంతో చాలా చోట్ల ఎస్పీ రెబెల్స్ నిలబడ్డారు. కాంగ్రెసులోనూ అదే జరిగింది. కాంగ్రెసు వారూ రెబెల్స్‌గా నిలబడి అవకాశాలు చెడగొట్టారు. కాంగ్రెసు 2014లో పెల్లుబికిన ఆగ్రహం యింకా తగ్గలేదని రుజువైంది. కాంగ్రెసు గతంలో గెలిచిన 28టిలో 2 మాత్రమే నిలుపుకుంది. కొత్తగా 5 గెలిచింది. 105కి పోటీ చేసి 7 గెలిచింది. బిజెపి భాగస్వామి అప్నా దళ్ 11లో పోటీ చేసి 9 గెలిచింది! రాయబరేలీ పరిధిలో 2 గెలవగా, అమేఠీలో ఒక్కటీ గెలవలేదు. ఎందుకంటే అక్కడ భాగస్వామి ఐన ఎస్పీతోనే పోటీ పడింది. అమేఠీ, రాయబరేలీలలో వున్న 10 సీట్లలో బిజెపి 6 గెలిచింది. ఎస్పీకి కూడా కంచుకోట ఐన కనౌజ్ పరిధిలో ఒక అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచింది. సొంత జిల్లా ఇటావాలో ఐదిటిలో ఒక్కటీ గెలవలేదు. బంధువుల్లో శివలాల్ యాదవ్ తప్ప అందరూ ఓడిపోయారు. శివలాల్-అఖిలేశ్ కలహానికి కారకుడైన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ స్వయంగా గెలిచినా అతని తమ్ముడు, కొడుకు ఓడిపోయారు. ఎస్పీకి 2012లో 29% వచ్చాయి, కాంగ్రెసుకు 12% వచ్చాయి.
యుపిలో ఓటింగు శాతం ఎప్పుడూ తక్కువే. ఈ సారి 61.1% జరిగింది. దానికది ఎక్కువే. దీనిలో మహిళలు మగవారి కంటె 3% ఎక్కువగా ఓటేశారు. వారు శాంతిభద్రతల అంశంపై ఎక్కువగా స్పందిస్తారని అనుకోవచ్చు కాబట్టి అది ఎస్పీకి నష్టం కలిగించి వుండవచ్చు. దానికి యాదవుల్లో 80% ఓట్లు వచ్చినా, యాదవేతర బిసి ఓట్లలో 18%, అగ్రవర్ణాలలో 16% మాత్రమే వచ్చాయి. ముస్లిముల్లో 70% ఓట్లు వచ్చినా, దళితుల్లో 9% మాత్రమే వచ్చాయంటున్నారు. అఖిలేశ్‌పై ఓటర్లలో, ముఖ్యంగా యువతలోనే కాక అన్ని వయసు వారిలో ఆదరణ వుంది. 18-25 గ్రూపులో 31%, 26-35లో 30%, 36-50లో 29%, 51-60లో 30%, 60 దాటిన వారిలో 28% ఓట్లు వచ్చాయట. ఓటర్లకు అఖిలేశ్‌పై వున్న అభిమానం అతని ఎమ్మెల్యేలపై లేదు. ఒకసారి గెలిచాక వాళ్లు మళ్లీ తమ పాత కులపక్షపాత, హింసాత్మక విధానాలను కొనసాగిస్తారన్న భయం మిగిలిపోయింది. 25 మంది మంత్రులు పోటీ చేస్తే 15 మంది ఓడిపోయారు.
బియస్పీ 2007లో బ్రాహ్మణ, దళిత, ముస్లింలను కలుపుకుని గెలిచింది. అప్పుడు 206 సీట్లు వచ్చాయి. ఇప్పుడు దానిలో 10% కూడా రాలేదు. గెలిచాక ఆమె బ్రాహ్మణులను దూరం చేసుకుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే చాలామంది నాయకులు ఆమెను విడిచి వెళ్లిపోయారు. స్వామి ప్రసాద్ మౌర్య, బ్రిజేశ్ పాఠక్ వంటి ప్రముఖులు వెళ్లి బిజెపిలో చేరారు. అందుకే 87 దళితులకు, 97 ముస్లింలకు, 106 మంది ఓబిసిలకు, 113 మంది అగ్రవర్ణాలకు టిక్కెట్లు యిచ్చినా లాభం కలగలేదు. 5గురు ముస్లిములు మాత్రమే గెలిచారు. జనాభాలో దళితులు 20.5% వారిలో 56% మంది జాతవులు. అంటే 11% వరకు మాయావతికి గ్యారంటీ. కానీ తక్కినవాళ్లలో ముస్లిములు తప్ప యితరులు పెద్దగా ఓట్లేయలేదన్నమాట. చివరకు చూస్తే 19 సీట్లు మాత్రం వచ్చాయి. లోకసభలో ఒక్క ఎంపీ కూడా లేడు. రాజ్యసభలో ఆరుగురున్నారు. ఏడాది పోయాక తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతుంది. మళ్లీ ఎన్నికవుతుందన్న నమ్మకం లేదు. 2012లో 26% ఓట్లతో 80 సీట్లు గెలిచిన 2014లో 20% ఓట్లతో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచింది. ఇప్పుడు 2% ఓట్లు పెంచుకుంది. బిజెపి తర్వాత ఓటింగు శాతంలో ద్వితీయ స్థానం బియస్పీదే. దీనికి కారణం బియస్పీ 403 సీట్లలో పోటీ చేసింది కానీ ఎస్పీ 298 సీట్లలోనే పోటీ చేసింది. బియస్పీకి 62% దళితుల ఓట్లు, 16% ముస్లిము ఓట్లు వచ్చాయట.
ముస్లిములు ఎటు ఓటు వేశారన్నదానిపై కాస్త కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారు. బిజెపి హిందూత్వాన్ని విచ్చలవిడిగా వాడుకుంది. 4జి కి కొత్త అర్థం చెప్పారు – గావ్ (గ్రామం), గంగా, గీతా, గాయ్ (ఆవు) అంటూ! మోదీ రంజాన్, దీపావళి పండగలకు విద్యుత్ సరఫరా గురించి, కబరిస్తాన్, శ్మశానాల గురించి మాట్లాడి హిందువులకు అన్యాయం జరుగుతోందన్న కలర్ యిచ్చారు. దానికి సమాధానంగా ఎస్పీ ప్రభుత్వం ఆ యా పండగల్లో విద్యుత్ సరఫరా గురించిన పూర్తి సమాచారాన్ని సవివరంగా విడుదల చేసింది. కానీ దానికి ప్రచారం రాలేదు. మోదీ మాటలే ప్రజల్లో నాటుకున్నాయి. ఓట్ల కోసం ముస్లిములను బుజ్జగిస్తున్న పార్టీలు దేశద్రోహులని సూచించడానికి, స్ఫురించడానికి కాంగ్రెసులో 'క', సమాజ్‌వాదీలో 'స' బహుజన్ సమాజ్ లో 'బ' కలిపి 'కసబ్' అనే జిహాదీ పేరు పెట్టారు. ముస్లిం ఓట్లు చీలిపోకుండా చూడడానికే ఎస్పీ- కాంగ్రెసు ఏకమయ్యాయని, ముస్లిము మద్దతు కోసమే బియస్పీ ముస్లిము జనాభాను మించి దాదాపు వందమంది ముస్లిములకు టిక్కెట్లు యిచ్చిందని, ఎస్పీ, కాంగ్రెసు, బియస్పీ ఎవరు గెలిచినా తమ కారణంగానే అని ముస్లిములు విర్రవీగుతారని బిజెపి, ఆరెస్సెస్ వర్గాలు యింటింటికి తిరిగి ప్రచారం చేశాయి. ఎన్నికల పొత్తు కారణాలు, బియస్పీ టిక్కెట్టు యిచ్చిన కారణాలు అందరికీ విదితమే కాబట్టి యీ వాదన అందరినీ మెప్పించింది. అఖిలేశ్ ప్రభుత్వ పనితీరు గురించి చర్చ తక్కువగానే జరిగి దీనిమీదనే ఎక్కువ ఫోకస్ పడింది.
ముస్లింలు అత్యధికంగా వున్న ముజఫరాబాద్, మొరాబాబాద్, అలీగఢ్ జిల్లాలలో వారి ఓట్లను బియస్పీ, ఎస్పీ సమానంగా పంచుకుని బిజెపి గెలిచేసింది. బియస్పీ, ఎస్పీ ముస్లిము అభ్యర్థులు పోటీ చేసిన 180 స్థానాల్లో 80% చోట్ల ఓట్లు చీలి బిజెపి అభ్యర్థి గెలిచాడు. ముస్లిముల జనాభా 19% వున్నా దీని వలన గతంలో 69 అంటే మొత్తం సీట్లలో 17% మంది వుండే ముస్లిం ఎమ్మెల్యేలు 24 (అంటే 6% మంది) కు తగ్గిపోయారు. గమనించ వలసిన అంశం ఏమిటంటే ఒక లెక్క ప్రకారం ఓటర్లలో 25% ముస్లిములున్న 88 నియోజకవర్గాల్లో బిజెపి 57 నెగ్గగా, ఎస్పీ 28, బియస్పీ 3 నెగ్గాయి. ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఓట్లన్నీ కూడగట్టడంతో యిది సాధించింది అనుకున్నా అలహాబాద్ వెస్ట్‌లో ముస్లిములు ఎక్కువ అయినా బిజెపి అభ్యర్థి 50 వేల మెజారిటీతో గెలిచాడుట. దీని అర్థం ఏమిటి? ముస్లిములు బిజెపికి వేశారనా? ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ త్రిపుల్ తలాక్ పై బిజెపి విధానం గురించి వివరించి ముస్లిం మహిళలు కొంతమందిని బిజెపి వైపు తిప్పిందంటున్నారు. నిజానిజాలు నిదానం మీద కానీ తెలియదు. కానీ లఖనవ్లోని షియా ముస్లిముల్లో ఒక వర్గం ఎప్పుడూ బిజెపికి ఓటేస్తూ వచ్చిందని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ విమెన్ అసోసియేషన్‌కు చెందిన తహీరా హసన్ అనే ఆమె అంది. ఇండియా టుడే ప్రకారం ముస్లిముల్లో 70% ఎస్పీకి, 16% బియస్పీకి వేశారు. తక్కిన 14%లో మజ్లిస్‌కు, స్వతంత్రులకు, యితరులకు 12% పోగా 2% ముస్లిములు బిజెపికి, దాని భాగస్వామ పక్షాలకు ఓటేశారు.
మాయావతికి ముస్లిం స్థానాల్లో బిజెపి గెలుపు బోధపడక, ఇవిఎంలను తప్పుపట్టింది. పరాజితులు యిలాటి ఆరోపణలు చేయడం ఎప్పుడూ వుండేదే. 1971 పార్లమెంటు ఎన్నికలలో ఇందిర అఖండ విజయం సాధిస్తే జనసంఘ్ (బిజెపి పూర్వరూపం) మాజీ అధ్యక్షుడు బలరాజ్ మధోక్ అదృశ్యమయ్యే సిరా వాడారని పెద్ద యాగీ చేశాడు. చంద్రబాబు కూడా ఇవిఎంలను తప్పు పట్టిన సంగతి గుర్తుండే వుంటుంది. సమాజంలో 20-30% వుండే కులాలను ఆకట్టుకుని ఎస్పీ, బియస్పీ యిన్నాళ్లూ రాజ్యం చేశాయి. ఇప్పుడు బిజెపి వాళ్లకు భిన్నంగా మతరాజకీయం, దానితో బాటు ఉపకులాలను సంఘటితం చేయడంతో విజయం సాధించింది. కేవలం అంకెలు కూడితే విజయం సిద్ధించలేదు. వెనకాల ఎంతో కసరత్తు జరిపింది. బిజెపికి వ్యతిరేకంగా బిహార్ తరహాలో ఎస్పీ, బియస్పీ మహాకూటమిగా ఏర్పడే అవకాశాలు యుపిలో మృగ్యం. ములాయం, మాయావతి యిద్దరూ మొండివాళ్లే. వారితో యితరులకు పొత్తు కలవడం కష్టం. కుల ప్రస్తావనతో చేసే రాజకీయాలకు స్వస్తి చెప్పి, కొత్త బాట వెతుక్కుని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి చాలా సమయమే పడుతుంది. ఈలోగా బలపడడానికి, ప్రజల్లో రేకెత్తించిన ఆశలు కొన్నయినా నెరవేర్చే చక్కని అవకాశం బిజెపికి వుంది. యుపి పాలన అత్యంత క్లిష్టమైనది. అడ్మినిస్ట్రేషన్ ఎన్నో దశాబ్దాలుగా కుళ్లిపోయి వుంది. సమర్థవంతంగా నడపడం ఎవరికైనా కష్టమే. ప్రజలకు ఏ కొద్ది మేలు జరిగినా హర్షించదగ్గదే.
– ఎమ్బీయస్ ప్రసాద్
– [email protected]