అతి తెల్లవాళ్లకు అతి నల్లవాళ్లంటే చులకన. ఇందుకోసం ఆఫ్రికాలో యుధ్దాలు జరిగాయి. అమెరికాలో సంస్కరణలు జరిగాయి. ఆఫ్రికాలో చాలా వరకూ పోయినా, అమెరికాలో పోలేదు. సరికాదా ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. దీనిని 'జాత్యహంకారం' అంటారు.
కానీ, కొంచెం నల్లవాళ్లకు కూడా, అతి నల్లవాళ్లంటే లోకువ. ఈ వివక్ష అక్కడా, ఇక్కడా కాదు, ఏకంగా మనదేశంలోనే జరుగుతోంది. 'నీల మేఘశ్యాముల'యిన రాముణ్ణీ, కృష్ణుణ్ణీ ఆరాధించే 'భారతం'లో జరుగుతోంది. మరి దీనినేమనాలి? 'తమ్ముడు మనవాడయినా తగవు నిజమాడాలి'. మరో మాటలేదు. 'జాత్యహంకార'మనే అని తీరాలి. కానీ మనపాలకులకు ఈ మాట అనటానికి ఇష్టం లేదు. గత (2017 మార్చి చివరి) వారం రోజులుగా, గ్రేటర్ నోయిడాలో కెన్యా, నైజీరియా దేశస్తుల మీద మన దేశస్తులు వరుస దాడులు చేస్తున్నారు. ఒక్క 'బ్లాక్' మీద అయిదుగురో, ఆరుగురో దాడి చేయటం కాదు. అయిదు వందలనుంచి, ఆరు వందల మంది ఒక్కో 'నల్ల' జాతీ యుణ్ణి చావు దెబ్బలు కొడుతున్నారు. స్పృహ తప్పినా చితక బాదుతున్నారు. దాదాపు అన్నీ సామూహిక దాడులే. ఈ వారంలో తొమ్మిది మంది నైజీరియన్లు ఈ దాడులకు గురయ్యారు. అందులో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు.
నిజమే. నిప్పులేకుండా పొగరాదంటారు. కానీ 'నిప్పు' ఒక చోట వుంటే, 'పొగ'ను వేరొక చోట ఊహించుకుని దాడులు చేస్తున్నారు. ఇదే గ్రేటర్ నోయిడాలో, ఓ భారతీయ యువకుడు చనిపోయాడు. అతడు 'మాదక ద్రవ్యాలు అతిగా సేవించి' చనిపోయాడని, అతని కుటుంబ సభ్యులకు అనుమానం. ఈ 'మాదక ద్రవ్యాల'ను నైజీరియన్లే అందించి వుంటారని నిర్ధారణకు వచ్చి, పోలీసు లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇదే అనుమానం మీద అయిదుగురి నైజీరియన్ యువకులను అరెస్టు చేసి, నిర్బంధించారు. అయితే, తర్వాత ఆ భారతీయ యువకుడి మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు. కానీ రిపోర్టుభిన్నంగా వచ్చిందని సమాచారం. మాదక ద్రవ్యాలు సేవించి మృత్యువు పాలయినట్లుగా నివేదిక రాలేదు. అయినా, నిర్బంధంలో వున్న నైజీరియన్లను విడుదల చేయలేదు. ఇందుకోసం, అసోసియేషన్ ఆఫ్ ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా(ఆసి) తరపున కాలేజీ, వర్శిటీల్లో చదివే విద్యార్థునులు ప్రదర్శన చేశారు. 'అక్రమ నిర్బంధం'లో వున్న తమ దేశీయులను విడుదల చెయ్యాలని డిమాండ్‌చేశారు. వీరు చేసిన ప్రదర్శనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు.
కానీ వీరు రోడ్ల మీదకు రావటం నోయిడాలో పలువురుకి నచ్చలేదు. దాంతో నైజీరియన్లకు వ్యతిరేకంగా, మృతుడి కుటుంబానికి మద్దతుగా వారు ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలే హింసాత్మకంగా మారాయి. 'బ్లాక్' కనిపిస్తే చాలు, దాడి చేశారు. ఇలా దాడి చేస్తుండగా తీసిన ఒక వీడియోను 'సామాజిక మాధ్యమాల్లో' ఆసి పోస్టుచేస్తే, అది వైరల్‌అయ్యింది. స్పృహ తప్పి పడివున్న ఒక నైజిరీయ న్ యువకుణ్ణి వందలాది మంది కాళ్లతో కుమ్మారు; చేతులతో గుద్దారు; ఇనుప రాడ్లతో కొట్టారు.
ఈ పోస్టును చూస్తే, ఎవరి హృదయమయినా ద్రవిస్తుంది. కానీ దీని తర్వాత మరింతగా దాడులు జరుగుతున్నాయి. నైజీరియన్లు నోయిడాలో తమ 'రూమ్స్' నుంచి బయిటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఒక షాపులో ఇలాంటి దాడికే గురయిన, అవాల్‌అలియూ అనే విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్సపొంది, తన గదికి వెళ్లాక, మళ్లీ బయిటపడితే ఒట్టు. వణికి చస్తున్నానని మీడియాకు చెప్పాడు.
ఎవరో ఒక నైజీరయన్ 'మాదక ద్రవ్యాల'ను అమ్ముతూ పట్టుపడితే, మొత్తం ఇండియాలో వుండే 'నైజీరియన్లందరూ' అదే బాపతు అనే నిర్ధారణకు రావటమే 'జాత్యహంకారం'. అమెరికాలో వున్న ఉద్యోగాలన్నీ అక్కడి తెల్లవాళ్లకు దక్కకుండా, భారతీయులు దోచుకుంటున్నారని, అక్కడ వున్న ప్రతీ భారతీయుణ్ణి శత్రువుగా చూడటం 'జాత్యహంకారం' కాలేదా? ఈ 'జాత్యహంకారం' వల్లనే శ్రీనివాస్ కూచిభొట్ల ఒక శ్వేత జాతీయుడు పొట్టన పెట్టుకోలేదా?
మన దేశంలో అట్టడుగు కులాల కూలీల మీద జరిగే అగ్రవర్ణ భూస్వాములు చేసే దాడులు ఇలాం టివే. అది 'జాత్యహంకారం' అయితే మనది 'వర్ణాహంకారం' . ఇంతకీ భారతీయులు తెలుపు. నలుపు జాతీయులు వుండే దేశాలకు వెళ్లినప్పుడు ఎవరి పక్షం వహిస్తారు? 'నల్ల' వాళ్ల పక్షమా? 'తెల్ల' వాళ్ల పక్షమా? ఈ సమస్య గాంధీ దక్షిణాఫ్రికాలో వున్నప్పటి నుంచీ వుంది. తెల్లవాళ్లు మాత్రమే ప్రయాణించే ఫస్ట్ క్లాస్‌లో గాంధీ ప్రయాణిస్తానంటే, అక్కడి అధికారులు రైలు నుంచిదించేశారు. ఈ అవమానం తర్వాతనే గాంధీ, అక్కడి భారతీయులను తెల్లవాళ్లకు వ్యతిరేకంగా కూడగట్టారు. అనివార్యంగా నల్ల వాళ్లకు చేరువయ్యారు. కానీ 'లోయర్ క్లాస్‌లో నల్లవాళ్లతో కలసి ప్రయాణం చేయటం ఇష్టం లేకనే అసలు గాంధీ ఫస్ట్‌క్లాస్ ఎక్కారేమో!' అన్న అనుమానాలను కూడా కొందరు చారిత్రక విశ్లేషకులు నేటికీ చేస్తూవుంటారు.
అది వేరే విషయం. అక్కడి జాత్యహంకారానికి, ఇక్కడి కుల వివకక్షూ సమానంగా స్పందించిన సంఘసంస్కర్త ప్రొ.రెనడేయే గాంధీ దృష్టిని మార్చాడు. అప్పుడు గాంధీ మనదేశంలో అస్పృశ్యుల నమస్య మీద దృష్టి సారించారు. భూమధ్య రేఖ ఎక్కడ నుంచి వెళ్లిందో అక్కడే మానవ వికాసానికి తొలి అడుగులు పడ్డాయి. అలా చూస్తే మానవేతిహాసానికి మూల విరాట్టులు ఆఫ్రికన్ దేశాల వారు. ఇదే భూమధ్య రేఖ కొంచెం పక్కన నుంచి వెళ్లిన భారతీయులు కూడా కొంచెం తేడాలో ఇదే కోవకు చెందిన వారు. కాబట్టే ఇక్కడ నలుపు కాస్త పలచబడింది. కానీ ఉత్తర భారతంలో వున్నవారు, దక్షిణాది వారికన్నా కొంచెం రంగుఎక్కువన్న భావనవుంది. వేరే ఖండం నుంచి వలస వచ్చారన్న చారిత్రక సూత్రీకరణలు కూడా వున్నాయి. అక్కడ దక్షిణ భారతం చూస్తే 'కుల వివక్ష' కూడా ఎక్కువ. అది చాలక ఇప్పుడు 'జాతి వివక్ష'ను కూడా పులుముకుంటున్నారు. ఇలా పులుముతున్నది బాగా చదువుకున్నవారు. ఇది బాధాకరం. నోయిడాలో వుండే కుటుంబాల్లో అత్యధికులు ఐటీ రంగంలో పని చేసేవారే. చదవేస్తే లేని 'జాతి' బయిటకొచ్చింది!
-సతీష్ చందర్