తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, రాజకీయంపై ఇంకోసారి క్లారిటీ ఇచ్చేశాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ ప్రస్తుతానికి లేదని తేల్చి చెప్పేశాడాయన. ఇంతే, ఇక్కడితో రజనీకాంత్ రాజకీయానికి 'ఫుల్ స్టాప్' పడ్డట్టే.! నమ్మేద్దామా.? 'నాకూ అధికారం మీద ఆసక్తి వుంది..' అని చెప్పిన మాటల సంగతేంటి.! ఆ ఒక్కటీ అడక్కూడదంతే. రజనీకాంత్ సినిమాల్లో పాపులర్ డైలాగ్ ఒకటుంది.. 'నేను ఒక్కసారి చెబితే, వందసార్లు చెప్పినట్లు..' అని.
కానీ, రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడతాడు.. అదే రాజకీయాల గురించి ఆలోచించేటప్పుడు సన్నిహితులతో ఇంకో మాట మాట్లాడతాడు. అదీ రజనీకాంత్ స్టయిల్. 'అభిమానులూ పరిగెత్తుకొచ్చెయ్యండి.. రాజకీయాలు మాట్లాడేసుకుందాం..' అని సంకేతాలు పంపిందెవరట.? ఇప్పుడు ఆ అభిమానులతో జస్ట్ ఫొటోలు దిగడానికేనని చెబుతున్నదెవరట.? రజనీకాంత్‌కి మరీ కామెడీ అయిపోయింది రాజకీయం అంటే.
అభిమానులతోనూ, మీడియాతోనూ ఈ తరహా ఆటలు రజనీకాంత్‌కి కొత్తేమీ కాదు. అయినాసరే, రజినీకాంత్ సూపర్ స్టార్. అందుకే, ఆయన ఏం చెప్పినా, అదో హాట్ సెన్సేషన్ అయి తీరుతుందంతే. 'రాజకీయాలపై ఆసక్తి లేదు..' అన్న మాట, రజనీకాంత్ నోట ఎప్పటినుంచో వింటూనే వున్నాం, పొలిటికల్‌గా ఆయన తెరవెనుక స్కెచ్‌లు వేయడమూ చూస్తూనే వున్నాం. రజనీకాంత్ మాటలు, చేతలూ రైలు పట్టాల్లాంటివి అనుకోవాలేమో. రెండూ కలిస్తే, ఆ 'పాయింట్' ఎలా వుంటుందో ఊహించగలం. అవి కలిసేదెప్పుడు.? ఏమో మరి, రజనీకాంత్‌కే తెలియాలి.