మొన్నటికిమొన్న చిన్నారి అదితి త్రిపాఠి పేరు వైరల్ అయింది. పదేళ్ల వయసులో ఆమె ఏకంగా 50 దేశాలు చుట్టేసింది. ఇప్పుడు ఇండియాకు చెందిన మరో చిన్నారి మరో రికార్డ్ సృష్టించింది. 5 ఏళ్ల వయసులో కారులో ఏకబిగిన 9 రాష్ట్రాలు చుట్టేసింది.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఐదేళ్ల సంయుక్త కన్నన్ ఈ రికార్డ్ సృష్టించింది. తన తల్లిదండ్రులతో కలిసి ఏప్రిల్ 23న కారులో ప్రయాణం ప్రారంభించింది సంయుక్త. కోయంబత్తూరులోని సేవాశ్రం ట్రస్ట్ నుంచి ప్రారంభమైన వీళ్ల యాత్ర 2 వారాల పాటు సాగింది.
ఈ 2 వారాల్లో 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాన్ని వీళ్లు కవర్ చేశారు. ఈ క్రమంలో చిన్న చిన్న విరామాలతో 4040 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. మే 6న, చండీగఢ్ ఎయిర్ పోర్టులో ఆగడంతో వీళ్ల కారు యాత్ర పూర్తయింది.
వీళ్లు చేసిన ఈ యాత్రను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. చిన్న వయసులోనే ఏకథాటిగా 9 రాష్ట్రాలు చుట్టేసిన సంయుక్తకు రికార్డుకు సంబంధించిన సర్టిఫికేట్ ను అందించింది.
50 దేశాలు చుట్టేసిన అదితి త్రిపాఠి
బ్రిటన్లో ఉంటున్న భారత సంతతికి చెందిన అదితి త్రిపాఠి 50 దేశాలు పర్యటించింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ పదేళ్ల చిన్నారి, ఒక్క రోజు కూడా స్కూల్ కు శెలవు పెట్టలేదు. సౌత్ లండన్లో నివాసముంటున్న అదితి త్రిపాఠి తన తల్లిదండ్రులతో కలిసి ఇప్పటివరకు 50 దేశాలు చుట్టేసింది. మూడేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తొలిసారి జర్మనీకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి.
నేపాల్, భారత్, థాయ్లాండ్, సింగపూర్ వంటి ఎన్నో దేశాలను చుట్టేసింది అదితి. శుక్రవారం మధ్యాహ్నం బయల్దేరి, మళ్లీ సోమవారానికి లండన్ చేరుకుంటుంది ఈ పాప. కొన్ని సార్లు ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా స్కూల్ కు వెళ్లిపోతుంది. త్వరలోనే ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియాకి కూడా వెళ్లనుంది.