రానురాను మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. క్షణికావేశంలో హత్యలు చేసి, కన్నవాళ్లనే కోల్పోతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. క్షణికావేశంలో ఓ అమ్మాయి, కన్నతండ్రిని హత్య చేసింది.
అంబర్ పేట్ తులసీరామ్ నగర్ లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు జగదీశ్. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జగదీశ్ కూతురు నిఖిత కూడా దగ్గర్లోనే ఉన్న ఓ పండ్ల దుకాణంలో పనిచేస్తోంది.
తండ్రిపై కోపమో లేక తను కూడా సంపాదిస్తున్నాననే అహం వల్లనో రోజూ తండ్రికూతుళ్లు గొడవ పడేవారు. శనివారం రాత్రి కూడా ఇలానే గొడవపడ్డారు. రోజూ దుకాణం నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్న కూతుర్ని తండ్రి మందలించాడు.
ఈసారి కూతురు కోపం పట్టలేకపోయింది. ఇంట్లో దొరికిన గాజు ముక్కతో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ క్రమంలో జగదీశ్ మెడపై కూడా తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే జగదీశ్ ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన జగదీశ్, ఈరోజు మరణించాడు. దీంతో కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అయితే జగదీశ్ హత్య వెనక మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రోజూ తాగి ఇంటికొచ్చి, కూతురితో గొడవ పెట్టుకునేవాడంట జగదీశ్. అలా తాగినందుకే తండ్రిపై నిఖిత దాడిచేసినట్టు తెలుస్తోంది.