సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందని, జూబ్లీ చెక్ పోస్ట్ కు అనుసంధానంగా వున్న రోడ్లలో కాస్త తక్కువ వెడల్పు వున్న రోడ్ ను వెడల్పు చేసే పని ఇప్పుడు హీరో బాలకృష్ణ ఇంటి మీదకు వచ్చింది. రోడ్ నెంబర్ 46 వరకు రోడ్ వెడల్పు చేయాలంటే బాలయ్య బాబు ఇల్లు కూల్చాల్సి వస్తుందట. నిజానికి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరి పెట్రోల్ బంక్ నుంచి చూసుకుంటే అన్నింటికన్నా రోడ్డుకు ఆనుకుని వున్న ఇల్లు ఎవరిదీ అంటే అది బాలకృష్ణది మాత్రమే.
వాస్తవానికి ఇంటికి, గేటుకు మధ్య పది, పదిహేను అడుగుల ఖాళీ స్థలం వున్నట్లు కనిపిస్తుంది బయటకు. మరి ఆ ఖాళీ స్థలంతో సరిపెడితే ఇల్లు ఏమీ కాకుండా మిగుల్తుంది. లేదూ అంతకన్నా ఎక్కువ వెడల్పు చేయాల్సి వస్తే ఇల్లు కూడా ఎగిరిపోతుంది.
నిజానికి ఏ రోడ్డు అయినా రెండు వైపులా తీసుకుంటారు. ఇక్కడ రెండో వైపు కేబిఆర్ పార్క్ వుంది. గతంలో చెక్ పోస్ట్ మెయిన్ రోడ్కు కొంత కేబిఆర్ పార్క్ నుంచే తీసుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు ముప్పు రాకుండా, ఇటు వదిలి అటు కేబిఆర్ పార్క్ నుంచి తీసుకున్నారని విమర్శలు వచ్చాయి కూడా.
మరి అప్పుడంటే తెలుగుదేశం ప్రభుత్వం వుంది. మరి ఇప్పుడు అలా కాదు. ఏం చేస్తారో చూడాలి.