దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టారు నిందితులు. అది 'నిర్భయ' ఘటనగా అప్పట్లో ప్రాచుర్యం పొందింది. దేశమంతా అట్టుడికిపోయింది. చివరికి నిర్భయ చట్టం పుట్టుకొచ్చింది. అఫ్కోర్స్, నిర్భయ చట్టం వచ్చాక మరింతగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి తప్ప తగ్గలేదనుకోండి అది వేరే విషయం.
దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోనూ నిర్భయ ఘటన జరిగింది. అయేషా మీరా అనే యువతిపై 'దుండగుడు' అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. అప్పట్లో ఆ ఘటన రాజకీయంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనలో రాజకీయ ప్రముఖుల పుత్రరత్నాలపై ఆరోపణలొచ్చాయి. కానీ, ఆ కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని దోషిగా చూపి, పోలీసులు చేతులు దులుపుకున్నారు.
ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ కేసులో సత్యంబాబుని నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది. అంటే, చెయ్యని తప్పుకి ఎనిమిదేళ్ళపాటు సత్యంబాబు జైలు శిక్ష అనుభవించాడన్నమాట. మృతురాలి తల్లి, తన కుమార్తె అయేషా మీరాని హత్యచేసింది సత్యంబాబు కానే కాదనీ, ఓ రాజకీయ ప్రముఖుడి పుత్రరత్నమని ఆరోపించింది. కానీ, ఆ దిశగా కేసు విచారణ ముందుకు సాగలేదు. 'కేసు మూసేసి చేతులు దులిపేసుకోవడమెలా..' అని మాత్రమే పోలీసులూ చూశారన్నది అప్పుడు ఆరోపణ. ఇప్పుడు అది నిజమని నిరూపితమయ్యింది. ఆధారాల్లేకుండా ఓ వ్యక్తిని దోషిగా చూపి, 8 ఏళ్ళు జైలులో వుంచినందుకుగాను హైకోర్టు జరీమానా కూడా విధించింది. బాధిత కుటుంబం నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.
ఢిల్లీ నిర్భయ ఘటనకీ, ఆంధ్రా నిర్భయ ఘటనకీ 'తీవ్రత' పరంగా చూస్తే పెద్దగా తేడాలేమీ లేవు. కానీ, ఆ కేసులో విచారణ నిష్పాక్షికంగా జరిగింది. ఇక్కడ, ఆంధ్రా నిర్భయ కేసులో మాత్రం విచారణ 'రాజకీయ కోణం'లో జరిగింది. అనామకుడ్ని తీసుకొచ్చి, జైల్లో తోసేసి, దోషిగా చేసేశారు. అయేషామీరాపై జరిగిన అఘాయిత్యానికి ఏమాత్రం తీసిపోదు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యంబాబుకి జరిగిన నష్టం. ఇంతకీ, అయేషా మీరాని చంపిందెవరు.? ఇది ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే.