Advertisement


Home > Movies - Reviews
సినిమా రివ్యూ: గురు

రివ్యూ: గురు
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
వైనాట్‌ స్టూడియోస్‌
తారాగణం: వెంకటేష్‌, రితిక సింగ్‌, నాజర్‌, ముంతాజ్‌ సర్కార్‌, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి, జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు
కథనం: సుధ కొంగర, సునంద రఘునాధన్‌
మాటలు: హర్షవర్ధన్‌
కూర్పు: సతీష్‌ సూర్య
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌
ఛాయాగ్రహణం: కె.ఏ. శక్తివేల్‌
నిర్మాత: ఎస్‌. శశికాంత్‌
కథ, దర్శకత్వం: సుధ కొంగర
విడుదల తేదీ: మార్చి 31, 2017

సాలా ఖడూస్‌ పేరిట హిందీలో, ఇరుది సుత్రు పేరుతో తమిళంలో విడుదలైన మాధవన్‌ చిత్రానికి రీమేకే ఈ 'గురు'. హిందీ బాక్సాఫీస్‌ వద్ద స్టార్‌ వేల్యూ లేక తేలిపోయిన ఈ చిత్రం, తమిళంలో మాత్రం ఫర్వాలేదనిపించుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని వెంకటేష్‌తో యథాతథంగా రీమేక్‌ చేసారు. అవే మాటలు, అవే పాటలు, ఒకరిద్దరు మినహా అదే మనుషులు, అవే భావోద్వేగాలు... అయితే ఒక మంచి కథ తాలూకు గొప్పతనం ఏమిటంటే, అప్పటికే చదివేసినా, చూసేసినా ఇంకోసారి చూసేందుకు, చదివేందుకు ఏ అభ్యంతరాలుండవు. ఒరిజినల్‌ చూసినప్పటికీ, దాదాపు మక్కీకి మక్కీ దించేసిన 'గురు' ఈ సమీక్షకుడిని కదిలించగలిగింది, లీనం చేయగలిగింది. అది ఖచ్చితంగా సుధ కొంగర రాసుకున్న కథలోని గొప్పతనమే. అలాగే 'గురు'గా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసిన వెంకటేష్‌కి కూడా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే.

ఒక సగటు స్పోర్ట్స్‌ సినిమాలో వుండే చాలా రొటీన్‌ వ్యవహారాలు ఇందులోను కనిపిస్తాయి. తను ఇష్టపడే స్పోర్ట్‌లో ఏవో కారణాల మీద ఫెయిల్‌ అయిన వ్యక్తి కోచ్‌ అవతారం ఎత్తడం, అతడికి కొన్ని దురలవాట్లు వుండడం, అతనికి తన కలని సాకారం చేసుకునే ఆస్కారం మరో యంగ్‌ క్యారెక్టర్‌లో కనిపించడం, ఆ యంగ్‌ క్యారెక్టర్‌కి ఈ ఆట మీద ధ్యాస లేకపోవడం, ఎప్పటికో కానీ కోచ్‌ విలువ తెలుసుకోలేక పోవడం, చివరకు అతి కీలకమైన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి గెలవడం, అంతకుముందు ఆ కోచ్‌కి అతి పెద్ద పరీక్ష ఎదురు కావడం... ఇలా ఏ స్పోర్ట్స్‌ సినిమాలో చూసినా రొటీన్‌గా కనిపించే అంశాలతోనే ఈ కథనం రాసుకున్నారు. కొన్ని జానర్‌ సినిమాలకి కొన్ని క్లీషేస్‌ అంటూ అలా వుండిపోతాయి. వాటిని హాలీవుడ్‌ ఫిలింమేకర్లయినా, ఎక్కడివాళ్లయినా మార్చడానికి ఇష్టపడరు. 

కాకపోతే రొటీన్‌గా అనిపించే అంశాలన్నీ కలబోసినా కానీ కదలకుండా కూర్చోపెట్టగలగాలి. ఆ కోచ్‌ తాలూకు భావోద్వేగాలతో, ఆ యువ క్రీడాకారిణి తాలూకు మెటామార్ఫసిస్‌తో, అన్నిటికీ మించి కథలోని ఆత్మతో ప్రేక్షకులకి కనక్ట్‌ ఏర్పరచాలి. ఈ విషయంలో దర్శకురాలు సుధ కొంగర పూర్తి శాతం సక్సెస్‌ అయ్యారు. వీలయినంత సహజంగా పాత్రలని, సంభాషణలని, సంఘటనలని తీర్చిదిద్దడంలోనే ఆమె విజయవంతమయ్యారు. ఇందులోని కోచ్‌ హీరోనే. కానీ ఎక్కడా అతడిని హీరోలా చూపించరు. తోటి పాత్రలేవీ అతడిని హీరోలా చూడవు. కనీసం అతడికి గౌరవం ఇచ్చి మాట్లాడే సందర్భాలు కూడా తక్కువే. ఒక సందర్భంలో తన కింద జూనియర్‌ కోచ్‌గా పనిచేసే నాజర్‌తో 'మరుగుదొడ్లు కడుక్కుంటుంది నీలాగా' అంటాడు వెంకటేష్‌. దానికి బదులుగా 'అవును, నేను మరుగుదొడ్లే కడుక్కుంటాను. కానీ గబ్బంతా నీ నోట్లో వుంది' అనేస్తాడు! కోచ్‌ని పట్టుకుని ఒక సందర్భంలో 'నా కొడకా' అంటుందా పిల్ల. అదే కోచ్‌కి ఆమె ఐ లవ్యూ చెబితే 'నీ బాబు వయసుంటుంది నాకు' అంటాడతను. ఇలాంటి సంభాషణలు, ప్రవర్తన వల్ల తెరపై పాత్రలు నటిస్తున్నట్టు కాకుండా నిజంగానే జీవమున్నట్టు అనిపిస్తాయి. 

ఇలాంటివి సగటు కమర్షియల్‌ సినిమాల్లో చూడలేం. ఈ లక్షణాలే గురుని గుంపులోంచి వేరు చేసి చూపిస్తాయి. బాక్సింగ్‌ ఫెడరేషన్‌లో వుండే రాజకీయాలు, అమ్మాయిల పట్ల చూపించే వివక్ష, వారిపై జరిగే లైంగిక వేధింపులు... ఏ విషయంలోను గురు అండర్‌ ప్లే చేయదు, ఎలాంటి షుగర్‌ కోటింగ్‌ వుండదు. వాస్తవాలని కళ్లకి కఠినంగా చూపిస్తూ, మనకి పతకాలు తెచ్చిపెట్టే క్రీడాకారిణిలు ఎలాంటి పరిస్థితులని దాటుకు రావాలో నిక్కచ్చిగా చెప్పేస్తుంది. పాత్రలు సహజంగా వుండడంతో పాటు వారి భావోద్వేగాలతో కూడా రిలేట్‌ చేసుకోగలగడం ఈ చిత్రానికి ప్రత్యేకతని ఆపాదిస్తుంది. ఎలాగైనా ఇండియాకి ఒక మెడల్‌ తెచ్చిపెట్టే క్రీడాకారిణిని అందించాలనే తపన వెంకటేష్‌ కళ్లల్లో తెలుస్తుంది. అతడో నిజాయతీపరుడైన కోచ్‌గానే తప్ప ఎక్కడా యాక్షన్‌ చెబితే నటిస్తున్న భావన కలిగించడు. ఒరిజినల్‌లో మాధవన్‌ని చూస్తే ఈ పాత్రలో మరొకర్ని ఊహించుకోలేమన్నంత బాగా చేసాడు. అలాంటి ఛాలెంజ్‌ని టేకప్‌ చేసి వెంకటేష్‌ తనదైన శైలిలో గురు పాత్రని రక్తి కట్టించాడు. తన స్టార్‌డమ్‌ నీడ ఎక్కడా ఈ కథ మీద పడకుండా అవసరమైనపుడల్లా బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. 

ఒక పాత్రని రెండోసారి చేస్తేనే మొనాటనీ ఫీలింగ్‌తో ఆ ఛాయలు పర్‌ఫార్మెన్స్‌లో తెలిసిపోతుంటాయి. అలాంటిది ఇదే క్యారెక్టర్‌ని మూడోసారి చేసినా రితిక మరోమారు సిన్సియర్‌గా తన క్యారెక్టర్‌ని అద్భుతంగా పోషించింది. అలాగే అసూయతో రగిలిపోయే అక్కగా ముంతాజ్‌ నటన కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇద్దరు స్పోర్ట్స్‌ విమెన్‌ని తీసుకొచ్చి వారినుంచి ఇలాంటి అవుట్‌పుట్‌ రాబట్టినందుకు దర్శకురాలిని ఇంకోసారి అభినందించాలి. గూడెం అమ్మాయిలు కనుక వారి యాస ఎలాగుండాలనే దానిపై శ్రద్ధ పెట్టారు. పాలిష్డ్‌ లాంగ్వేజ్‌ కాకుండా ఇక్కడా సహజత్వానికి పెద్ద పీట వేయడం మెచ్చుకోతగినదే. కానీ డబ్బింగ్‌ అథెంటిక్‌గా అనిపించేట్టు కేర్‌ తీసుకోవాల్సింది. నాజర్‌, జాకీర్‌ హుస్సేన్‌ ఇద్దరూ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. సపోర్టింగ్‌ కాస్ట్‌లో తనికెళ్ల, అనిత చౌదరి మెప్పిస్తారు. 

సినిమా వాతావరణానికి తగ్గట్టుగా అట్మాస్ఫిరిక్‌ మ్యూజిక్‌పై సంతోష్‌ నారాయణన్‌ దృష్టి పెట్టాడు. అందుకే పాటలు సగటు సినిమా పాటల్లా కాకుండా ఏదో బాణీ కట్టుకుని అప్పటికప్పుడు పాడేస్తున్నట్టు అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది. సినిమాటోగ్రఫీ గురించి ఎంతయినా చెప్పుకోవచ్చు. మూడ్‌ని కెమెరాతో కన్వే చేసిన విధానం ఆకట్టుకుంటుంది. రచయితగా తన కథపై ఎంతగా కృషి చేసారో, దర్శకురాలిగా దానిని తెరపైకి తీసుకు రావడంలో సుధ కొంగర అంతకంటే ఎక్కువే సక్సెస్‌ అయ్యారు. తననుంచి వచ్చే మలి చిత్రం ఎలాగుంటుందనే ఆసక్తిని గురు ప్రేక్షకుల్లో కలిగించగలిగారు. 

ప్రథమార్ధం అన్‌కన్వెన్షనల్‌ క్యారెక్టర్లతో, సహజమైన మాటలతో, కోచ్‌, స్టూడెంట్‌ మధ్య కాన్‌ఫ్లిక్ట్‌తో రసవత్తరంగా సాగుతుంది. ద్వితీయార్ధానికి వచ్చేసరికి మూడ్‌ టోటల్‌గా ఛేంజ్‌ అవుతుంది. లైవ్‌ వైర్‌లా, ఫైర్‌ బ్రాండ్‌లా కనిపించిన రితిక పరిస్థితులకి అనుగుణంగా మూడీగా మారిపోయే సరికి ఫస్ట్‌ హాఫ్‌లోని ఎనర్జీ మిస్‌ అయిన భావన కలుగుతుంది. ద్వితీయార్ధం పూర్తిగా మన ఊహలకి తగ్గట్టు సాగుతూ, భావోద్వేగాలతో నిండిపోతుంది. ఈ మూడ్‌ షిఫ్ట్‌ ఒకింత ఇబ్బంది పెడుతుంది. ముందుగానే ఊహించగలిగే పతాక సన్నివేశం వల్ల క్లయిమాక్స్‌లో దక్కాల్సిన హై మిస్‌ అవుతుంది. చెంగీజ్‌ ఖాన్‌ ఎపిసోడ్‌తో చిన్నపాటి మెరుపు మెరిసినప్పటికీ స్పోర్ట్స్‌ సినిమాకి వుండాల్సిన ఆ ఉత్కంఠభరిత ఫైనేల్‌ మిస్‌ అయినట్టు అనిపిస్తుంది. బాక్సింగ్‌ అంటేనే రింగ్‌లో ఇద్దరి మధ్య పోరు కనుక ఈ ఫైట్‌ పరంగా ఎక్కువ చేయడానికేం లేదనుకోండి. పైన చెప్పుకున్న ఇబ్బందులు ఒరిజినల్‌కి సైతం ఎదురైనప్పటికీ ఇక్కడ మార్పులు చేయడానికి దర్శకురాలు ఇష్టపడలేదు. వినోదం మిస్‌ అవడం, ఎనర్జీ లోపించడం వల్ల సెకండ్‌ హాఫ్‌ కొంచెం భారంగా గడిచినప్పటికీ అవసరమైన చోట భావోద్వేగాలు బాగా పండాయి. ఓవరాల్‌గా గురు ఒక శాటిస్‌ఫాక్టరీ స్పోర్ట్స్‌ డ్రామా చూసిన అనుభూతిని అయితే ఇస్తుంది. 

వంక పెట్టలేని వెంకీ నటన, ఈ పాత్ర కోసమే పుట్టిందన్నట్టున్న రితిక, వాస్తవికతకి అద్దం పట్టే పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, సంఘటనలు అభిరుచి గల ప్రేక్షకులకి 'గురు'ని దగ్గర చేస్తాయి. ఒరిజినల్‌ చూసేసిన వారికి కార్బన్‌ కాపీ అనిపిస్తుంది కానీ చూడని వాళ్లకి మాత్రం రొటీన్‌ రీమేక్‌ల మధ్య రిఫ్రెషింగ్‌ టేక్‌ అనే భావననిస్తుంది. 

బాటమ్‌ లైన్‌: బాగుంది గురూ!

- గణేష్‌ రావూరి