బాహుబలి 2 మేనియా స్టార్ట్ అయింది. సినిమా ఎలా వుంటుందీ అన్నది పక్కన పెడితే జనాల్లో ఆసక్తి అన్నది ప్రారంభం అయింది. ఇప్పటి వరకు బాహుబలికి రెండు వారాలు అటు, రెండు వారాలు ఇటు వదిలి చాలా సినిమాలు షెడ్యూలు చేసుకున్నాయి. ఒక్క మహేష్-మురుగదాస్ సినిమా మాత్రమే ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తతో జూన్ లో షెడ్యూలు చేసుకుంది.
అయితే ఇప్పుడు బాహుబలి 2 కి వస్తున్న బజ్ చూస్తుంటే, రెండు వారాల గ్యాప సరిపోతుందా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రెండు వారాలు ముందుగా షెడ్యూలు చేసుకున్న సినిమాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఎందుకంటే బాహుబలి మేనియా చూస్తుంటే, మొత్తం అన్ని థియేటర్లలో బాహుబలి 2 నే విడుదలయ్యేలా వుంది.
అంటే రెండు వారాలు, లేదా ఒక వారం ముందు విడుదలైన ఏ సినిమా అయినా థియేటర్లలోంచి లేచిపోవాల్సిందే. ఇది కాస్త ఇబ్బంది కరమైన సంగతి. ఏప్రియల్ లో బాహుబలికి రెండు వారాలు ముందుగా ప్లాన్ చేసుకున్న మీడియం రేంజ్ సినిమా మిస్టర్ ఒక్కటే. ఇది పాతిక కోట్ల బడ్జెట్ తో తయారైన సినిమా. మరి రెండు వారాల గ్యాప్ సరిపోతుందా అన్నది అనుమానంగా వుంది.
ఇధిలా వుంటే బాహుబలి 2 కి అవతల దువ్వాడ జగన్నాథమ్ ప్లాన్ చేసారు. సినిమా వర్క్ మే ఫస్ట్ వీక్ దాకా వుంది. ఇది షెడ్యూలు ప్రకారం రెడీ అవుతోంది. అయితే విడుదల అన్నది మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా వుంటే వన్ వీక్ చాలు మనకు అనుకునే సినిమాలు ఇప్పుడు మిస్టర్, డిజె వంటి సినిమాల వంక చూస్తున్నాయి. ఇవి కనుక వాయిదా పడితే, ఆ డేట్లను తమకు సెట్ చేసుకోవాలని చూస్తున్నాయి.