పంచాంగాల యందు రాజకీయ పంచాంగాలు వేరయా.. అని చెప్పుకోవాలేమో. మామూలుగా అయితే, పంచాంగం ఒకే రకంగా వుండాలి. కానీ, రాజకీయ పార్టీలు పంచాంగ శ్రవణం షురూ చేశాక, ఒక్కో రాజకీయ పార్టీ కోసం ఒక్కోలా పంచాంగాలు తయారుచేయాల్సి వస్తోంది పండితులకి. ఈ క్రమంలో పండితులూ రాజకీయ నాయకుల్లా మారిపోతున్నారు.
టీడీపీ కార్యాలయంలో ఒకలా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంకొకలా, మరో రాజకీయ పార్టీ కార్యాలయంలో మరొకలా.. పంచాంగ శ్రవణాలు జరుగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగితే, ఆ పార్టీకి తగ్గట్టుగా పంచాంగ శ్రవణం జరుగుతుండడమే విశేషమిక్కడ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా పంచాంగ శ్రవణం నిర్వహించేసింది. వాతావరణ శాఖ, ఈ ఏడాది వర్షాలు తక్కువ వుంటాయని చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనీ, రైతులకు ఇబ్బంది ఏమీ వుండదన్నది టీడీపీ సర్కార్ చెప్పించిన పంచాంగ శ్రవణం తాలూకు సారాంశం.
మరోపక్క, వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. చిత్రంగా, ఈ పంచాంగంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. ఆయన్ని మహనీయుడిగా కీర్తించేశారు. ప్రజలు దురదృష్టవంతులు గనుక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అకాల మరణం సంభవించిందంటూ పంచాంగంలో సెలవిచ్చాడో పండితుడు.
రాజకీయ పంచాంగాలు అదిరిపోయాయ్ కదూ.! ఇందుకేనేమో, అసలంటూ పంచాంగాలంటేనే జనాలకి విరక్తి పుట్టుకొచ్చేస్తోంది. ఏది ఏమైనా, ఈ హేవలంబి నామ సంవత్సరం ప్రజలందిరికీ సకల శుభాలు కలగజేయాలని ఆశిద్దాం.