క్రికెట్‌లో భారత్‌కి శతృ దేశమంటే ముందుగా గుర్తుకొచ్చేది పాకిస్తాన్. లిస్ట్‌లో పాకిస్తాన్ తర్వాతి స్థానం ఆస్ట్రేలియాదే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు వుంటుందనుకోండి.. అది వేరే విషయం. క్రికెట్‌కి సంబంధించినంతవరకు టీమిండియాకి ఇంకే ఇతర జట్టుతోనూ పెద్దగా వైరం లేదు.. జస్ట్ పోటీ తప్ప. గతంలో ఇంగ్లాండ్‌తో చాలా వైరం వుండేదిగానీ, తర్వాత్తర్వాత అది బాగా తగ్గిపోయింది. ఆస్ట్రేలియా మాత్రం, పాకిస్తాన్‌ని వెనక్కి నెట్టి ముందుస్థానంలో నిలిచేందుకు పోటీ పడ్తోంది. ఎందుకిలా.? ఏమో మరి, క్రికెట్ ఆస్ట్రేలియాకే తెలియాలి.
ఇండియా టూర్‌లో ఆస్ట్రేలియా జట్టు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. మొన్నీమధ్యనే ఇంగ్లాండ్, ఇండియాలో పర్యటించింది.. న్యూజిలాండ్‌తోనూ టెస్ట్ సిరీస్‌ని టీమిండియా ఆడింది. ఆటలో గెలుపోటములు సహజం. ఆట సందర్బంగా భావోద్వేగాల్ని అదుపు చేసుకోలేకపోవడాన్నీ కాదనలేం. చిన్న చిన్న వివాదాల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ, 'కక్ష' పెట్టుకునేంతలా వివాదాలు రాజుకోవడమే ఎవరికీ మంచిది కాదు.
ఆసీస్ జట్టు, ఇండియా పర్యటనలో చేసిన ఓవరాక్షన్ విషయానికొస్తే, ముందుగా డీఆర్‌ఎస్ వివాదం గురించి చెప్పుకోవాలి. 'రివ్యూ సిస్టమ్'ని ఇలాక్కూడా వాడుకోవచ్చా.? అని ప్రపంచానికి నేర్పింది ఆసీస్ జట్టు. కెప్టెన్ స్మిత్ అడ్డంగా దొరికిపోయాడు ఆ వివాదంలో. క్షమాపణ చెప్పినా, క్షమించకూడని నేరమది. అక్కడికీ, బీసీసీఐ ఈ విషయంలో స్మిత్‌ని క్షమించేసింది. అయినా, ఆసీస్ తోక వంకర.. అదంతే.!
కోహ్లీకి, మైదానంలో గాయమయ్యింది. ఆ గాయం చుట్టూ ఆస్ట్రేలియా ఆటగాళ్ళు చేసిన వెటకారం అంతా ఇంతా కాదు. అసలు మానవత్వమే మర్చిపోయిన ఆస్ట్రేలియా జట్టు నుంచి విచక్షణను ఆశించలేం. వాళ్ళసలు మనుషులే కాదు, వాళ్ళకు క్రీడా స్ఫూర్తి ఏంటి.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. మైదానంలో ఆటగాళ్ళతో గొడవలు మామూలే. వ్యక్తిగత దూషణలు, స్లెడ్జింగ్‌తో బూతులు తిట్టడం.. ఇలా ఆసీస్ చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.
అయినాసరే, 'ఆసీస్ ఆటగాళ్ళని మైదానం వెలుపల మిత్రుల్లా చూస్తారా.?' అని మీడియా అడిగితే, 'లేదు' అని అనడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తగదేమో. కొన్ని సందర్భాల్లో 'కుక్క కాటుకి చెప్పుదెబ్బ' తప్పు కాకపోవచ్చు. కానీ, అసీస్ క్రికెటర్ల స్థాయికి దిగజారడం ఎంతవరకు సబబు.? అన్నది కోహ్లీ ఆలోచించుకోవాలి. వ్యక్తిగతంగా కోహ్లీ ఆసీస్ జట్టు తీరు కారణంగా చాలా మానసిక క్షోభ అనుభవించాడు. అయినాసరే, అతను టీమిండియా కెప్టెన్ కదా.! కాస్తంత ఆచి తూచి స్పందించి వుండాల్సింది.
ఏదిఏమైనా, తమ పైత్యానికి కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్షమాపణ కూడా చెప్పాడంటేనే.. ఈ సిరీస్‌లో ఆసీస్ జట్టు ఎంత చెత్తగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు. స్మిత్ క్షమాపణ చెప్పినందుకైనా, విరాట్ – ఆస్ట్రేలియా జట్టుని క్షమించి వుండాల్సిందేమో.!