వంద కోట్లు రద్దా?.. శశి పంట పండినట్లే…!

మన దేశంలో న్యాయవ్యవస్థ మీదా అనేక విమర్శలున్నాయి. తీర్పులు త్వరగా రావనే సంగతి తెలిసిందే. ఇందుకు కారణం కోట్ల కేసులు కోర్టుల్లో పేరుకుపోతున్నాయని న్యాయాధికారులు చెబుతున్నారు. సరే..అదలా ఉంచితే తీర్పులు సంపన్నుల విషయంలో ఒకవిధంగా,…

మన దేశంలో న్యాయవ్యవస్థ మీదా అనేక విమర్శలున్నాయి. తీర్పులు త్వరగా రావనే సంగతి తెలిసిందే. ఇందుకు కారణం కోట్ల కేసులు కోర్టుల్లో పేరుకుపోతున్నాయని న్యాయాధికారులు చెబుతున్నారు. సరే..అదలా ఉంచితే తీర్పులు సంపన్నుల విషయంలో ఒకవిధంగా, పేదల విషయంలో మరోరకంగా ఉంటున్నాయనే విమర్శలూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో విచారణ పూర్తయిన తరువాత కూడా తీర్పును దీర్ఘకాలం రిజర్వు చేస్తుండటంతో జరగాల్సిన న్యాయం జరగడంలేదు. ఆలస్యంగా జరిగే న్యాయం న్యాయం కాదు కదా…! దివంగత జయలలిత, ఆమె ప్రియ నేస్తం శశికళ ప్రధాన పాత్రధారులైన రూ.66 కోట్ల అక్రమాస్తుల కేసు విచారణ ఇరవై ఏళ్లు జరిగింది. దీని కథ అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు కర్నాటక హైకోర్టు తీర్పును కాదని ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ, జయ, శశి తదితరులను దోషులుగా నిర్థారించింది.  

అయితే విచారణ పూర్తయిన తరువాత తీర్పును వెంటనే వెలువరించకుండా దీర్ఘకాలం రిజర్వులో ఉంచింది.  చివరకు జయలలిత మరణించాక శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి సిద్ధమవుతున్న సమయంలో తీర్పు వెలువరించింది. దాంతో ఆమె నిరాశగా జైలుకు వెళ్లాల్సివచ్చింది. జయలలితను కూడా దోషిగా ప్రకటించినా ఆమె అభిమానులు, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు దాన్ని  పట్టించుకోలేదు. శశికళనే వారు దోషిగా చూడనప్పుడు 'అమ్మ' జయను నేరస్తురాలిగా చూస్తారా?  బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పును యథాతథంగా సమర్థిస్తున్నామని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. దాని ప్రకారం జయ,శశి జైలు శిక్ష అనుభవించడంతో పాటు జరిమానాలు కట్టాల్సివుంది. జయలలిత వంద కోట్లు, శశికళ పది కోట్లు చెల్లించాలి. జయ చనిపోయారు కాబట్టి జైలు శిక్ష లేదు. కాని జరిమానా ఉంటుంది కదా. కాని జయకు విధించిన వంద కోట్ల జరిమానా సుప్రీం కోర్టు ఆ తరువాత రద్దు చేసింది. ఆమెను దోషిగా ప్రకటించినప్పుడు జరిమానా ఎందుకు రద్దు చేసిందో అర్థం కాదు. జైలు శిక్ష అనుభవించేందుకు మనిషి సజీవంగా లేదు. జరిమానా వసూలు చేసుకునేందుకు ఏమైంది? ఈ రెండూ లేనప్పుడు ఆమెను నిర్దోషిగానే ప్రకటించవచ్చు కదా. 

ఈ పాయింటునే పట్టుకుంది కర్నాటక ప్రభుత్వం. జరిమానా రద్దు చేయడాన్ని మరోసారి సమీక్షించాలని కోరింది. దోషులకు విధించిన శిక్షల్లో, జరిమానాల్లో రద్దులు, మినహాయింపులు ఉండకూడదని వాదిస్తోంది. వంద కోట్ల జరిమానా వసూలు చేయాల్సిందేనని గట్టిగా కోరింది. దీనిపై సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకటించాల్సివుంది. ఒకవేళ వంద కోట్ల జరిమానా రద్దు చేస్తే శశికళ పంట పడినట్లేననుకోవాలి. జయలలిత జీవించిలేరు కాబట్టి ఆమె జరిమాన సొమ్మును ఆమె ఆస్తులను వేలం వేయడం ద్వారా సమకూర్చుకొని కట్టాలని  తీర్పు ఇచ్చినప్పుడు సుప్రీం ఆదేశించింది. ఆమె ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి,  వేలం వేసి జరిమాన చెల్లించే బాధ్యత ప్రభుత్వానిది. ఇక చిన్నమ్మ పది కోట్లు నేరుగా చెల్లించాల్సి ఉంటుంది.  శశికళ ముప్పయ్‌ ఏళ్లకు పైగా పోయస్‌గార్డెన్లో జయలలితతో కలిసివున్న తరువాత కూడా సామాన్యంగానే ఉండదు కదా. కాబట్టి పది కోట్లు చెల్లించడానికి కష్టమేముంది? అనుకోవచ్చు.

ఇక్కడే సుప్రీంకోర్టు ఓ షరతు విధించింది. జరిమాన డబ్బు సమకూర్చుకొని చెల్లించడానికి ముందు ఆ డబ్బు ఎలా సంపాదించారో (సోర్స్‌) కోర్టుకు వివరించాల్సివుంటుంది. వీరి వివరణకు కోర్టు సంతృప్తి చెందాల్సివుంటుంది. అక్రమ ఆస్తులు అమ్మడం ద్వారానో, అవినీతి చేసి కూడబెట్టిన సొమ్మునో జరిమానగా కడతామంటే కోర్టు అంగీకరించదు. ఆ డబ్బు పూర్తి న్యాయబద్ధమై ఉండాలి. ఈవిధంగా ఆ డబ్బు చెల్లించలేని పక్షంలో  ఆమె ఆస్తులను వేలం వేసి ఆ డబ్బు సమకూర్చుకునే అధికారం కర్నాటక ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ చిన్నమ్మ చెల్లించలేక, ప్రభుత్వం ఆమె ఆస్తులను వేలం వేయలేని పరిస్థితి ఎదురైతే మరో 13 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

జయకు దక్షిణ భారతమంతటా ఆస్తులున్నాయి.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడివిట్‌ ప్రకారం ఆమె ఆస్తులు విలువ 117 కోట్లు.  ఈ సంపదంతా  శశికళ నటరాజన్‌కు దక్కిందట…! స్థిర, చర ఆస్తులన్నీ శశికళ చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ప్రముఖ ఇంగ్లిష్‌ పత్రిక 'ది టెలిగ్రాఫ్‌' జయలలిత మరణించగానే ఓ కథనం ఇచ్చింది. జయలలితకు చెందిన  ఆస్తులకు శశిశళ, ఆమె కుటుంబ సభ్యులు వారసులని టెలిగ్రాఫ్‌ తెలియచేసింది. కాని జయ ఆస్తులకు సంబంధించి అసలు పరిస్థితి ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇంత ఆస్తులున్నప్పుడు సుప్రీం వంద కోట్ల జరిమానా ఎందుకు రద్దు చేసినట్లు? 

       -మేనా