ఆ డైరక్టర్ వయసు మూడు సినిమాలు. వాటిల్లో రెండు డిజాస్టర్లు. అయితే అదే డైరక్టర్ చేతిలో ఓ భారీ సినిమా వుంది. లేటెస్ట్ గా డిజాస్టర్ అయిన సినిమా చూసిన జనాలు, ఆ డైరక్టర్ కు ఆ భారీ సినిమా ఎలా చేతికి ఇచ్చారో అని ఆరా తీసారట.
అలా ఆరా తీస్తే తెలిసిన వైనం ఏమిటంటే, సదరు డైరక్టర్ మాంచి కథ తెచ్చారట. అది తీసుకుని, వాళ్ల టీమ్ తో కాస్త మంచి స్క్రిప్ట్ రెడీ చేయించుకున్నారట. డైరక్టర్ కు తోడుగా ఓ మాంచి ఏస్ సినిమాటోగ్రాఫర్ ను పెట్టుకుని, అతనితో సినిమా చేయించేస్తున్నారట. రెండక్షరాల పేరున్న ఆ సినిమాటోగ్రాఫర్ క్వాలిటీ వర్క్ ఇవ్వడమే కాకుండా, స్క్రిప్ట్ ను పట్టుకుని, సినిమా ఎలా వుంటే బాగుంటుందో తానే చేసుకుపోగల సమర్థుడట.
అందుకే ఈ డైరక్టర్ ను అలా సెట్ లో వుంచుకుని, సదరు సినిమాటోగ్రాఫర్ తో చకచకా సినిమా కానిస్తున్నారట. ఇటీవల మాంచి పేరు తెచ్చుకున్న ఓ సినిమాకు చాలా యంగ్ డైరక్టర్ పని చేసాడు. అక్కడా అదే జరిగిందట. ఇదే సినిమాటోగ్రాఫర్ అక్కడా చాలా వరకు కెప్టెన్ పాత్ర పోషించేసి, సినిమాను గట్టెక్కించేసాడట.
మొత్తం మీద ఇండస్ట్రీలో ఆ సినిమాటోగ్రాఫర్ వుంటే డైరక్టర్ కాస్త అటు ఇటు అయినా సాయం చేసి గట్టెక్కించేస్తాడు అనే పేరు వినిపిస్తోంది.