పవన్‌కళ్యాణ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై హైప్ అలా ఇలా వుండదు. అంతకు ముందు సినిమా ఫలితం ఎలా వున్నాసరే, కొత్త సినిమాపై హైప్‌కి ఆకాశమే హద్దు. ఒకప్పుడు పవన్ తన సినిమాల ప్రమోషన్ కోసం వచ్చేవాడు కాదుగానీ, ఈ మధ్య పవన్‌కళ్యాణ్ ఇంటర్వ్యూలు కన్పిస్తాయి.. ప్రసార మాధ్యమాల్లో సినిమా గురించిన కథనాలు కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి.. ఇవన్నీ ఓ ఎత్తు, అభిమానుల హంగామా ఇంకో ఎత్తు.
కానీ, 'కాటమరాయుడు' సినిమా విషయంలో కాస్తంత 'స్తబ్దత' కన్పిస్తోందిప్పుడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత కూడా 'కాటమరాయుడు' కామ్‌గానే వున్నాడు. టీజర్ సంచలనం పక్కన పెడితే, ఆడియో సింగిల్స్‌లో 'మిరా మీరా మీసం' ఒక్కటే కాస్తంత ఆకట్టుకుంది. మిగతావన్నీ సోసోగానే సాగాయి. ట్రైలర్ వచ్చిందిగానీ.. 'బాహుబలి-2' మేనియా ముందు.. తేలిపోయింది.
ఈ నెల 24న ’కాటమరాయుడు‘ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటిదాకా చూస్తే సాధారణంగా పవన్‌కళ్యాణ్ సినిమాలకుండే హడావిడి 'కాటమరాయుడు'కి ఏమాత్రం కన్పించడంలేదు. ఇంతవరకు పవన్‌కళ్యాణ్ ఇంటర్వ్యూ ఏదీ ప్రసార మాధ్యమాల్లో కన్పించకపోవడం గమనార్హం. పబ్లిసిటీ పరంగా చాలా 'వీక్' ట్రెండ్ నడుస్తోందిప్పుడు. తమిళ 'వీరం'కి తెలుగు రీమేక్ 'కాటమరాయుడు' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఆ ఎఫెక్ట్ 'కాటమరాయుడు' మీద గట్టిగానే పడిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'వీరుడొక్కడే' పేరుతో తెలుగులోకి డబ్ అయిపోయిన 'వీరం'ని రీమేక్ చేయడం ద్వారా, 'కాటమరాయుడు' సినిమా నుంచి ఏ స్థాయి సంచలనాల్ని నిర్మాత శరత్ మరార్, దర్శకుడు డాలీ, హీరో పవన్‌కళ్యాణ్ ఆశిస్తున్నారోగానీ, పవన్ మేనియా మీదనే అభిమానులు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా 'కాటమరాయుడు' వుంటుందా.? వేచి చూడాల్సిందే.