బాహుబలి-2 తర్వాత నెక్ట్స్ సినిమా ఏంటనే విషయంపై రాజమౌళి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా విడుదలైన తర్వాత 2-3 నెలలపాటు కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటానని, అసలు సినిమా ఆలోచనే లేకుండా ఎంజాయ్ చేస్తానని జక్కన్న చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తన నెక్ట్స్ సినిమా ఏంటనే విషయంపై రాజమౌళి ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకపోయినప్పటికీ… తన అనుచర వర్గానికి మాత్రం ఈ విషయంపై చిన్నసైజు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
నెక్ట్స్ సినిమా ఎలా ఉంటే బాగుంటుంది, బాహుబలి తర్వాత ఎలాంటి స్టోరీలైన్ పిక్ చేసుకుంటే మంచిదనే అంశాలపై రీసెర్చ్ చేయాల్సిందిగా తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరక్టర్లకు రాజమౌళి సూచించాడట. బాహుబలి-2 రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత అందరం కూర్చొని చర్చించుకుందామని చెప్పాడట. ఇదే సందర్భంలో హీరో క్యారెక్టరైజేషన్ కు సంబంధించి కూడా అసిస్టెంట్ డైరక్టర్లకు కొన్ని హింట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రాజమౌళికి క్లోజ్ గా ఉండే సర్కిల్ చెబుతున్న వివరాల ప్రకారం… ఇప్పటికే తమ మైండ్ లో ఓ హీరోను ఫిక్స్ అయ్యాడట జక్కన్న. బాహుబలి-2 రిలీజ్ అవ్వకముందే ఆ వివరాల్ని బయటపెడితే బాగుండదు కాబట్టి చెప్పలేదట. పైగా కథ కూడా ఫైనలైజ్ అయ్యాక ఒకేసారి ఎనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాడట. సో… నెక్ట్స్ సినిమాపై రాజమౌళి వర్క్ చేయకపోయినా, అతడి శిష్య బృందానికి మాత్రం చేతినిండా పని కల్పించాడన్నమాట.