నాలుగేళ్లుగా బాహుబలి లుక్ లోనే కనిపించాడు ప్రభాస్. జుట్టు బాగా పెంచి ఒకసారి, బాగా లావెక్కి మరోసారి, కాస్త తగ్గి ఇంకోసారి.. ఇలా చాలా వేరియేషన్స్ చూపించాడు. శివుడు, అమరేంద్ర బాహుబలి పాత్రల కోసం ప్రభాస్ ఇలా మారిన విషయం తెలిసిందే. మరి బాహుబలి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ ఎలా ఉన్నాడు.. అతడి ఫిజిక్ ఎలా ఉంది. హెయిర్ స్టయిల్ మారిందా..లేదా..? బాహుబలి-2 ట్రయిలర్ లాంచ్ లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది.
రాజమౌళి, రానాతో పాటు బాహుబలి-2 ట్రయిలర్ లాంచ్ కు వచ్చాడు ప్రభాస్. ఘాజి సినిమాలో రానాను ఇప్పటికే చూసేశాం కాబట్టి, అతడి లుక్ పెద్దగా సర్ ప్రైజ్ చేయలేదు. కానీ చాన్నాళ్ల తర్వాత కెమెరాముందుకొచ్చిన ప్రభాస్ మాత్రం అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. స్టయిలిష్ లుక్ తో అదరగొట్టేశాడు. బాహుబలి కోసం పెంచిన జుట్టు కత్తిరించేశాడు. క్రాప్ చేసిన హెయిర్ స్టయిల్ తో స్టయిలిష్ గా కనిపించాడు. అంతేకాదు.. తన బాడీ వెయిట్ ను తగ్గించుకునే పనిలో కూడా పడినట్టు ఆ ఫిజిక్ చూస్తే అర్థమౌతోంది.
ఈమధ్యే సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించాడు ప్రభాస్. ఇంకా సెట్స్ పైకి రాని ఆ మూవీ కోసం ప్రభాస్ ఓ కొత్త గెటప్ ట్రై చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ట్రయిలర్ లాంచ్ సందర్భంగా కనిపించిన ప్రభాస్.. కొత్త సినిమా కోసం అదే గెటప్ ను కంటిన్యూ చేస్తాడా లేక ఇంకాస్త మేకోవర్ చూపిస్తాడా అనేది తేలాల్సి ఉంది.