పూరి సినిమా వస్తోంది. సో.. సెన్సార్ బోర్డ్ మరోసారి ఎలర్ట్ అయింది. తమ కత్తెర్లకు పదునుపెడుతూ పూరి సినిమా ఎప్పుడు తమ దగ్గరకు వస్తుందా అని ఎదురుచూస్తోంది. అదే రోగ్ మూవీ. ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ, భారీ బడ్జెట్ తో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమా రేపోమాపో సెన్సార్ గడప తొక్కనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, స్టిల్స్ ఈ సినిమాలో ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్లు ఉన్నాయనే విషయాన్ని చెప్పేస్తోంది. ఇక ట్రయిలర్ చూస్తే ఆ మోతాదు మరింత మించిపోయింది. హీరోయిన్ల బ్యాక్ పై చేతులు వేయడం, అమాంతం పైకి లేపి కౌగిలించుకోవడం లాంటి సన్నివేశాలతో పాటు.. ఫైట్స్ లో కూడా హింస కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.
అందుకే రోగ్ సినిమా కోసం సెన్సార్ బోర్డ్ సర్వసన్నద్ధమైంది.సి-గ్రేడ్ సినిమాలు ఎలాగూ కాస్త హెవీ డోస్ తోనే ఉంటాయి. వాటికి సెన్సార్ కత్తెర్లు తప్పవు. కానీ బడా సినిమాలు తీసే పూరి జగన్నాధ్ కూడా తన సినిమాల్లో మోతాదుకు మించి డైలాగులు, సన్నివేశాలు పెడుతుంటాడు. ఈ మాత్రం లేకపోతే కుర్రాళ్లకు కిక్ ఎక్కదనేది పూరి ఫీలింగ్. కానీ సెన్సార్ బోర్డ్ మాత్రం ఎప్పటికప్పుడు పూరి జోరుకు బ్రేకులేస్తూనే ఉంది. బిజినెస్ మేన్, లోఫర్, ఇజమ్ లాంటి ఎన్నో సినిమాల్ని అడ్డంగా కోసేసింది.
ఇప్పుడు రోగ్ సినిమాకు కూడా రికార్డు స్థాయిలో కత్తెర్లు తప్పవనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. సినిమాల్లో మ్యూట్ ఎఫెక్ట్ లు (డైలాగ్ వినిపించకుండా చేయడం), బ్లర్ ఎఫెక్ట్ లు (ఎక్స్ పోజింగ్ కనిపించకుండా చేయడం) లాంటి వాటితో పాటు చాలా సీన్లు లేపేయాల్సి వస్తుందని అంటున్నారు.