పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎప్పటి నుంచి అన్నది అభిమానులు ఎదురుచూస్తున్న విషయం. ఈ నెలతో పవన్ తన కాటమరాయుడు సినిమా వ్యవహారాల నుంచి రిలీవ్ అవుతున్నారు. ఓ నెల రెస్ట్ తీసుకున్నా, మే నుంచి త్రివిక్రమ్ సినిమా మీదకు వెళ్లొచ్చు. కానీ ఇప్పుడు పవన్ చెప్పిన మాటలు చూస్తే, డవుట్ గా వుంది.
జూన్ నుంచి జనసేన పార్టీ నిర్మాణాన్ని కింద నుంచీ ప్రారంభిస్తానని పవన్ చెప్పారు. జనసేన పార్టీ పెట్టి మూడేళ్లయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడి, పార్టీ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగానే జూన్ నుంచి పార్టీ పనులు చేపడుతున్నా అని వివరించారు.
మరి సినిమా చేస్తూనే సమాంతరంగా పార్టీ పని చూస్తారా? లేక సినిమాను పక్కన పెట్టి పార్టీ పని చూస్తారా? అయితే అందుతున్న సమాచారం ప్రకారం పార్టీ నిర్మాణానికి సంబంధించిన స్కెచ్ ను ఇప్పటికే పవన్ పూర్తి చేసేసారని బోగట్టా. మొత్తం రెండు రాష్ట్రాల్లో పార్టీ స్ట్రక్చర్ ఎలా వుండాలన్నది బ్లూ ప్రింట్ సిద్దంగా వుందట. ప్రతి చోటా ఎవరు ఏక్టివ్, ఎవరు అవసరం అన్న దానిపై కొన్ని పేర్లు కూడా సేకరించి వుంచారట.
ఇప్పుడు చేయాల్సింది ఆ పేర్లకు పక్కన వివిధ పార్టీ హోదాలు తగిలించడం. పవన్ స్ట్రాటజీ ప్రస్తుతానికి ఒకరికన్నా ఎక్కువ మందికే ప్రతి చోటా పార్టీ పనుల అప్పగించాలన్నదిగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ మొదటి, రెండు స్థానాల్లో వున్న కులాల ఈక్వేషన్ ప్రకారమే ఈ హోదాల అప్పగింత వుంటుందని తెలుస్తోంది.