గడిచిన 2 సినిమాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు కింగ్ ఖాన్ షారూక్ ఖాన్. తను బౌన్స్ బ్యాక్ అవ్వడంతో పాటు, ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. పఠాన్, జవాన్ రెండూ మాస్-యాక్షన్ సినిమాలే. ఇదే ఊపులో మరో మాస్-యాక్షన్ సినిమా చేసినా కళ్లుమూసుకొని మరో హిట్ కొట్టేస్తాడు. కానీ షారూక్ రూటుమార్చాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
షారూక్ తాజా చిత్రం డంకీ. ఇది మాస్ సినిమా కాదు, యాక్షన్ మూవీ అంతకంటే కాదు. పూర్తిగా రాజ్ కుమార్ హిరాణి మార్కు సినిమా. సున్నితమైన హాస్యం, ప్రేమ, భావోద్వేగాల కలబోతగా వస్తున్న మూవీ ఇది. మరి ఈ సాఫ్ట్ స్టోరీతో కూడా షారూక్ ఖాన్, రికార్డ్ వసూళ్లు సాధిస్తాడా అనేది చూడాలి.
తాజాగా డంకీ డ్రాప్-1 పేరిట ఓ వీడియో రిలీజ్ చేశారు. విదేశాలకు వెళ్లాలనే నలుగురు స్నేహితుల కల చుట్టూ ‘డంకీ’ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ నలుగురికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేది స్టోరీ. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో తన స్టయిల్ లో హాస్యం, స్నేహం, ప్రేమను మిళితం చేశాడు దర్శకుడు హిరాణి.
షారూక్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు, హిరాణికి ఎలాగూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి డంకీ సినిమా కచ్చితంగా క్రేజీ ప్రాజెక్టు అయింది. ఎటొచ్చి ఈ సినిమాకు 2 సమస్యలున్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇది మాస్-యాక్షన్ సినిమా కాదు. ఇన్నాళ్లూ షారూక్ లో యాక్షన్ చూసిన జనాలు, డంకీలో అతడ్ని ఆదరిస్తారా అనేది డౌట్.
ఇక రెండో సమస్య, సలార్ తో పోటీ. గట్టి పోటీ మధ్య వస్తోంది డంకీ సినిమా. సలార్ సినిమాకు డేట్ చెప్పేశారు కానీ డంకీకి ఇంకా నిర్దిష్టమైన తేదీ చెప్పలేదు. కేవలం క్రిస్మస్ రిలీజ్ అని మాత్రమే చెప్పారు. ఓవర్సీస్ రిలీజ్ డేట్ మాత్రం వెల్లడించారు. ఈ సినిమాతో కూడా భారీ వసూళ్లు సాధిస్తే, కొన్నేళ్ల పాటు షారూక్ కు ఇక తిరుగుండదు. అతడు ఏ జానర్ కథ అయినా టచ్ చేయొచ్చు.