గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ తో ఒక ఆటాడుకున్న భారత పేసర్ల ముందు అంతంత మాత్రంగా ఉన్న శ్రీలంక జట్టు ఏ మాత్రం తట్టుకోలేకపోయింది. టీమిండియా బ్యాట్స్ మెన్ 357 పరుగులు చేసిన పిచ్ మీద ఆ మూడొందలు పక్కన పెట్టి కనీసం 57 పరుగులు చేయలేకపోయారు లంక బ్యాట్స్ మెన్. కేవలం 55 పరుగులకు ఆలౌట్ అయ్యింది లంక జట్టు. తద్వారా టీమిండియాకు 302 పరుగుల భారీ తేడాతో విజయం దక్కింది.
ఈ వరల్డ్ కప్ లో వరసగా, మొత్తంగా ఏడో విజయంతో టీమిండియా అధికారికంగా సెమిస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా నంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఇంకో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఏడు మ్యాచ్ లకు గానూ రెండు మ్యాచ్ లలో విజయాలతో శ్రీలంక పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
ఇక భారత పేసర్ల వీరవిహారం కొనసాగుతూ ఉంది. ఈ మ్యాచ్ లో బుమ్రా తొలి బంతికే వికెట్ తీశాడు. మహ్మద్ సిరాజ్ కూడా తన తొలి బంతికి వికెట్ ను తీసుకున్నాడు. మరో వైపు షమీ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఈ మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు. తద్వారా వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లను తీసిన భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు షమీ. ఇది వరకూ జహీర్ ఖాన్ పేరిట ఉన్న ఈ రికార్డు షమీ పేరిటకు మారింది.
ఒకవైపు టీమిండియా బ్యాట్స్ మెన్ తమ సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ.. ప్రత్యర్థి బౌలింగ్ ను చీల్చి చెండాడుతూ ఉండగా ఫాస్ట్ బౌలింగ్ బలగం అంచనాలకు మించి రాణిస్తూ ఉంది. ఇండియాతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లు అన్ని రకాలుగానూ భయపడే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరో రెండు లీగ్ మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి, వాటిల్లో ఎలాగూ టీమిండియా వీరవిహారం కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా రెండు విజయాలను నమోదు చేస్తే.. మూడో సారి వన్డే వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలవడం లాంఛనమే!