దిల్ రాజు సంక్రాంతి మాస్టర్ ప్లాన్?

టాలీవుడ్‌లో రకరకాల గ్యాసిప్‌లు వినిపిస్తుంటాయి. వాటిలో కొన్ని నిజాలవుతాయి. మరి కొన్ని గ్యాసిప్‌లుగా మిగిలిపోతాయి. భారీ సినిమాల నిర్మాణం, అలాగే భారీ సినిమాల విడుదల వ్యాపారం సాగిస్తున్నపుడు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. అవి అసలు…

టాలీవుడ్‌లో రకరకాల గ్యాసిప్‌లు వినిపిస్తుంటాయి. వాటిలో కొన్ని నిజాలవుతాయి. మరి కొన్ని గ్యాసిప్‌లుగా మిగిలిపోతాయి. భారీ సినిమాల నిర్మాణం, అలాగే భారీ సినిమాల విడుదల వ్యాపారం సాగిస్తున్నపుడు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. అవి అసలు ఒక్కోసారి ఊహకు అందకుండా వుంటాయి. టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో ఇప్పుడు ఇలాంటి ఓ వ్యూహం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి.

2024 సంక్రాంతికి బోలెడు సినిమాలు పోటా పోటీగా విడుదల డేట్ లు ప్రకటించాయి. ఎవరికి వారు తమ సినిమా విడుదల విషయంలో తగ్గేదేలే అంటూ ఒకటికి రెండు సార్లు ప్రకటిస్తున్నారు. కానీ వేరే వాళ్లు మాత్రం, ఆ సినిమా రాదు, ఈ సినిమా రాదు అంటూ చెబుతూనే వున్నారు. అది వేరే విషయం.

అయితే, నైజాంలో మహేష్-త్రివిక్రమ్ గుంటూరుకారం సినిమా బయ్యర్ దిల్ రాజు. 45 కోట్ల మేరకు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ లెక్కన తీసుకున్నారని టాక్ వుంది. అదే దిల్ రాజు ఓ సినిమాను విజయ్ దేవరకొండ-పరుశురామ్ కాంబినేషన్ లో రెడీ చేస్తున్నారు. ఇది కూడా సంక్రాంతికే అని ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడే ఓ వ్యూహం దాగి వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం సినిమాకు, తను నిర్మించే ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకు మధ్య మూడు రోజులు గ్యాప్ వుండేలా చూస్తానని నిర్మాత దిల్ రాజు హీరో మహేష్ కు మాట ఇచ్చారని ఓ గ్యాసిప్ వుంది. అలా అయితే 15న ఫ్యామిలీ స్టార్ విడుదల చేయాలి. అప్పటికి పండగ అయిపోతుంది. అదో సమస్య. గుంటూరుకారం సినిమాను ఓ రోజు ముందుకు జరిపితే 14న ఫ్యామిలీ స్టార్ వేసుకునే అవకాశం వుంది.

ఇది ఒక స్ట్రాటజీ.

సంక్రాంతికి చాలా సినిమాలు వుంటే గుంటూరు కారం సినిమాకు 45 కోట్లు ఇవ్వడం అన్నది చిన్న రిస్క్ అవుతుంది. అలవైకుంఠపురములో సినిమా నైజాంలో 42 కోట్లు వసూలు చేసింది అంటే అప్పుడు ముఖాముఖీ పోటీ వుంది. ఇప్పుడు ఇన్ని సినిమాల మీద కలెక్షన్లు ఎంత కాదన్నా స్ప్లిట్ అవుతాయి. అలా జరగకూడదు అంటే సంక్రాంతి పోటీలను తగ్గించాలి. అలా తగ్గించాలి అంటే తనే బలమైన పోటీ సృష్టించాలి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తోంది. అటు మహేష్ సినిమా వుంది అంటే మిగిలిన వారు ఆలోచించే అవకాశం వుంది. పైగా రెండూ దిల్ రాజు సినిమాలు అంటే థియేటర్లు తమ సినిమాకు దొరుకుతాయా అన్న భయం వుంటుంది.

ఈ భయం ఇలా జనవరి వరకు వుంచితే ఒకటి రెండు సినిమాలు డ్రాప్ అవుతాయి. అప్పుడు తను కూడా తన ఫ్యామిలీ స్టార్ ను మార్చికి పంపేస్తే, గుంటూరుకారం సినిమాకు పెద్దగా కాంపిటీషన్ వుండదు. ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇదే దిల్ రాజు స్ట్రాటజీ అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఇంకా నాన్ థియేటర్ కాలేదు. గుంటూరుకారం మినహా మరే సంక్రాంతి సినిమాకు నాన్ థియేటర్ బేరాలు పూర్తిగా కాలేదు. అదో సమస్య వుంది.

అయినా కూడా తాము వెనక్కు తగ్గేది లేదు అన్నట్లుగా వుంది సైంధవ్ సినిమా. అంటే గుంటూరు కారం, సైంధవ్ రెండు పక్కాగా వస్తాయి సంక్రాంతికి. ఇక మిగిలిన రెండూ అంటే హనుమాన్, ఈగిల్ లో ఒకటి వచ్చినా సంక్రాంతికి గుంటూరు కారం సినిమాకు పెద్దగా సమస్య వుండదు. అన్ని విధాలా కమర్షియల్ ఆల్ రౌండర్ సినిమా గుంటూరు కారం నే అవుతుంది. అప్పుడు నైజాంలో తనకు సమస్య వుండదు. మిగిలిన చోట్ల తనతో ట్రావెల్ చేస్తున్న గుంటూరుకారం నిర్మాతకు సమస్య వుండదు. ఇదే దిల్ రాజు వ్యూహం అన్నది టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తున్న గ్యాసిప్.

జనవరి ఫస్ట్ వీక్ వరకు ఇలా వినిపిస్తూనే వుంటాయి. అసలు విషయాలు అప్పుడే తెలుస్తాయి.