ఐక్యత విషయంలో దొందూ దొందే!

తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిని గద్దె దించి దెబ్బకొట్టాలని ఆరాటపడుతున్న భారతీయజనతా పార్టీ, కాంగ్రెసుల మధ్య ఒక సారూప్యత ఉంది. ఐక్యత విషయంలో ఈ రెండు పార్టీలు దొందూ దొందే అన్నట్టుగా…

తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిని గద్దె దించి దెబ్బకొట్టాలని ఆరాటపడుతున్న భారతీయజనతా పార్టీ, కాంగ్రెసుల మధ్య ఒక సారూప్యత ఉంది. ఐక్యత విషయంలో ఈ రెండు పార్టీలు దొందూ దొందే అన్నట్టుగా తయారవుతున్నాయి. మామూలుగానే కాంగ్రెసు పార్టీ అంటేనే.. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. నిత్యం ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడంతోనే ఆ పార్టీ రాజకీయం మొత్తం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ భారతీయజనతా పార్టీ కూడా తామేం తక్కువ తినలేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

కాంగ్రెసులో ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. తాను పార్టీ మారుతున్నట్టుగా.. సొంత పార్టీకి చెందిన కీలక నాయకులే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ.. ఆయన గోల పెడుతున్నారు.  సేమ్ టూ సేమ్ అదే పరిస్థితిని బిజెపిలో బండి సంజయ్ కూడా నిన్నటిదాకా ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా కీలక నాయకుల దళాలే దుష్ప్రచారం సాగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీ సారథ్యం మారిన తర్వాత పరిస్థితి మారింది. బండి సంజయ్ ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితంగా ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే ఆ తర్వాత కూడా ఢిల్లీలో అమిత్ షా పార్టీ నాయకులతో నిర్వహించిన ఒక సమావేశంలో.. ముఠాతగాదాలు విడచిపెట్టి అందరూ కలిసి మెలిసి పనిచేయాలని మార్గదర్శనం చేయడం గమనిస్తే చాలు.. ఆ పార్టీలో ముఠా తగాదాలు ఎంతగా పెచ్చరిల్లుతున్నాయో మనకు అర్థమవుతుంది.

గ్రూపు తగాదాలకు రెండు పార్టీలు కీలక చిరునామాలుగా మారి ఉన్న ప్రస్తుత తరుణంలో వీరు భారాస మీద ఎంత గట్టి పోరాటం చేయగలరు అనేది కీలకమైన సంగతి. ఈ పార్టీలు అసమ్మతులతో కుదేలై ఉండడమే వరంగా భారాస మళ్లీ గద్దెఎక్కినా ఆశ్చర్యం లేదు అని పలువురు భావిస్తున్నారు.

కాంగ్రెస్ అంటే గ్రూపులకు కేరాఫ్ అడ్రస్ అని, బిజెపి అంటే క్రమశిక్షణకు మారుపేరు అని ఒకప్పటి నిర్వచనాలుగా భావించాలి. ఇప్పుడు ఈ పార్టీలు దొందూ దొందే అని అంతా అనుకుంటున్నారు.