‘ముని’వాక్యం: వెంకన్న దళారులారా వర్ధిల్లండి!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరువేంకటాధీశుని ప్రత్యక్ష సేవ చేసుకోడమే టీటీడీ ఉద్యోగం. ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి ఇది అద్భుతమైన ఉద్యోగం అనిపిస్తుంది. ఎలాంటి అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు, దందాలు చేసే ఉద్దేశం లేకపోయినా సరే..…

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరువేంకటాధీశుని ప్రత్యక్ష సేవ చేసుకోడమే టీటీడీ ఉద్యోగం. ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి ఇది అద్భుతమైన ఉద్యోగం అనిపిస్తుంది. ఎలాంటి అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు, దందాలు చేసే ఉద్దేశం లేకపోయినా సరే.. దేవదేవుని కొలువులో పని దొరికితే చాలని ఆరాటపడేవాళ్లు చాలా మంది ఉంటారు. వారికి తోడు.. టీటీడీలో ఉద్యోగం ఉంటే.. దందాలు చేసుకోవడానికి, పై ఆదాయానికి చింత ఉండదని, ఇబ్బడిముబ్బడిగా వేతనేతర ఆదాయాలు వెల్లువెత్తుతాయని మక్కువ పెంచుకునే వాళ్లు ఇంకా బోలెడుమంది ఉంటారు.

శ్రీవారి దర్శనం అనేది సామాన్యులకు ఒక అపురూపం. ఏడాదికి ఒక్కసారైనా పదిలమైన దర్శనం దొరికితే చాలని భక్తకోటి అనుకుంటూ ఉంటారు. శ్రీవారి సన్నిధిలో జయవిజయులను దాటిన తర్వాత స్వామి సన్నిధి వరకు అక్కడ ఉండగల భక్తులకు సమాన సంఖ్యలో ఉద్యోగులు, వాలంటీర్లు ఉంటారు. వారంతా భక్తులు స్వామి ఎదుట నిల్చోకుండా ఈడ్చి బయట పారేసే పనిలో చాలా బిజీగా ఉంటారు. 

టీటీడీ ఉద్యోగులనే హోదా ఉన్నవారికి ఈ ఇబ్బందులు ఉండవు. వారు ఓపినంతసేపు  దేవుడిని దర్శించుకోవచ్చు. అది వారికి దక్కే భాగ్యం. దేవుడి సేవలో ఉన్న తరువాత.. ఆ మాత్రం లేకపోతే ఎలా? దానిని మనం అర్థం చేసుకోవచ్చు. వారికి ఆ ప్రత్యేక వెసులుబాటు ఉండాలి కూడా. ఎన్నో ఇతర అవకాశాలను వదులుకుని కూడా.. దేవుడి కోసం టీటీడీ కొలువులకు పరిమితమైన వారు కూడా ఉంటారు. కానీ ఇతరత్రా అంశాల్లో టీటీడీనే వారిని దళార్లుగా మారుస్తున్నట్టుగా కనిపిస్తోంది. భక్తులు మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూను బ్లాక్ మార్కెట్ వైపు మళ్లించేలా ఒక వ్యవస్థీకృత ప్రయత్నం జరుగుతున్నట్టుగా తోస్తోంది.

లడ్డూల విక్రయంలో ఇదివరకు చాలా పరిమితులు ఉండేవి. దిట్టం పరిమితంగా ఉండేది. గతంలో తయారయ్యే లడ్డూల సంఖ్య తక్కువ. భక్తులకు సరిపడా వస్తాయి గానీ.. అదనంగా కావలసినన్ని పొందాలంటే అవకాశం లేదు. లడ్డూలకు స్లిప్పులు ఇచ్చే అధికారం కొందరు అధికారుల చేతిలో ఉండేది. పది, ఇరవై లడ్డూలకు వారు సంతకం చేసి, అధికారిక స్టాంపు వేసి స్లిప్పు ఇస్తే ఆ మేర లడ్డూలు దొరికేవి. పోనీ రోజూ లక్ష మంది భక్తులు వచ్చినా సరే.. వారికి సరిపడేన్ని లడ్డూలు తయారుచేయాలంటే.. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోపలే ఉన్న పోటు (వంటశాల) చాలేది కాదు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తుండేవి. కాలక్రమంలో పరిస్థితులు మారాయి. శ్రీవారి పోటులో జరిగిన ఒకటీ అరా ప్రమాదాలు కూడా టీటీడీ వారి ఆలోచన మార్చాయి. 

ఆగమ విరుద్ధం అని కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. పోటును ఆలయం వెలుపల ఏర్పాటుచేశారు. ఆధునాతన పోటు అది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో లడ్డూలు తయారుచేయగల స్థాయి పోటు. ఆ తరువాత.. భక్తులకు అత్యంత ఆనందదాయకమైన వార్త ఒకటి టీటీడీ నుంచి వచ్చింది. భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తాం అని ప్రకటించారు. 175 గ్రాముల బరువుండే లడ్డూ ధరను యాభై రూపాయలుగా నిర్ణయించారు. అయినా సరే.. భక్తులు విశిష్టంగా భావిస్తారు గనుక.. సంతోషంగా కొనుక్కోవడం జరుగుతుండేది. 

చాలినన్ని లడ్డూలు భక్తులకే విక్రయించడం మొదలయ్యాక ఇక లడ్డూల రూపేణా అక్రమాలు చేసే వారికి, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారికి తలుపులు మూసుకుపోయాయి. అంతా ప్రశాంతంగా నడుస్తూ వచ్చింది. ‘కోరినన్ని’ అని ప్రకటించినప్పటికీ.. ఒక్కో భక్తుడికి పదీఇరవై మాత్రం ఇచ్చేవాళ్లు. బంధుమిత్రులకు పంచుకోదలచుకున్నప్పటికీ.. అంతకంటె ఎక్కువ ఎవ్వరూ కోరుకోరు గనుక.. అంతా సవ్యంగా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు లడ్డూ ప్రసాదం విషయంలో మళ్లీ అప్రకటిత రేషన్ విధానం మొదలైనట్టుగా కనిపిస్తోంది.

కౌంటర్లలో ఒక్కో భక్తుడికి నాలుగు లడ్డూలు మాత్రమే ఇస్తున్నారు. కౌంటర్లూ ఖాళీగానే ఉంటాయి, లడ్డూలూ పుష్కలంగానే ఉంటాయి. అయినా ఒకరికి నాలుగు మాత్రమే ఇస్తారు. ఇరవై లడ్డూలు కావాలంటే.. అయిదు కౌంటర్లు తిరిగి తెచ్చుకోవచ్చు. సామాన్యులకు పద్ధతి ఇలా మార్చారు. అదే సమయంలో లడ్డూలాగానే శ్రీవారి వడ ప్రసాదం కూడా అందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనది. అది సామాన్య భక్తులకు దొరకడం అనేది గగనం. ఉద్యోగులకు ప్రత్యేకించిన కౌంటర్లో మాత్రమే ఉంటుంది. ఆ కౌంటర్లో ఉద్యోగులకు కోరినన్ని లడ్డూలు ఇస్తారు. వడలు వారికి మాత్రమే దొరుకుతాయి. ఉద్యోగిగా గుర్తింపు కార్డు అక్కడ చూపించి తీసుకోవచ్చు. ఒక్కొక్కరూ నాలుగైదు వడలు కూడా తీసుకుని వెళుతుంటారు. అసలు సందేహం మొదలయ్యేది ఇక్కడే. 

టీటీడీ ఉద్యోగి అయినంత మాత్రాన నాలుగైదు వడలు తీసుకువెళ్లి ఏం చేసుకుంటారు? అవి ఇతరులెవ్వరికీ, సామాన్య భక్తులెవ్వరికీ దొరకడం లేదు గనుక.. వాటి ధరకు అదనంగా ఒక విలువను జోడించి అమ్ముకుంటారు. ఆ ‘అదనపు విలువ’ డబ్బురూపేణా మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. వారు  బ్లాక్ లో అమ్మడం లేదు.. అని బుకాయిస్తే సరిపోదు. ఎదుటి వారి ప్రాపకం, ప్రత్యుపకారమూ కూడా అయి ఉండొచ్చు. ఏదైనా సరే.. అది బ్లాక్ మార్కెటింగే. టీటీడీ స్వయంగా ఉద్యోగులలో దళారీ వైఖరిని ప్రోత్సహిస్తున్నట్టుగా ఈ వ్యవస్థ తయారవుతోంది. ఆలోచన లేని వారిలో కూడా ఇలాంటి పనిచేయించగల వ్యవస్థలోని లోపాలు ఇవి!

సాధారణంగా కొన్ని సందేహాలు కలుగుతుంటాయి.. అతిపెద్ద పోటును నిర్మించిన తర్వాత భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వడానికి సరిపడా ఎందుకు తయారు చేయడం లేదు. కృత్రిమ కొరతను ఎందుకు సృష్టిస్తున్నారు. లడ్డూల ధర పెంచి, అందుబాటులోకి తెచ్చినట్టుగానే వడను కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? దిట్టం (ఒక రోజు ప్రసాదాల తయారీకి కేటాయించే దినుసుల పరిమాణం) అనే మాట దీనికి జవాబుగా చెబితే గనుక.. అంతకుమించిన వంచన మరొకటి ఉండదు.

ఎందుకంటే.. లడ్డూల విషయంలో దిట్టంను యథేచ్ఛగా మార్చుకున్నప్పుడు.. అదే సూత్రం వడకు కూడా వర్తిస్తే ఏమవుతుంది. చాలినన్ని వడలు కూడా అందుబాటులో ఉంచిత.. వడ దళారీల చిన్నస్థాయి అక్రమ వ్యాపారానికి గండి పడుతుందని అనుకుంటున్నారా? లేదా.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అడ్డదారిని చూపించడం తమ బాధ్యత అని టీటీడీ పాలకులు  భావిస్తున్నారా? తెలియదు!

‘దేవుడు భక్త సులభుడు’ అని మనం చదువుకుంటాం. తిరుమల వెళ్లి మొక్కకపోయినా.. అర్హులైన, ఆశ్రితులైన భక్తులను ఆయన సమానంగా అనుగ్రహిస్తుంటాడు. కానీ.. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడనే సామెత చందంగా.. దేవుడి దర్శనం దొరికినా సరే.. దేవుడి ప్రసాదాలు దొరకడం దుర్లభమని నిరూపిస్తూ లడ్డూ, వడ ప్రసాదాలు భక్తుల ఎదుట నిలువెత్తు ప్రశ్నార్థకాలుగానే వికటనృత్యం చేస్తుంటాయి.

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]