ఆస్కార్ హార్ట్జెల్ అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఒక వ్యవసాయ కూలీల కుటుంబంలో జన్మించాడు. డబ్బు లేక చదువు మానేసి తలిదండ్రులకు పనిలో సాయపడుతూ వుండిపోయాడు. అతను యువకుడిగా వుండగా 1918లో ఓ ఆగంతకుడు వాళ్లింటికి వచ్చి అతని తల్లితో కబుర్లు చెప్పసాగాడు. మాటల్లో 'బ్రిటన్ గవర్నమెంటు డ్రేక్ ఎస్టేటును ఎలా స్వాహా చేసిందో మీ కా వైనం తెలుసా?' అని అడిగాడు. తెలీదని చెప్పగానే ఆ కథ చెప్పాడు –
''16 వ శతాబ్దంలో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అని సాహసి ఐన నావికుడు ఒకడు వుండేవాడు. ఓడల్లో ప్రపంచాన్నే చుట్టి వచ్చాడు. ఆనాటి బ్రిటిషు రాణి ఒకటవ ఎలిజబెత్ అతనికి వైస్ ఎడ్మిరల్ పదవి నిచ్చింది. 1581లో సర్ బిరుదు నిచ్చింది. ఆవిడ ప్రోద్బలంతో అతను స్పెయిన్ దేశంతో నౌకా యుద్ధం చేశాడు. అంతేకాదు, వాళ్ల ఓడల్ని కూడా దోచుకుని సముద్రపు దొంగగా పేరుబడ్డాడు. బోల్డంత ఐశ్వర్యం గడించాడు. నిజం చెప్పాలంటే అతను రాణిగారికి రహస్య ప్రియుడు. ఆవిడ పెళ్లి చేసుకోలేదు కాబట్టి కన్య అనుకుంటారు కానీ యితనితో సంబంధం వుండేది. డ్రేక్ 1596 జనవరిలో తన ఓడలో పనామా తీరంలో తిరుగుతూండగా చచ్చిపోయాడు. అఖండమైన తన సంపద గురించి విల్లు రాశాడు కూడా. దాన్ని ప్రొబేట్ (నమోదు) చేయిద్దామని ఎక్సెలెసియాస్టికల్ కోర్టులో సమర్పిస్తే బ్రిటిషు రాణి ఆ విల్లు బయటకు రాకుండా తొక్కి పెట్టింది. దానిలో తన గురించి రాసి వుండడమే కారణం. ఆ విల్లును గుర్తించకపోవడంతో డ్రేక్ వారసులకు ఆస్తి గురించి అడిగే హక్కు లేకుండా పోయింది. ఆ ఆస్తులన్నీ బ్రిటిషు ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది.''
''అన్యాయంగా వుందే! మరి డ్రేక్ కుటుంబసభ్యులు న్యాయస్థానాల్లో పోరాడలేదా?'' అడిగింది ఆస్కార్ తల్లి.
''రాణికి వ్యతిరేకంగా ఎవరు తీర్పు చెప్పగలరు? ఆమె పోయిన తర్వాత ఏవో ప్రయత్నాలు చేశారు కానీ కలిసి రాలేదు. ఇన్నాళ్లకు వాళ్ల వారసులలో ఒకడు గట్టిగా పట్టుపట్టాడు. బ్రిటిషు ప్రభుత్వం మెడలు వంచైనా న్యాయంగా రావలసినది రాబడతానని శపథం చేశాడు. ఆ ఆస్తుల విలువ యిప్పుడు మిలియన్లు, బిలియన్లలో వుంటుంది. ప్రభుత్వం ఓ పట్టాన యిస్తుందా? పెద్దపెద్ద లాయర్లను పెట్టుకోవాలి. అతని దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పుడు తనకు సాయం చేస్తే కేసు గెలిచాక అంతకు పది రెట్లు వెనక్కి యిస్తానని చెపుతూ అమెరికా వచ్చాడు. నాకు నమ్మకం కుదిరి నేను కొంత యిచ్చాను. నువ్వు కూడా కావాలంటే ఏ పది డాలర్లో యివ్వవచ్చు. కొండకు వెంట్రుక వేసినట్లే! వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది.'' అన్నాడు ఆగంతకుడు.
ఆస్కార్ తల్లికి యీ పథకం నచ్చింది. తన పేరు రాసుకోమని చెప్పి పది డాలర్లు అతని చేతిలో పెట్టింది. ఇదంతా చూసిన ఆస్కార్ లైబ్రరీకి వెళ్లి ఫ్రాన్సిస్ డ్రేక్ అనేవాడున్నాడా లేదా అని పుస్తకాలు తిరగేశాడు. నిజంగానే వుండేవాడు. ఎలిజబెత్ రాణికి సన్నిహితుడు, చాలా ఆస్తులు గడించాడు అని వుంది. అతని వారసులు, ఆస్తి గొడవలు పుస్తకాల్లో లేవు. చుట్టుపట్ల వూళ్లల్లో తిరిగి తన తల్లిలా వేరెవరైనా డబ్బు యిచ్చారా అని కనుక్కోబోయాడు. బోల్డుమంది యిచ్చినట్లు తేలింది. అందరూ కూడా తమ పెట్టుబడికి కనీసం పది రెట్లు తిరిగి వస్తుందనే ప్రగాఢ నమ్మకంతో వున్నారు.
ఈ కథను ఎంత రంజుగా చేసి అమ్మగలిగితే అంత లాభముందని ఆస్కార్‌కు అర్థమైంది. అయితే యిలా చిలక్కొట్టుడు కాకుండా భారీ స్థాయిలో చేయాలనుకున్నాడు. డబ్బులు జాగ్రత్త పెట్టుకుని కొన్నాళ్లకు చికాగో వెళ్లాడు. అక్కడ యిలాటి మోసాల్లో ఆరితేరిన వారెవరాని ఆరా తీశాడు. వెతగ్గా, వెతగ్గా యిద్దరు దొరికారు. సూడీ విటేకర్ అని ఒకావిడ, మైలో లూయీస్ అనే మరో అతను. వాళ్లు యితన్ని చూసి ఎవడో పల్లెటూరి బైతు అనుకుని కొట్టి పడేయబోయారు కానీ అతని పథకం గురించి దీర్ఘంగా ఆలోచిస్తే దీనిలో బంగారపు గని వుందని తోచింది. ముగ్గురూ కలిసి పథకానికి మెరుగులు దిద్దారు. 1919 జనవరిలో 'సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అసోసియేషన్' అని ఏర్పరచారు. కోర్టుల ద్వారా బ్రిటిషు ప్రభుత్వంతో పోట్లాడి వారు చట్టవిరుద్ధంగా అట్టేపెట్టుకున్న డ్రేక్ జమీని విడిపించి అసలైన వారసుడికి అప్పగించడమే మా లక్ష్యం అని ప్రకటించుకున్నారు. డ్రేక్ అనే యింటిపేరున్న వాణ్ని ఎవరినైనా వెతికి పట్టుకుని వాణ్ని చూపించి డబ్బులడుగుదామా అనుకున్నారు కానీ ఎందుకులే, ఎవడో ఒకడి పేరు చెప్తే అడిగేవాడెవడని ధైర్యం తెచ్చుకున్నారు.
ఆస్కార్ అయోవాకు వెళ్లి ''మిస్సోరీలో ఎర్న్స్ట్ డ్రేక్ అని ఉన్నాడు. అతనే అసలైన వారసుడు. పాపం ప్రస్తుతం డబ్బు లేదు. అతని ఆస్తి అతనికి దక్కేట్లు చేస్తే మన ఋణం వుంచుకోడు. మనమంతా కలిసి డబ్బులేసి అతనికి సమకూరిస్తే అంతకు వంద రెట్లు తిరిగి యిస్తాడు. ఇదేమైనా అతని కష్టార్జితమా ఏమన్నానా. ఎలాగూ వూరికే వచ్చేదే కదా. మన సాయం లేనిదే అతను కోర్టు గుమ్మం కూడా తొక్కలేడు కడా.'' అని చెప్పసాగాడు. ఆస్కార్ లావుగా, ఎత్తుగా ఒత్తు జుట్టుతో అసలుసిసలు రైతులా వుండేవాడు. వాళ్ల భాషే మాట్లాడేవాడు. దాంతో అతను టక్కరి అని ఎవరూ అనుకోలేదు. నమ్మి డబ్బులు యివ్వసాగారు. ఒకసారి యిచ్చినవాళ్లు మళ్లీ మళ్లీ యివ్వసాగారు. ఇదంతా చూసి అతను ఒక ప్రణాళిక రూపొందించాడు. ''మీరు ఎంత యిస్తున్నారో ఆ లెక్కలు రాసి పెడుతున్నాం. డబ్బు యివ్వగానే మీకు రసీదులు యిస్తాం. జాగ్రత్త పెట్టుకోండి. ఆస్తి చేతికి వచ్చాక దాన్ని అమ్మి మీ పెట్టుబడుల నిష్పత్తిలో మీ అందరికీ పంచుతాం. పెట్టుబడి పెడదామనుకున్నదంతా ఒకేసారి యివ్వనక్కరలేదు, వారం వారం వాయిదాల్లో యివ్వవచ్చు.'' అని చెప్పాడు. ప్రతి వూరికి కలక్షన్ ఏజంట్లను పెట్టాడు. వాళ్ల చేత రసీదులు యిప్పించాడు. కొంత కమిషన్ అట్టే పెట్టుకుని తక్కినది హెడ్క్వార్టర్సుకు పంపమన్నాడు. బ్రిటిషు ప్రభుత్వంతో తమ పోరాట వ్యవహారం ఎంతవరకు వచ్చిందో వారంవారం తెలియపరుస్తూ వుండేవాడు.
16 వ శతాబ్దపు డ్రేక్ తాలూకు ఆస్తుల విలువ కట్టి, యిన్నాళ్ల చక్రవడ్డీ చేర్చి వారసుడికి యివ్వవలసి వచ్చేసరికి, బ్రిటన్ ప్రభుత్వపు ఖజానా ఊడ్చుకుపోతుందని, అనేక బ్యాంకులు మూతపడతాయని, దాన్ని నివారించడానికి బ్రిటన్ ధనికవర్గాలు ఏకమై యీ వ్యవహారం ముందుకు సాగకుండా అడ్డుపడతాయని, అమెరికాలోని ధనికవర్గాలు వాళ్లకు బాసటగా నిలిచి కథను అడ్డం తిప్పేస్తాయని, అందువలన మొత్తం వ్యవహారం గోప్యంగా వుంచాలని తన యిన్వెస్టర్లకు ఆస్కార్ నచ్చచెప్పాడు. ఎవరేమి అడిగినా పెదవి విప్పకూడదని, తమ ప్రయత్నం గురించి ఉప్పందితే చాలు, అమెరికాలోని ధనికులు ఏవేవో అడ్డంకులు కల్పిస్తారని, తనను ఇంగ్లండు వెళ్లకుండా ఆర్డర్లు వేయిస్తారని నమ్మబలికాడు. ఎవరైనా యాథాలాపంగానైనా నోరు జారితే, అతని డబ్బు అతనికి మొహాన కొట్టేసి జాబితాలోంచి పేరు కొట్టేస్తానన్నాడు. అతని మాటలను వేదవాక్కులా నమ్మారు యిన్వెస్టర్లు. అయోవాలో ప్రయోగం విజయవంతం కావడంతో ఆస్కార్, అతని భాగస్వాములు ఇంకో ఏడు రాష్ట్రాలకు తమ కార్యకలాపాలు విస్తరించారు. అక్కడా సూపర్ సక్సెస్ కావడంతో మరో నాలుగు రాష్ట్రాలకు..! మొత్తం అమెరికా, కెనడాల దాకా పాకిపోదామా అనుకున్నాడు కానీ తమాయించుకున్నారు.
ముగ్గురిలో ఆస్కారే ప్రధాన పాత్ర తీసుకున్నాడు. తన సామ్రాజ్యాన్ని 21 ప్రాంతాలుగా విడగొట్టి, ఒక్కో దానికి ఒక్కో ఫీల్డు ఏజంటు పెట్టాడు. వాళ్లు వాళ్ల అధీనంలో వున్న వూళ్లల్లో కలక్షన్లు సేకరించి యితనికి పంపేవారు. కమిషన్లు పోను అతనికి వారానికి 250 డాలర్లు తక్కువ కాకుండా వస్తూ వుండేది. ఇది ఎప్పటికో అప్పటికి బయటపడుతుందనే ముందుచూపుతో ఆస్కార్ తన దగ్గర ఏ రికార్డూ వుంచుకోలేదు. వసూళ్లకు సంబంధించిన రసీదు కాపీలు, రికార్డులు ఏజంట్ల దగ్గరే వుంచుకోమనేవాడు. ఎవరికీ లిఖిత పూర్వకంగా హామీలు యిచ్చేవాడు కాదు. చెక్కుల ద్వారా డబ్బు పుచ్చుకునేవాడు కాదు. మనీయార్డర్ల ద్వారా డబ్బు తెప్పించుకునేవాడు. తన సందేశాలను టెలిగ్రాంద్వారా పంపేవాడు. ఆ సందేశాలను ఏజంట్లు తమ ఉపన్యాసాల ద్వారా వ్యాప్తి చేసేవారు. ఒక్కో సమావేశానికి వేలాది మంది యిన్వెస్టర్లు హాజరయ్యేవారు. ఒక పట్టణంలో ఒక మతాధికారి ఏజంటుగా చేరాడు. అతనీ కథను పూర్తిగా నమ్మాడు. అతను తన అనుయాయులకు చెప్పేవాడు – 'ఈ వ్యవహారం ఆషామాషీ కాదు. ఎలిజబెత్ రాణికి డ్రేక్ ద్వారా ఒక కొడుకు పుట్టాడు. డ్రేక్ విల్లు బయటకు వస్తే అది బయటపడుతుంది. బ్రిటన్ రాజరికానికే మచ్చ పడుతుంది. అందువలన బ్రిటిషు ప్రభుత్వం ఎలాగైనా సరే, కేసు ముందుకు నడవకుండా చూస్తుంది. కానీ ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది. కేసు గెలిచాక మనకు కనకవర్షమే.' అని. ఈ వరస మూడేళ్లు నడిచింది. డబ్బు లావాదేవీలు పోస్టు ఆఫీసు ద్వారానే జరిగాయి కాబట్టి వాళ్లకే అనుమానం రావాలి. కానీ పోస్టు ఆఫీసు యిన్స్పెక్టర్లకు ఏ అనుమానమూ రాలేదు.
ఇన్వెస్టర్లకు నమ్మకం పెరగాలంటే తాము ఇంగ్లండు పయనమవ్వాలని భాగస్వాములు తీర్మానించారు. ముగ్గురూ వెళ్లారు. వెళ్లాక తాము యీ వ్యవహారాలు చూసే బ్రిటిషు అధికారులు ఎవరో ఎలా కనుక్కున్నామో, డబ్బు చేతికి రావడానికి ఎన్ని దశలు దాటాలో, దానికి ఎంత ఆలస్యమవుతుందో, ఎంత ఖర్చవుతుందో, ఓపిక పడితే ఎంత లాభముందో వివరంగా సందేశాలు పంపేవాడు. 1922 జనవరిలో ఆస్కార్ హఠాత్తుగా తన భాగస్వాములు తన ప్రయత్నాలకు అడ్డు తగులుతున్నారని, బహుశా బ్రిటన్ ధనికవర్గం వారిని లోబరుచుకుందని, అందువలన వాళ్లను సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అసోసియేషన్ నుంచి తొలగిస్తున్నానని ప్రకటించాడు. చిత్రం ఏమిటంటే వాళ్లిద్దరూ ఆస్కార్ ఆరోపణలను ఖండించలేదు. అంటే వారికి ఎంతో కొంత యిచ్చేసి వదుల్చుకున్నాడని, యిప్పణ్నుంచి మొత్తం తనే ఆపరేట్ చేద్దామనుకున్నాడని అనుకోవాలి. ఇంచుమించు అదే సమయంలో ఎర్నెస్ట్ డ్రేక్ అసలైన వారసుడు కాడని, ఒట్టి ఫ్రాడ్ అని తేలిందని, అతన్ని పెట్టుకుని ముందుకు వెళితే మునిగిపోయేవాళ్లమని, అసలైన వారసుడి కోసం అన్వేషించి అప్పుడు మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పాడు. కొన్నాళ్లకు అసలువాడు దొరికాడని, అతను ఇంగ్లండులోనే వున్నాడనీ, తన ప్రయత్నాలకు మురిసి పోయి, తన పేర పవరాఫ్ ఎటార్నీ రాసి యిచ్చేశాడనీ కూడా తెలిపాడు. డ్రేక్ ఎప్పుడో పోయాడు కదా, అతనికి చుట్టాలు, పక్కాలు వేలాది వారసులుండాలి కదా, ఒక్కడే ఒక్కడు మిగలడమేమిటి? అతను కూడా ముక్కూ మొహం తెలియని అమెరికా వాడికి సర్వాధికారాలు అప్పగించడమేమిటి? వంటి ప్రశ్నలు ఎదురవుతాయేమోనని ఆస్కార్ వేచి చూశాడు కానీ ఒక్కడూ అడగలేదు. వాళ్ల దురాశ అలాటిది.
స్కీము ప్రారంభమై నాలుగేళ్లవుతూండగా పోస్టల్ యిన్స్పెక్టర్లకు వాసన తగిలింది. ఈ డబ్బు పంపడాలేమిటంటూ ప్రాథమిక పరిశోధన మొదలుపెట్టారు. కానీ యిన్వెస్టర్లలో ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు తెరవలేదు. ఆస్కార్, అతని ఏజంట్ల గురించి వాళ్లు ఫైలు తెరిచి వివరాలు నమోదు చేసుకున్నారు కానీ సాక్ష్యాలు ఏవీ దొరక్కపోవడంతో అడుగు ముందుకు పడలేదు. అక్కడ లండన్‌లో ఆస్కార్ ఒక ప్రఖ్యాత లొకాలిటీలో ఖరీదైన ఎపార్టుమెంటులో దర్జాగా బతకసాగాడు. తను బ్రిటన్ ప్రధానమంత్రిని కలిశానని, యీ విషయం చెప్పినప్పుడు ఆయన మొదట్లో కొట్టి పారేసినా, తర్వాత గత్యంతరం లేక యిదంతా వాస్తవమే అని ఒప్పుకున్నాడని, కోర్టుకి వెళ్లకుండా తగాదా సెటిల్ చేసుకుందామన్నాడని, కానీ దానికి ముందు డ్రేక్ అసలు విల్లు ప్రభుత్వపు దస్తావేజుల్లోంచి బయటకు తీయించాలని, ఆ ఆస్తుల విలువ, వడ్డీలతో కలిపి ఎంత అవుతుందో లెక్కకట్టి ఆ మొత్తానికి కోర్టులో కేసు వేయాలని, దాని కోసం లెక్కల్లో గట్టిపిండాల కోసం వెతుకుతున్నాననీ.. యిలా యింకో నాలుగేళ్లు లాగించాడు.
ఆ తర్వాత 1927 నవంబరులో వచ్చే నెలలో ఫైనల్ సెటిల్మెంట్ అయిపోతుందని ఊరించాడు. ఈ విషయం వినగానే యిన్వెస్టర్లు అప్పో, సప్పో చేసి యింకా పెట్టుబడులు పెట్టారు. నెల అన్నది యింకో ఆర్నెల్లు అయింది. 1928 జూన్‌లో ఓ సందేశం పంపాడు – 'అసలు మే 29 న ఒప్పందంపై సంతకాలు అయిపోవాల్సి వుంది. కానీ సంతకాలు పెట్టవలసిన ఉన్నతాధికారుల్లో ఒకరైనా లార్డ్ కేవ్ జబ్బు పడ్డారు. ఆయన స్థానంలో వచ్చినాయన పేపర్లన్నీ మళ్లీ మొదణ్నుంచి చూస్తానన్నాడు. అలా చూడడంలో వడ్డీ లెక్కల్లో 12 లక్షల డాలర్లు తేడా వుందని, ఆ మేరకు నాకు తక్కువ వస్తోందని కనిపెట్టాడు. తక్కువైనా ఫర్వాలేదని నేను చెప్పినా ఆయన వినలేదు. లెక్క లెక్కే అన్నాడు. దాంతో మళ్లీ చెకింగ్ మొదలెట్టారు. దీని కారణంగా మరింత ఆలస్యం అవుతోంది.'
ఈ 12 లక్షల పేరు చెప్పి మరో ఏడాది గడిపాడు. అంతలో 1929 వచ్చింది. బ్రిటన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దేశ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైంది. అది కూడా ఆస్కార్‌కు కలిసి వచ్చింది. 'ఇంత భారీ మొత్తం చేతులు మారుతోందని ఎలాగో లీక్ అయింది. బ్రిటన్ ఖజానా ఖాళీ అవుతోందని తెలియడంతో షేరు మార్కెట్టు పడిపోయింది. అది కోలుకునేదాకా మన వ్యవహారం ఆలస్యమవుతుంది. నెలలు, ఏళ్లు కూడా పట్టవచ్చు. కానీ నేను యీ భగీరథ ప్రయత్నాన్ని వదిలిపెట్టను. సాధించి తీరతాను.' అన్నాడు. ఇన్వెస్టర్లు నమ్మారు. ఆ తర్వాతి సంఘటనలు వారి నమ్మకాన్ని మరింత దృఢపరిచాయి. ఆర్థికమాంద్యం అమెరికాను కూడా చుట్టుముట్టింది. నిరుద్యోగం ప్రబలింది. అమెరికా అధ్యక్షుడు మళ్లీ కోలుకుంటామంటూ ఉపన్యాసాలు యిచ్చాడు. 'చూశారా, డ్రేక్ సెటిల్మెంట్ను ఎలాగైనా వ్యతిరేకిస్తున్నానని పరోక్షంగా చెప్తున్నాడు' అన్నాడు ఆస్కార్. ఔనౌనన్నారు యిన్వెస్టర్లు.
1931 వచ్చేసరికి అమెరికన్ పోస్టల్ యిన్‌స్పెక్టర్లు యిక కార్యాచరణకు ఉపక్రమించారు. ఆస్కార్ వద్ద పనిచేసే ఐదుగురు ప్రధాన ఏజంట్లను పట్టుకుని యికపై తమ కార్యకలాపాలను ఆపేస్తామని వాళ్ల చేత రాయించి పుచ్చుకున్నారు. ఈ వార్త పేపర్లలో రావడంతో ఆస్కార్ కంగారు పడ్డాడు. 'మీరు నా మాటలు నమ్ముతారో, వారి మాటలు నమ్ముతారో మీ యిష్టం. ఎవరైనా వెళ్లిపోదామనుకుంటే వారి వాటాలు నేను కొనేస్తాను. నాకెంత డబ్బు వస్తుందో మీరు వూహించలేరు. అయోవాలో ఎకరా 125 డాలర్ల చొప్పున కొనేసి, ఆ రాష్ట్రంలోని బ్యాంకు డిపాజిట్లను, రైళ్లను, నగరాలను కొనేసి దాని చుట్టూ కంచె వేసేయగలను. అయినా నా దగ్గర యింకా డబ్బు మిగులుతుంది.' అని ప్రకటించాడు. అతన్ని యిన్నాళ్లూ నమ్ముతూ వచ్చిన యిన్వెస్టర్లపై యీ మాట మంత్రంలా పనిచేసింది. ఈ స్కీమంతా ఓ పెద్ద రాకెట్ అని, ప్రజలెవ్వరూ ఆస్కార్‌కు డబ్బు యివ్వవద్దంటూ అయోవా అటార్నీ జనరల్ ఓ ప్రకటన యిస్తే 'నువ్వు అమెరికా, ఇంగ్లండు ధనికవర్గానికి అమ్ముడుపోయావు' అంటూ అతనిపై విరుచుకు పడుతూ వేలాదిమంది ఉత్తరాలు రాశారు. ఓ పక్క దేశంలో ఆర్థికమాంద్యం. డబ్బుకి కటకట. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అయినా వీళ్లు యిళ్లూ, పొలాలూ తాకట్టు పెట్టి అదనంగా షేర్లు కొన్నారు.
ఈ డబ్బంతా ఆస్కార్ ఏం చేస్తున్నాడన్న సందేహం రావచ్చు. అతను లండన్‌లో ఒక జోస్యురాలి దగ్గరకు వెళ్లేవాడు. ఆమె ఒక గాజుగోళంలోకి చూస్తూ యితని భూతభవిష్య వర్తమానాలు చెప్పేది. నీకు ఎదురు లేదంటూ ఆశలు చూపి బాగా డబ్బు గుంజేది. నిజానికి ఆస్కార్ మొదటిసారి వెళ్లినపుడు యితని దగ్గర బాగా డబ్బుందని పసిగట్టి ఆమె ఒక ప్రయివేటు డిటెక్టివ్‌ను నియమించుకుంది. అతను ఆస్కార్‌తో స్నేహం పెంచుకుని బార్కి తీసుకెళ్లి బాగా తాగించేవాడు. తాగుడు మైకంలో ఆస్కార్ వాగినవన్నీ జోస్యురాలికి చేరవేసేవాడు. ఆవిడ అవన్నీ గాజుగోళంలో కనబడుతున్నట్టు నాటకమాడి, ఆస్కార్‌ను బుట్టలో పెట్టింది. తన బోగస్ పథకం గురించి కూడా ఆమె చెప్పేసరికి ఆస్కార్ తెల్లబోయి, ఆమెకు దాసోహమన్నాడు. దీనికి తోడు జోస్యురాలి వద్ద ఒక అసిస్టెంటు వుండేది. ఆ యువతి పుష్టిగా వుండి, మత్తెక్కించే కళ్లతో ఆస్కార్‌ను వెర్రెక్కించేది. ఆమె కోసమైనా రోజు విడిచి రోజు వచ్చేవాడు ఆస్కార్. అతన్ని శృంగారంలో ముంచెత్తి అసిస్టెంటు డబ్బు లాగేది. ఈ విధంగా లక్షలాది అమాయకుల్ని మోసం చేసి కొట్టేసిన డబ్బు యీ యిద్దరి ఎదాన పోసేవాడతను. అతనికి ఓ ఇంగ్లీషు ప్రియురాలుండేది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఇతని వలన ఆమె ఒక కొడుకుని కంది. వాళ్ల మేన్టెనెన్సుకై కొంత డబ్బు పడేస్తూ వూరుకోబెట్టాడు.
ఇక్కడ అమెరికాలో పోస్టల్ ఇన్స్పెక్టర్లు 1933 జనవరిలో ఏడుగురు ఏజంట్లపై ఫ్రాడ్ ఆర్డర్ జారీ అయ్యేట్లు చేశారు. ఏజంట్లు అందుబాటులో లేకపోవడం చేత కలక్షన్లు తగ్గాయి తప్ప యిన్వెస్టర్లకు నమ్మకం పోలేదు. దీన్ని నిరసిస్తూ మీ సెనేటర్లకు, పోస్టాఫీసు సొలిసిటర్కు, అమెరికన్ ఎటార్నీ జనరల్‌కు ఉత్తరాలు రాయమని ఆస్కార్ తన ఏజంట్లను ఆదేశించాడు. వాళ్లు రాశారు కూడా. ఫ్రాడ్ ఆర్డరు కారణంగా పేపర్లలో నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది. ఈ వార్తలు ఇంగ్లండు వరకు పాకి పార్లమెంటులో చర్చ జరిగింది కూడా. అయితే అతను బ్రిటన్ చట్టాల ప్రకారం ఏ నేరం చేయకపోవడం చేత అతనిపై చర్య తీసుకోవడం వీలు పడలేదు. స్కాట్లండ్ యార్డ్‌కి చెందిన గూఢచారులు అతని వద్దకు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. అయినా అతను తొణకలేదు, బెణకలేదు. అసలు వారసుడి పేరు చెప్పమంటే చెప్పనన్నాడు, మీ లాయర్లు ఎవరంటే అదీ చెప్పనన్నాడు. ఏం చేసేది లేక చివరకు అవాంఛిత విదేశీయుడు అని ముద్ర కొట్టి 1933లోనే వెనక్కి అమెరికాకు పంపేశారు.
అమెరికాలో దిగగానే పోస్టల్ ఇన్స్పెక్టర్లు అరెస్టు చేశారు. అతని అయోవా ఏజంట్లు బెయిల్ ఏర్పాటు చేసి బయటకు తీసుకుని వచ్చేశారు. వస్తూనే ఆస్కార్ తన యిన్వెస్టర్లకై ఓ పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. ఇన్వెస్టర్లు యిదివరకు చూసిన ఆస్కార్ కాదతను. ఇప్పుడు సూటూ, బూటులో, పెద్ద ఇంగ్లీషు లార్డ్‌లా వున్నాడు. బ్రిటిషు యాసలో మాట్లాడాడు. జులైలో సెటిల్మెంట్ ఖాయం అన్నాడు. ఈ లోగా ప్రభుత్వాలు తనని వేధిస్తున్నాయని, తనను నమ్మినవారి కోసం ఎంత కష్టాన్నయినా భరిస్తానని హామీ యిచ్చాడు. అతని మాటలకు శ్రోతలు బోల్తా పడ్డారు. అతని వేషభాషలు చూసి 'మన డబ్బుతో దర్జా వెలగబెడుతున్నాడు' అనుకోలేదు. లండన్‌లో ప్రధానమంత్రిని, యితర కులీనులను కలుస్తున్నాడంటే ఆ పాటి హంగు వుండకపోతే ఎలా అనుకున్నారు. తనపై కేసులు పోరాడడానికి విరాళాల కోసం అడిగినప్పుడు 68 వేల డాలర్లు పోగుపడ్డాయి. అది తీసుకుని ఆస్కార్ న్యూయార్క్ చేరాడు.
ఈ లోగా అమెరికన్ పోస్టల్ ఇన్స్పెక్టర్లు లండన్ చేరి సాక్ష్యాల కోసం అన్వేషించారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీవారు అతనికి 1924-33 మధ్య న్యూయార్కు నుంచి 7,30,000 డాలర్లు వచ్చాయని చెప్పారు. అతని గదికి వెళ్లారు. అతనికి సహాయకుడిగా పనిచేసిన వ్యక్తి మా యజమాని పెద్ద ఫ్రాడ్ అని చెప్పాడు. ఆయన వెళ్లిపోయాక పదివేల డాలర్లు వస్తే అది జేబులో పెట్టేసుకున్నానని ఒప్పుకున్నాడు. అతని గదిలో కాగితాలు, దస్తావేజుల కోసం వెతికితే వాటిని ఒక లాయరు పట్టుకుపోయాడని తెలిసింది. తమ కిమ్మంటే చచ్చేటంత రేటు చెప్పాడు. ఇన్స్పెక్టర్లు ఆశ వదిలేసి ఆ ప్రయివేటు డిటెక్టివ్‌ను దొరకపుచ్చుకున్నారు. అతని ద్వారా జోస్యురాలి సంగతంతా తెలిసింది. ఫ్రాన్సిస్ డ్రేక్ ఆస్తి యింకా వివాదంలోనే వుందా, విల్లు నమోదు అయిందా లేదా కనుక్కుందామని పాత దస్తావేజులు చూడబోతే 1595 ఆగస్టులోనే ప్రొబేట్ అయినట్లు తేలింది. డ్రేక్ మరణం తర్వాత అతని భార్య, తమ్ముడు ఆ విల్లులో ఆస్తుల గురించి కోర్టుల కెక్కిన వైనం కూడా బయటపడింది. అయినా బ్రిటిషు చట్టాల ప్రకారం వ్యక్తి మరణం తర్వాత ఏదైనా విల్లు 30 ఏళ్ల పాటు నమోదు కాకుండా వుంటే అది కాలదోషం పట్టినట్లే. ఈ వివరాలతో 1933 నవంబరులో పోస్టల్ యిన్‌స్పెక్టర్లు వెనక్కి వచ్చి ఆస్కార్‌ను బోనెక్కించారు. కోర్టులో ఆస్కార్ తనకు ప్రతికూలంగా చేస్తున్న వాదనలను పట్టించుకున్నట్లు కనబడలేదు. అతనికి పదేళ్ల శిక్ష పడింది. వెంటనే బెయిలు కూడా వచ్చింది.
బయటకు వచ్చాక అతను చికాగోకు నివాసం మార్చాడు. 1934 ఫిబ్రవరిలో తన యిన్వెస్టర్లను సమావేశపరిచి తను జనాలకు ఏదో మేలు చేద్దామనుకుంటే ప్రభుత్వాలు కుట్ర పన్ని తనను యిరికిస్తున్నాయని పోజు కొట్టాడు. అతని అభిమానులూ అలాగే ఫీలయ్యారు. సెటిల్మెంట్ త్వరలో జరగడం ఖాయం అని వాళ్లను నమ్మించాడు. 1935లో మళ్లీ సందేశాలు పంపాడు – 'ఒప్పందం పూర్తయి ఏ క్షణాన్నయినా డబ్బు వచ్చి పడవచ్చు. వచ్చాక మీ అందరూ జాగ్రత్తగా వుండాలి. డబ్బు కోసం మీ బంధువులే మిమ్మల్ని కిడ్నాప్ చేయవచ్చు' అంటూ. దీని తర్వాత డబ్బు యింకా వచ్చి పడింది. ఈ సారి మరీ గుట్టుగా పంపారు. అలా పంపినవారిలో ఒకతను చికాగోలో వున్న తన మేనల్లుడికి ఉత్తరం రాస్తూ 'నేను పంపిన డబ్బు కంపెనీ వాళ్లు నా ఖాతాలో సరిగ్గా జమ చేశారో లేదో కనుక్కో' అన్నాడు. అతను యీ కేసు విషయమంతా చదివి వున్నాడు కాబట్టి పోస్టు ఆఫీసు యిన్స్పెక్టర్ల వద్దకు వచ్చి సంగతి చెప్పాడు. వాళ్లు ఓ డిటెక్టివ్‌కు కేసు అప్పగించారు. అతను యీ మేనల్లుణ్ని నేనే అంటూ కంపెనీకి వెళ్లి ఖాతా చూపించమన్నాడు. ఆ ఆఫీసు నిర్వహిస్తున్న ఏజంటు 'రేపటితో కలక్షన్లు క్లోజ్ చేసేస్తున్నాం. ఆగస్టు నుంచి చెల్లింపులు మొదలవుతాయి.' అని చెప్పాడు. వెంటనే డిటెక్టివ్లు వచ్చి ఆఫీసు సిబ్బందిని అరెస్టు చేశారు. 70 వేల మంది ఖాతాదారుల పేర్లు బయటపడ్డాయి. దాదాపు 60 వేల డాలర్లు క్యాష్ దొరికింది.
తక్కిన ఆఫీసులపై కూడా దాడి చేశాక, ఫ్రాడ్ యొక్క రెండవ దశలో 5 లక్షల డాలర్లు పోగేశారని తేలింది. ఆస్కార్, మరో 41 మందిపై కేసులు మోపారు. అయితే బాధితులు తాము స్కీములో పెట్టుబడి పెట్టామని ఒప్పుకోలేదు. ఆస్కార్‌కు అప్పిచ్చామన్నారు. మరి కొందరు మా డబ్బు మా యిష్టం, మేం ఫిర్యాదు చేయనప్పుడు మీకెందుకు నొప్పి అని దబాయించారు. 1936 జనవరిలో కోర్టు తీర్పు వచ్చింది. నిందితుల్లో తక్కిన వాళ్లందరికీ ఏడాది శిక్ష పడింది. ఆస్కార్ విషయంలో మాత్రం అతనికి మతిస్థిమితం లేదని తేలింది. లేని ఆస్తి గురించి అందర్నీ ఏమార్చి ఏమార్చి చివరకు అతనే ఏమారిపోయాడు. తనకు ఎక్కణ్నుంచో ఐశ్వర్యం వచ్చిపడుతుందనే భ్రమలో వుండిపోయాడు. అతన్ని మానసిక రోగుల చెరసాలకు పంపారు. అక్కడే ఏడేళ్లు వుండి 1943లో చనిపోయాడు.
రేపెవరైనా మీ వద్దకు వచ్చి 'నాకు తెలిసున్నాయన నిజాం దూరపు బంధువు. నిజాం ఆయనకు బహుమతిగా గచ్చిబౌలిలో యిచ్చిన స్థలం కోర్టు తగాదాల్లో నలుగుతోంది. వకీలు ఫీజు యివ్వలేక ఆయన సతమతమవుతున్నాడు. మీరో లక్ష సర్దితే కేసు గెలిచాక పదిరూపాయల వడ్డీతో తిరిగి యిచ్చేస్తాడు' అని చెపితే ఎగాదిగా చూసి అతనికి యీ ఆస్కార్ కథ చెప్పండి.
(ఫోటో – సర్ ఫ్రాన్సిస్ డ్రేక్, ఆస్కార్ హార్ట్జెల్)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]