ఇంటివాడవుతున్నాడంటే పెళ్లి చేసుకుంటున్నాడని కాదు. ఇల్లు కొనుక్కుంటున్నాడని అర్థం. ఎవరో దారిన పొయ్యే దానయ్య కొనుక్కుంటే ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రిని తానేనని చెప్పుకుంటున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇల్లు కొనుక్కోబోతున్నారు. అదీ విశేషం.
రాష్ట్రం విడిపోయిన మూడేళ్లకు ఆయనకు ఈ ఆలోచన కలగడానికి కారణం అమరావతి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం పూర్తయిపోయి పనిచేస్తుండటంతోపాటు తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం పూర్తయి మార్చి 3 నుంచి బడ్జెటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి. ఈ సమావేశాలు దీర్ఘకాలం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాదులో ఉంటూ రోజూ వెళ్లి రాలేరు కదా. ఈ బడ్జెటు సమావేశాల తరువాత వర్షాకాల, శీతాకాల సమావేశాలుంటాయి. తాత్కాలికమే అయినా సచివాయం, అసెంబ్లీ నిర్మించుకున్నాక ఇక హైదరాబాదు ముఖం చూసే అవసరం ఉండదు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ హైదరాబాదులో కూర్చుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లోనూ ఇదే అభిప్రాయం ఉండొచ్చు. ఈ విమర్శలు వైకాపా నాయకులను బాధిస్తున్నాయి. ఈ విమర్శల ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని నాయకులు జగన్‌కు గట్టిగా చెప్పినట్లున్నారు. ఆయన ఓకే అనడంతో ఇల్లు వెతుకుతున్నారు. పర్మినెంట్ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కొనుగోలు చేయబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి ఈ పని పూర్తవుతుందని సమాచారం.
చంద్రబాబు మాదిరిగా కుటుంబం హైదరాబాదులో ఉండి ఆయన ఒక్కడు ఉంటాడేమో….! అక్కడ వ్యాపారాలను భార్య భారతి చూసుకుంటున్నారు కదా. ఇల్లు కొనుక్కోవడం బాగానే ఉందిగాని పార్టీ కార్యాలయం సంగతి ఏమిటి? ఏపీలో పార్టీ కార్యాలయం లేని విషయంపై కూడా విమర్శలొస్తున్నాయి. విభజన జరిగిన కొన్నాళ్లకే అన్ని పార్టీలూ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్క జగన్ పార్టీయే ఇప్పటివరకు మిగిలిపోయింది. ఆంధ్రాలో కార్యాలయం లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొంతకాలం క్రితం ఓ పత్రిక రాసింది.
వైఎస్సార్‌సీపీ సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం. ఆ రాష్ట్రంలో అధికార పార్టీని ఢీకొట్టగల సత్తా ఉన్న పార్టీ. 2019లో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ ప్రధాన కార్యక్షేత్రం ఏపీ అయినప్పుడు అక్కడ కార్యాలయం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ తాము హైదరాబాదుకు వచ్చిపోతుండటం, ఇక్కడిక్కడే తిరుగుతుండటం బాగాలేదని నాయకులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం భూమి ఇచ్చుంటే ఈపాటికి కార్యాలయం నిర్మించేవారేమో. కాని ప్రభుత్వ భూమిని జగన్ తిరస్కరించారు. ఎందుకు? మిత్రపక్షమైన బీజేపీకీ ఇచ్చినంత స్థలం కంటే పిసరు ఎక్కువగా వైకాపాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీలో వివిధ పార్టీలకున్న బలం ఆధారంగా స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో దిగువ సభలో ఉన్నవి మూడే పార్టీలు. అధికార టీడీపీ, మిత్రపక్షం బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం వైకాపా. ఈ లెక్కన చూస్తే మొదటిస్థానంలో టీడీపీ, రెండో స్థానంలో వైకాపా, మూడో స్థానంలో బీజేపీ ఉన్నాయి.
కాని చంద్రబాబు నాయుడుకు వైకాపా అంటే పడదు కదా. అందుకని బీజేపీని, వైకాపాను కొద్ది తేడాతో దాదాపు ఒకేలా ట్రీట్ చేశారు. ఇది పక్షపాతమని, అన్యాయమని ఎవ్వరైనా చెబుతారు. కాని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పక్షపాతం చూపితే ఎవరేం చేస్తారు? బాబు అన్యాయం చేయడంతో ఆగ్రహించిన జగన్ గుంటూరులో కార్యాలయం నిర్మిస్తారని గతంలో వార్తలొచ్చాయి. కార్యాలయం నిర్మించాల్సిన బాధ్యత అధినేతగా జగన్‌దే. పార్టీ నిధులతో ఈ పని చేయాలి. కాని ఆయన 'మీరే డబ్బులేసుకొని కట్టుకోండి' అన్నారట…! దీంతో ఎవరికి వారు గమ్మున ఉండిపోయారట…! ఇది ఎంతవరకు నిజమో తెలియదు.
ఆంధ్రాలో కార్యాలయం లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నారనేది వాస్తవమే. కార్యాలయం నిర్మించకపోతే పార్టీ నష్టపోతుందని అంటున్నారు. ఇల్లు కొనుక్కుంటున్న జగన్ త్వరలో కార్యాలయం నిర్మించుకుంటే అధికార పార్టీ విమర్శలకు అడ్డుకట్ట వేయొచ్చు.