ప్రపంచం ఓ కుగ్రామంగా తయారయ్యిందిప్పుడు. అంటే, అంత చిన్నదైపోయిందని అర్థం. ఇలా అమెరికా వెళ్ళి, అలా ఇండియాకి తిరిగొచ్చేస్తున్నారు. మన ఇండియన్లకీ అమెరికాతో 'సంబంధం' మరింత దృఢమైపోయింది. అమెరికాలో చీమ చిటుక్కుమంటే చాలు, భారతదేశం ఉలిక్కిపడ్తోంది.
'ఫలానా ఊళ్ళో కుర్రాడు అమెరికా వెళ్ళొచ్చాడట..' అనే రోజులు పోయి, 'మా చుట్టాలబ్బాయ్ అమెరికాలోనే వున్నాడు..' అనేదాకా వచ్చింది పరిస్థితి. ఇంజనీరింగ్ పూర్తయితే చాలు, అమెరికా చెక్కేద్దామనే ఆలోచనలో చాలామంది వుంటున్నారు. అలా అలా అమెరికా వెళుతున్నవారి సంఖ్య, అక్కడ స్థిరపడుతున్నవారి సంఖ్య, సంపాదించి తిరిగొచ్చేస్తున్నవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అమెరికాలో ఒక్క ఇండియన్లే కాదు, చాలా దేశాలకు చెందినవారుంటున్నారు.
కానీ, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడక్కడి పరిస్థితులు మారిపోయాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక, 'అమెరికా అమెరికన్లది మాత్రమే..' అన్న భావన అక్కడివారిలో పెరిగిపోయింది. అక్కడే దశాబ్దాలుగా స్థిరపడిపోయిన వారు సైతం ఇప్పుడు ఆందోళన చెందాల్సిన దుస్థితి దాపురించింది. ఒక్కసారి 'విద్వేష బీజం' పడ్డాక, ఇక దాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. ఆఖరికి, ట్రంప్ వల్ల కూడా కాదు.
శ్రీనివాస్ కూచిబొట్లపై 'జాత్యహంకార' దాడి అనంతరం, అమెరికాలోని తెలుగువారు గడగడలాడిపోవాల్సి వస్తోంది. ఏ క్షణాన పరిస్థితులు ఎలా మారిపోతాయో ఎవరికీ తెలియడంలేదిప్పుడు. 'అంత పెద్ద అమెరికాలో ఇది చాలా చిన్న ఘటన..' అని ఎవరూ అనుకోవడంలేదు. ఎందుకంటే, అక్కడ 'హత్య' జరిగిన తీరు అత్యంత హేయం. 'విద్వేషం' కారణంగా సంభవించిన మరణమది. ఆ విద్వేషం కూడా, 'మా దేశంలో మీకేం పని.?' అనే ప్రశ్న రూపంలో వచ్చింది.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, అమెరికా 'తెల్ల కావరం'పై ఆవేదన వ్యక్తం చేశారు. 'మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మత విద్వేషాలకు తావు లేదు..' అంటూ ఆయన మండిపడ్డారు. ఇంకా చాలా చాలామంది అమెరికాలో 'విద్వేష దాడుల'పై గళం విప్పుతున్నారు. ఇంతలా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ, 'వైట్ హౌస్' స్పందించింది. శ్రీనివాస్ కూచిబొట్ల హత్య దురదృష్టకరమనీ, ఆ హత్యకీ ట్రంప్ విధానాలకీ సంబంధం లేదని తేల్చేసింది.
కానీ, అక్కడ విద్వేష బీజం నాటింది డోనాల్డ్ ట్రంప్ అన్నది నిర్వివాదాంశం. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే.. అంటూ ఎన్నికల్లో గెలుపు కోసం ట్రంప్ పబ్లిసిటీ స్టంట్ చేసి వుండొచ్చుగాక. కానీ, ఆ తర్వాత ఆయన తీరు ఇంకా దారుణంగా తయారైంది. 'నేను అమెరికా అధ్యక్షుడిని.. అమెరికన్లకు మాత్రమే అధ్యక్షుడిని..' అంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలతో 'విద్వేషం' పతాక స్థాయికి చేరింది.
ఏమో, ముందు ముందు అమెరికాలో ఇంకెలాంటి వైపరీత్యాలు జరుగుతాయోగానీ, ప్రస్తుతానికైతే భారతదేశం బెంబేలెత్తిపోతోంది.. తెలుగు రాష్ట్రాలు గడగడలాడిపోతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల పరిస్తితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.