ఖాన్ తో గేమ్స్ ఆడొచ్చో లేదో కానీ, తిరుపతి వెంకన్నతో మాత్రం గేమ్స్ ఆడకూడదు. గోవిందా గోవిందాం అంటూ ఆయనపై సినిమా తీయబోతే..ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అన్నమయ్య సినిమా స్క్రిప్ట్ ఆత్రేయ నుంచి జంధ్యాల మీదుగా ఎందరు విఫలయత్నాలకు కారణమైందో కూడా తెలిసిందే. అన్నమయ్య హిట్ అయినా, ఆ బ్యానరే మాయమైంది. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ విషయమై కూడా ఓ గుసగుస వినిపిస్తోంది. ఆ సినిమా మరీ డిజాస్టర్ కావడానికి, ఎందుకిలా జరిగిందన్నది అంచనాలకు, లాజిక్ లకు అందకపోవడానికి కారణం, ఆ సినిమా టైటిల్ నే అని అంటున్నారు కొందరు పండితులు. వెంకటేశ్వర స్వామి పేరు శ్రీ వెంకటేశ్వరుడు అనే తప్ప, ఒట్టి వెంకటేశ్వరుడు అని రాయకూడదంట..
శ్రీ అంటే లక్ష్మి. ఆమె కోసమే విష్ణుమూర్తి భూలోకంలోకి వచ్చి, శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిసాడట. శ్రీ లేని వెంకన్న లేడని, ఆ శ్రీ వల్లే తిరుపతి వెంకన్న ఆలయం ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ధనిక ఆలయాల్లో ఒకటి అయిందంట. అలాంటిది ఆయన సినిమాకు శ్రీ లేకుండా ఓం నమో వెంకటేశాయ అని పెట్టడమే తప్పు అని ఓ పండితుడు అంటున్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ అని పెట్టి వుంటే వేరేగా వుండేదంటున్నారు.
గతంలో శ్రీనువైట్ల కూడా నమో వెంకటేశ అని టైటిల్ పెట్టి ఓ సినిమా తీసి బోల్తా కొట్టారు. ఈ సూచనలు, గుసగుసలు ముందుగా వినిపించి వుంటే నాగ్ నో, రాఘవేంద్రరావునో పట్టించుకునేవారేమో? ఇప్పుడు వినిపించి లాభమేముంది?
కృష్ణ వంశీ ఇన్సిడెంట్
దర్శకుడు కృష్ణ వంశీకి శ్రీవారితో చేదు అనుభవం వుందని ఓ సినిమా మనిషి చెప్పారు. గతంలో ఓసారి ఆయన తన టైమ్ ఎందుకో బాగాలేదనిపించి, ఓ గురువుగారికి దగ్గరకు వెళ్లాడట. ఆయన అన్నీ పరిశీలించి, అన్నీ బాగానే వున్నాయి కానీ, నువ్వు తిరుపతి శ్రీవెంకటేశ్వరుడిని ఏమన్నా కెలికావా? అని అడిగాడట. అబ్బే అలాంటిదేమీ లేదు..నేను ఆయన పరమ భక్తుడిని అన్నాడట కృష్ణవంశీ. అలా అనేసి వచ్చేసాక గుర్తుకు వచ్చిందట..తన సినిమాలో గోవింద..గోవింద అంటూ తిరుపతిపై పాట పెట్టిన సంగతి. ఏడుకొండలు ఏసి చేయిస్తా, అంటూ ఎకెసెక్కాలాడిన సంగతి. అప్పుడు లెంపలేసుకుని మరేం చేసారో మాత్రం ఆ సినిమా మనిషి చెప్పలేదనుకోండి..
మొత్తానికి తిరుపతి దేవుడితో గేమ్స్ పనికిరావన్నమాట.