చూస్తూ వుంటే స్టార్ హీరోలు కొత్త బాట పడుతున్నట్లుంది. తమపై వస్తున్న నిర్మాతల ఒత్తిడి, మొగమాటాలు తట్టుకునేందుకు, మరో పక్క పెరుగుతున్న టాలీవుడ్ సినిమా స్టామినాను దృష్టిలో వుంచుకుని, ఈ కొత్త బాట ఎంచుకున్నట్లుంది. హీరోల ఇమేజ్, క్రౌడ్ పుల్లింగ్ పెరిగిన కొద్దీ నిర్మాతల నుంచి హీరోలకు వత్తిడి పెరగడం కామన్. మాకు సినిమా చేయండంటే, మాకు సినిమా చేయమని, కానీ మహా అయితే ఏడాదికి రెండు కన్నా ఎక్కువ సినిమాలు చేసే పరిస్థితుల్లో లేరు బడా హీరోలు. అందుకే ఒకే సినిమాను ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు చేయాలనుకుంటున్నారు.
మహేష్ బాబు ఇప్పటికే దిల్ రాజు, అశ్వనీదత్ కు కలిపి ఓ సినిమా చేస్తున్నా అని చెప్పేసాడు. ఎలాగూ వందకోట్ల రేంజ్ కు చేరిపోయాయి తెలుగు సినిమాలు. అందువల్ల ఇద్దరు నిర్మాతలున్నా సమస్య లేదు. అయితే స్టయిలిష్ స్టార్ బన్నీ మరో అడుగు ముందుకు వేసి ముగ్గురు నిర్మాతలకు కలిపి ఓ సినిమా చేస్తున్నాడట. కథకుడు వక్కంతం వంశీ తొలిసారి డైరక్ట్ చేస్తున్న సినిమాకు ముగ్గురు నిర్మాతలట. లగడపాటిశ్రీధర్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది. ఆయనతో పాటు మరో ఇద్దరు కోప్రొడ్యూసర్లుగా వుంటారు. ఒకరు నాగబాబు మరొకరు బన్నీ వాసు.
ఆరెంజ్ సినిమాతో దెబ్బతిన్న నాగబాబును ఆదుకోవాలని ఎప్పటి నుంచో బన్నీ అనుకుంటున్నాడట. అదే విషయం లగడపాటికి చెప్పాడట. దాంతో లగడపాటి, మీరెలా చేద్దాం అంటే అలాగే చేద్దాం అనేయడంతో, ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా, సినిమాకు సమర్పకుడిగా పెడుతున్నారు. నాగబాబు పెట్టుబడి ఏమీ పెట్టరు కానీ, రాయల్టీరూపంలో కొత్త లాభం ఇస్తారని తెలుస్తోంది. ఇది కేవలం బన్నీకి ఎప్పటి నుంచో నాగబాబు మీద వున్న అభిమానంతోనే అని వినికిడి.
ఇక గీతా ఆర్ట్స్ వ్యవహారాలు అన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టే బన్నీ వాసు కూడా మూడోప్రొడ్యూసర్ గా వుంటారు. అంటే బన్నీ తరపున ప్రొడక్షన్ అంతా పెర్ ఫెక్ట్ గా జరుగుతోందో లేదూ చూసుకోవడానికి అన్నమాట. ఇలా మొత్తం మీద బన్నీ సినిమాకు ముగ్గురు ప్రోడ్యూసర్లు అన్నమాట.