రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళడం, అలా నింగిలోకి దూసుకెళ్ళిన కొద్ది క్షణాల్లోనే అది మాయమవడం.. ఈ అద్భుతాన్ని చూసేందుకు టీవీలకు అతుక్కుపోతుంటాం. వీలైతే, స్వయంగా రాకెట్ ప్రయోగ కేంద్రం దగ్గరకు వెళ్ళాలనుకుంటాం. ఆ అద్భుతాన్ని చూడాలన్న ఆసక్తి అలాంటిది.
ప్రయోగించిన కొద్ది క్షణాల్లోనే రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్ళి, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం, రాకెట్ నుంచి శాటిలైట్లు విడిపోవడం.. ఇదంతా ఓ అద్భుతమైన ప్రక్రియ. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 104 శాటిలైట్లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' నిన్న పిఎస్‌ఎల్‌వి సి-37 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. ఇస్రో సాధించిన ఈ ఘనతను ప్రపంచమంతా కీర్తించింది. తాజాగా, ఈ మొత్తం అద్భుతాన్ని చిత్రీకరించి.. తాను సాధించిన ఘనతను ప్రపంచం ముందుంచింది ఇ్రసో. రాకెట్లోని పలు భాగాల్లో కెమెరాలను అమర్చారు. ఆ కెమెరాల నుంచి వీడియోలను సేకరించి, ఆ మహాద్భుత ప్రక్రియను ప్రపంచానికి చూపించారు మన శాస్త్రవేత్తలు.
రాకెట్ లిఫ్ట్ ఆఫ్ నుంచి, శాటిలైట్లు విడిపోయేదాకా.. మొత్తం ప్రకియ ఈ వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, పది, పాతిక, యాభై, వంద, నూట నాలుగు.. ఇలా అన్ని శాటిలైట్లు ఒకదాని తర్వాత ఒకటి, నిర్దేశిత కక్ష్యల్లోకి రాకెట్ నుంచి విడిపోతోంటే.. అహో ఏమి అద్భుతమని ఆశ్చర్యపోకుండా వుండలేం. ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగలేదు. చిన్న చిన్న చీమల్లా శాటిలైట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఓ పద్ధతి ప్రకారం విడిపోయాయి.
ఒక్క రాకెట్ ద్వారా ఇన్ని ఉపగ్రహాల్ని నింగిలోకి పంపడమా.? ప్రపంచంలో ఏ దేశమూ ఇంతవరకు ఈ ఘనతను సాధించలేకపోయింది. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ కన్నా ఎంతో ముందున్న దేశాలు సైతం ఈ సాహసం చేయలేకపోయాయి. సాహసించడం ఓ ఎత్తు, ఆ సాహసం ద్వారా విజయాన్ని అందుకోవడం మరో ఎత్తు. మన దేశ అవసరాల కోసం ప్రారంభమైన ఇస్రో ప్రయోగాల పరంపర, వాణిజ్య ప్రయోగాల దాకా విస్తరించింది. ఇప్పుడు ప్రపంచంలోనే మేటి అంతరిక్ష ప్రయోగాల సంస్థగా ఇస్రో అవతరించిందంటే ప్రతి ఒక్క భారతీయుడూ గర్వించదగ్గ సందర్భమిది.