పివిపి సంస్థకు బ్రహ్మోత్సవం తరువాత ఓ సినిమా చేయాల్సిన అగ్రిమెంట్ సూపర్ స్టార్ మహేష్ కు వుంది. అయినా కూడా తెరవెనుక అనేక రాజకీయాలు నడిచేసాయి. ఆఖరికి పివిపిని పక్కన పెట్టి, దిల్ రాజు-అశ్వనీదత్ లను తెరపైకి తెచ్చి, సినిమా ప్రకటించేసారు. పైగా మహేష్ నే తన రాబోయే సినిమాలు ఇవీ అంటూ క్లారిటీగా ప్రకటించేసాడు. దాంతో పివిపి కాస్తా వంశీపైడిపల్లి స్క్రిప్ట్ పై హక్కులు తనవంటూ స్టే తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఈ సమస్య అలా పడి వుంది. ఇది రిజాల్వ్ అయితే తప్ప ఆ సినిమా స్టార్ట్ కాదు. కానీ మహేష్ కు అర్జెంట్ ఏమీ లేదు. ఎందుకంటే కొరటాల శివ సినిమా లైన్ లో వుంది. అయితే నిర్మాత దిల్ రాజుకు, డైరక్టర్ వంశీ పైడిపల్లికి మాత్రం అవసరం. అందుకే వారు రాజీ మార్గానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఏదో ఒక పాయింట్ దగ్గర రాజీ ఫార్ములా సెట్ చేద్దామని వారు భావిస్తున్నట్లు వినికిడి.
అయితే సమస్య పివిపి డిమాండ్ తోనే వుంది. ఆయన తన స్క్రిప్ట్ కు కాంపన్సేషన్ అడిగితే పెద్ద సమస్య కాదు. కానీ పివిపి తన బ్యానర్ కచ్చితంగా ఏడ్ కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రం దిల్ రాజు కోర్టులో తేలే వ్యవహారం కాదు. మహేష్ ఓకె అనాల్సిన సంగతి. మరి మహేష్ ఓకె అంటారా? లేదా? తన సినిమా మీద స్టే తెస్తారా? అని ప్రెస్టీజ్ కు పోయి, మరో స్క్రిప్ట్ కోసం చూస్తారా? చూడాలి.