పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టుగా…!

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రితో ఆ పార్టీకి లాభ‌మా? న‌ష్ట‌మా? అనే చ‌ర్చకు తెర‌లేచింది. సియ్య‌లు తింటున్నామ‌ని మెడ‌లో ఎముక‌లు వేసుకున్న చందంగా… పురందేశ్వ‌రి రాజ‌కీయ పంథా ఉంద‌నే విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి.…

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రితో ఆ పార్టీకి లాభ‌మా? న‌ష్ట‌మా? అనే చ‌ర్చకు తెర‌లేచింది. సియ్య‌లు తింటున్నామ‌ని మెడ‌లో ఎముక‌లు వేసుకున్న చందంగా… పురందేశ్వ‌రి రాజ‌కీయ పంథా ఉంద‌నే విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి. ఏపీలో బీజేపీని బ‌ల‌ప‌ర‌చాల‌ని పురందేశ్వ‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే, త‌న తండ్రి స్థాపించిన టీడీపీని అధికారంలోకి తీసుకురావాల‌ని ఆమె త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే సంకేతాల్ని ఆమె ఇస్తున్నారు.

ఏపీలో జ‌న‌సేన‌తో క‌లిసి ప్ర‌యాణిస్తామ‌ని ఆమె అంటున్నారు. టీడీపీతో పొత్తు విష‌య‌మై జాతీయ నాయ‌క‌త్వం చూసుకుంటుంద‌ని ఆమె చెబుతున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. ఏపీలో మూడో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా బీజేపీ-జ‌న‌సేన ఎద‌గాలంటే, ఇప్పుడు అనుస‌రిస్తున్న పంథాతో సాధ్యం కాద‌నే మాట వినిపిస్తోంది. కేవ‌లం వైసీపీనే పురందేశ్వ‌రి టార్గెట్ చేస్తున్నార‌నే బ‌ల‌మైన అభిప్రాయం జ‌నంలో క‌లిగింది.

వైసీపీని టార్గెట్ చేయ‌డం వ‌ల్ల బీజేపీకి వ‌చ్చే లాభం శూన్యం. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్‌… బీజేపీకి బ‌ద్ధ వ్య‌తిరేక‌మైంది. అలాంట‌ప్పుడు వైసీపీని బ‌ల‌హీన‌ప‌రిచినా ఇత‌ర పార్టీల వైపు చూస్తారే త‌ప్ప‌, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీకి ద‌గ్గ‌ర కారు. టీడీపీని బ‌ల‌హీనం చేయ‌డం వ‌ల్ల బీజేపీకి రాజ‌కీయంగా లాభం వుంటుంది. 

టీడీపీపై ఈగ వాల‌నివ్వ‌డానికి పురందేశ్వ‌రి సిద్ధంగా లేరు. ఏపీలో ఎటూ త‌మ పార్టీ బ‌ల‌హీనంగా వుందని, అది ఇప్ప‌ట్లో అధికారంలోకి వ‌చ్చేది లేదు, చ‌చ్చేది లేద‌ని పురందేశ్వ‌రి భావ‌న‌. అలాంట‌ప్పుడు బీజేపీ కోసం టీడీపీని బ‌ల‌హీన ప‌రిస్తే ఎలా అని పురందేశ్వ‌రి అనుకుంటున్నారేమో అని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.

పురందేశ్వ‌రి రాజ‌కీయ పంథా ఇదే అయితే ఏపీలో బీజేపీ ఎప్ప‌టికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. ఎందుకంటే ఏపీ బీజేపీ ర‌థ‌సార‌థే ఆ పార్టీ ఎదుగుద‌ల‌కు అడ్డంకి కాబ‌ట్టి. గ‌త రెండు మూడురోజులుగా వైసీపీ నేత‌లంతా పురందేశ్వ‌రి కేంద్రంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బీజేపీలోని టీడీపీ అనుకూల నేత‌లంతా… త‌మ అంద‌రి ప‌ని పురందేశ్వ‌రి ఒక్క‌రే చేస్తున్నార‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. మ‌రోవైపు పురందేశ్వ‌రి నియామ‌కంతో త‌మ పార్టీ ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టుగా త‌యారైంద‌ని బీజేపీ నేత‌లు వాపోతున్నారు.