ఇంట‌ర్ క్యాస్ట్ సెంటిమెంట్.. ఇంకో స‌క్సెస్?

అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రం ప‌ఠిస్తోంది. ఇప్ప‌టికే రెండు ఎంపీ సీట్ల‌నూ బీసీల‌కు కేటాయించి స‌క్సెస్ అయిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ప్రాధాన్య‌త‌ను కొన‌సాగించ‌డానికి ఫిక్స‌య్యింది.…

అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రం ప‌ఠిస్తోంది. ఇప్ప‌టికే రెండు ఎంపీ సీట్ల‌నూ బీసీల‌కు కేటాయించి స‌క్సెస్ అయిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ప్రాధాన్య‌త‌ను కొన‌సాగించ‌డానికి ఫిక్స‌య్యింది. అంతే కాదు వీలైన చోట మ‌రింత‌గా బీసీల‌కు ప్రాధాన్య‌త‌ను పెంచుతోంది. 

ఇందులో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే సీటును కూడా బీసీల‌కే కేటాయించ‌డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయిన‌ట్టుగా ఉంది. ఇప్ప‌టికే అక్క‌డ దీపిక‌ను ఇన్ చార్జిగా ప్ర‌క‌టించారు. నెగ్గుకురాలేక‌పోయిన ఇక్బాల్ స్థానంలో దీపిక‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా ప్ర‌క‌టించింది. ఆమె బీసీ- కురుబ‌. హిందూపురం ప‌రిస‌ర ప్రాంతాల్లో కురుబ‌ల జ‌నాభా గ‌ట్టిగానే ఉంటుంది.

ముందుగా ఇక్క‌డ ఇదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన న‌వీన్ నిశ్చ‌ల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా పెట్టింది. పోటీ కూడా చేయించింది. అయితే ఆయ‌న నెగ్గ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత ఇక్బాల్ తెర‌పైకి రాగా, న‌వీన్ నిశ్చ‌ల్ వ‌ర్గం స‌హ‌జంగానే స‌పోర్ట్ చేసి ఉండ‌క‌పోవ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు నామినేటెడ్ పోస్టునైతే ఇచ్చారు. 

ఇప్పుడు కురుబ సామాజిక‌వ‌ర్గానికి చెందిన దీపిక‌కు న‌వీన్ వ‌ర్గం ఏ మేర‌కు స‌హ‌క‌రిస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఇక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌మ స‌క్సెస్ ఫార్ములాను అమ‌ల్లో పెడుతోంది! హిందూపురం ప్రాంతంలో రెడ్ల ఓట్ల‌కు ఏమీ లోటు లేదు. ఈ నేప‌థ్యంలో కురుబ మ‌హిళ‌ను అభ్య‌ర్థిగా పెట్టినా.. ఆమె భ‌ర్త రెడ్డి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ త‌ర‌హాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌క్సెస్ ల‌ను రుచి చూసింది.

శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి, క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్ విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క‌లిసి వ‌చ్చింది. జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి ఎస్సీ-మాల కాగా, ఆమె భ‌ర్త ఆలూరి సాంబ‌శివారెడ్డి. ఇక ఉష‌శ్రీ చ‌ర‌ణ్ బీసీ-కురుబ కాగా, ఆమె భ‌ర్త రెడ్డి. ఇలా కులాంత‌ర వివాహ ఆద‌ర్శంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మారారు. ఇప్పుడు దీపిక విష‌యంలో కూడా ఇదే క‌థ‌. ఆమె కురుబ అయినా, ఆమె భ‌ర్త వేణుగోపాల్ రెడ్డి. అయితే వ్య‌క్తిగ‌తంగా వీరికి నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద గుర్తింపు లేదు.

అయితే హిందూపురం విష‌యంలో ఎవ‌రికి ప్రాధాన్య‌త‌ను ఇచ్చినా మ‌రొక‌రు స‌హాయ నిరాక‌ర‌ణ చేసే ప‌ద్ధ‌తి కొన‌సాగుతూ ఉంది. అందుకే గత ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గాలి గ‌ట్టిగా వీచినా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గ‌లేక‌పోయింది. పార్టీలో గ్రూపులు ఎక్కువైపోయి ర‌చ్చ‌లు జ‌ర‌గ‌డ‌మే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గ‌లేక‌పోతోంది.  

గ‌తంలో హిందూపురం ఎమ్మెల్యే సీటును నెగ్గుకురావ‌డం కాంగ్రెస్ కు కూడా తేలిక‌య్యేదేమీ కాదు. ద‌శాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ వ‌ర‌స పెట్టి విజ‌యాల‌ను సాధిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతోనే గ‌ట్టి పునాదిని వేసుకుంది కానీ, విజ‌యం మాత్రం ఇంకా అంద‌నిదిగానే ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో ఇక్బాల్ ను పూర్తిగా నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి, గ్రూపు  రాజ‌కీయాల‌ను కాస్త త‌గ్గించే వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్న‌ట్టుగా ఉంది.