సినిమా రివ్యూ: ఓం నమో వెంకటేశాయ

రివ్యూ: ఓం నమో వెంకటేశాయ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.  తారాగణం: అక్కినేని నాగార్జున, అనుష్క, సౌరభ్‌ జైన్‌, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, రావు రమేష్‌, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌రాజ్‌, విమలా…

రివ్యూ: ఓం నమో వెంకటేశాయ
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. 
తారాగణం: అక్కినేని నాగార్జున, అనుష్క, సౌరభ్‌ జైన్‌, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, రావు రమేష్‌, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌రాజ్‌, విమలా రామన్‌ తదితరులు
రచన: జె.కె. భారవి
కూర్పు: గౌతరరాజు
సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి
ఛాయాగ్రహణం: యస్‌. గోపాల్‌రెడ్డి
నిర్మాత: ఎ. మహేష్‌రెడ్డి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2017

పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య కథతో సినిమా తీసేసిన తర్వాత, అంతగా తెలియని మరో వెంకటేశ్వరస్వామి మహాభక్తుడు హాథిరాం బాబాజీ గురించి సినిమా అంటే 'ఇందులో కొత్తగా ఏముంటుంది?' అనే భావనే కలిగింది. ఈ సినిమా ఐడియాని నాగార్జున ముందు ఉంచినప్పుడు ఆయన ఫస్ట్‌ రియాక్షన్‌ కూడా ఇదేనట. వెంకటేశ్వరస్వామి భక్తుడి గురించి ఇంకో సినిమా అవసరమా? అని. అయితే భారవి, రాఘవేంద్రరావుల ధృఢ నిశ్చయం చూసి నాగార్జున 'ఓం నమో వెంకటేశాయ'కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసారు. 'అన్నమయ్య' అంటే వెంకటేశ్వరునిపై ముప్పయ్‌ రెండు వేల కీర్తనలు రాసాడన్న సంగతి బహుళ ప్రాచుర్యం పొందింది కానీ, ఈ హాథిరామ్‌ ఎవరనేది చాలా మందికి తెలియదు. 

తిరుమలలో శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు అంతా క్రమబద్ధంగా జరగడానికి, తిరుమలకి వెళ్లిన భక్తులు ఎటునుంచి ఎటుగా వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయనేది ప్రజలకి అర్థమయ్యేలా తెలియజెప్పింది, తిరుమలలో స్వామివారికి నిత్యకళ్యాణం జరిపించడానికి నాంది పలికిందీ, నవనీత హారతి వంటి వాటిని ప్రవేశ పెట్టిందీ హాథీరామ్‌ అనే సంగతి ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. బాలుడిగానే దైవాన్ని అన్వేషిస్తూ వెళ్లిన రామ తర్వాత తిరుమలకి ఎలా చేరుకున్నదీ, ఏ విధంగా హాథిరామ్‌ అనే పేరు తెచ్చుకున్నదీ, అనంతరం బాబాజీగా ఎలా ప్రసిద్ధికెక్కిందీ, సజీవ సమాధి కావడానికి సంకల్పించుకోవడానికి గల కారణాలేంటి అన్నీ ఇందులో నిశితంగా తెలియజెప్తారు. 

ఇదంతా చదువుతుంటే ఇది హాథిరామ్‌ బాబాజీ గురించి డాక్యుమెంటరీ అనే భావన కలగవచ్చు. అచ్చంగా ఆయన కథనే పట్టుకుని సినిమా తీసేసినట్టయితే అది డాక్యుమెంటరీలానే రూపం తీసుకునేదేమో. కానీ ఈ కథని కమర్షియల్‌గా చెప్పడంలోనే రాఘవేంద్రరావు గొప్పతనం తెలుస్తుంది. ఏ క్షణంలోను ఇది ఒక డాక్యుమెంటరీలానో, కల్పిత కథలానో అనిపించదు సరికదా, నిజంగానే హాథిరామ్‌తో ఆ 'బాలాజీ' (వెంకటేశునికి ఈ పేరు పెట్టింది కూడా హాథిరామ్‌ బాబానే అని ఉటంకించారు) పాచికలు ఆడాడా, ఆడి తన నగలన్నీ ఓడిపోయాడా అనిపిస్తుంది. రచయిత భారవి అంత నమ్మశక్యంగా సన్నివేశాలు రాసుకుంటే, వాటిని రాఘవేంద్రరావు తన శత చిత్ర అనుభవంతో కనుల విందుగా తెరకెక్కించారు. అన్నమయ్య, రామదాసులతో కూడా డ్యూయెట్లు పాడించిన రాఘవేంద్రరావు ఆ విషయంలో హాథిరామ్‌ని కూడా తగ్గనివ్వలేదు. నిత్యం దైవ స్మరణే తప్ప మరో ఆలోచన కూడా లేని హాథిరామ్‌తో కూడా మరదలి (ప్రగ్య) అందాలని వర్ణిస్తూ పాట పాడించారు. పరమ భక్తురాలయిన కృష్ణమ్మకి (అనుష్క) కూడా గ్లామర్‌ పాట తప్పించుకునే వీలు ఇవ్వలేదు. జగపతిబాబు డ్రీమ్‌ సాంగ్‌లో కృష్ణమ్మ సైతం పరవశంతో చిందులేయక తప్పింది కాదు. 

అంతగా పరిచయం లేని కథ కావడంతో హాథిరామ్‌ కథ తెలుసుకునేందుకు ఆసక్తికరంగానే అనిపిస్తుంది. తిరుమలలో గాడి తప్పిన స్వామి వారి పరిచర్యలు, అక్కడ పెరిగిపోయిన వ్యాపార ధోరణి, లాభాపేక్ష అన్నిటినీ సరి చేసి, నిత్యాన్నదానంతో పాటు తిరుమలలో ప్రతి దానినీ క్రమబద్ధీకరణ గావించింది హాథిరామ్‌ అనే విషయాలు తెలిసినపుడు ఆయనపై గౌరవభావం పెరుగుతుంది. అలాగే తిరుమలలో వెంకటేశుడు ఎందుకు వెలిసాడో, తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే ముందు వరాహ మూర్తిని ఎందుకు సందర్శించుకోవాలో వగైరా విశేషాలు కూడా ఈ కథలో భాగం చేసారు. 

భగవంతుడు, భక్తుడు మధ్య సన్నివేశాలన్నీ హత్తుకునే విధంగా తెరకెక్కించారు. సతులతో స్వామి వారి ముచ్చట్లు, హాథిరామ్‌కి ఎదురయ్యే పరీక్షలు అన్నీ ఆకట్టుకుంటాయి, ఆహ్లాదం కలిగిస్తాయి. వినోదానికి లోటు లేకుండా ఈ చిత్రాన్ని తీయడంలోనే దర్శకేంద్రుని అనుభవ సారం తెలుస్తుంది. అయితే అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లోని కట్టిపడేసే డ్రామా ఈ కథలో మిస్‌ అయింది. ప్రధానంగా కథలో చివరి ఘట్టం అంత ఆసక్తికరంగా లేకపోవడంతో 'హై' ఇచ్చే పతాక సన్నివేశానికి అవకాశం లేకపోయింది. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లోని ఆఖరి ఘట్టాలతో పోలిస్తే ఇది తేలిపోతుంది. ఎమోషనల్‌ కనక్ట్‌ ఏర్పరిచే విషయంపై దర్శకుడు శ్రద్ధ పెట్టకపోవడంతో హాథిరామ్‌ ముగింపు కదిలించలేకపోతుంది. పూర్తిగా వాస్తవాలతో తీసిన సినిమా ఎలాగో కాదు కాబట్టి, కల్పిత ఘటనలతోనే రాసుకున్నది కాబట్టి చివరి ఘట్టాల్లో కాస్త డ్రామా జోడించాల్సింది. హాథిరామ్‌ని చరసాలలో పెట్టడం లాంటి సన్నివేశాలున్నా అవేమంత ఎఫెక్టివ్‌గా లేవు. 

కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ఊపిరిగా నిలిచింది. నేపథ్య సంగీతంతోనే చాలా సన్నివేశాలు మరో స్థాయికి వెళ్లాయి. 'అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకా', 'ఓం నమో వెంకటేశాయ', 'కోటి కోటి దండాలయ్యా' పాటలు బాగున్నాయి. అయితే అన్నమయ్య, శ్రీరామదాసు పాటల స్థాయిలో 'ఓం నమో వెంకటేశాయ' పాటలు  ఆకట్టుకోవు. అప్పటికే పాపులర్‌ అయిన పాటలని కీరవాణి తన సంగీతంతో మరింత చిరస్మరణీయం చేసారన్న మాట వాస్తవమే కానీ, ఖచ్చితంగా అన్నమయ్య, శ్రీరామదాసుతో పోలిక వస్తుంది కనుక ఈ పాటల పరంగా ఇంకా కేర్‌ తీసుకుని వుండాల్సింది. అన్నమయ్య, రామదాసుల్లో పాటలతోనే గూస్‌బంప్స్‌ వస్తాయి. ఈ పాటలు వినడానికి బాగున్నా అంతటి ప్రభావం అయితే లేదు. ఛాయాగ్రహణం, ప్రొడక్షన్‌ డిజైన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ చక్కగా కుదిరాయి. సినిమా నిడివి పెరగకుండా, విసుగు పుట్టించని వేగంతో ఎడిటర్‌ పర్‌ఫెక్ట్‌గా కట్‌ చేసారు. 

భక్తుని పాత్ర చేయాలంటే నాగార్జునే అనే విధంగా మరోసారి ఈ పాత్రలో నాగార్జున జీవించారు. నిన్నే పెళ్లాడతాలో శీను నుంచి అన్నమయ్యగా, ఇప్పుడు సోగ్గాడు బంగార్రాజు నుంచి హాథిరామ్‌ బాబాగా నాగార్జున ట్రాన్స్‌ఫర్మేషన్‌కి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే. పతాక సన్నివేశాల్లో తన కళ్లల్లో చూపించిన ఆర్ధ్రతకి మరిన్ని అవార్డులు వచ్చి పడిపోవడం ఖాయం. ఇతర నటీనటులంతా తమ వంతు సహకారం అందించారు. మరీ ముఖ్యంగా శ్రీనివాసునిగా సౌరభ్‌ జైన్‌ దైవత్వం తొణికిసలాడే చిద్విలాసంతో ఆకట్టుకున్నాడు. 

చాలా క్లిష్టమైన కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ, ఎక్కడా విసిగించని కథనంతో ఈ చిత్రాన్ని నడిపించిన విధానం అమితంగా ఆకట్టుకుంటుంది. అన్నమయ్య, రామదాసుతో పోల్చలేనప్పటికీ 'ఓం నమో వెంకటేశాయ' కూడా మరో గుర్తుండిపోయే భక్తిరస చిత్రంగా నిలుస్తుంది. భక్తిరస చిత్రాలని ఇష్టపడేవారిని, ప్రత్యేకించి బాలాజీ భక్తులని ఈ చిత్రం బాగా అలరిస్తుంది. 

బాటమ్‌ లైన్‌: భక్త కోటిని మెప్పించే చిత్రం!

గణేష్‌ రావూరి