ఎన్టీయార్ వర్ధంతి గత వారంలో జరిగింది. ఎప్పటిలాగ సమాధి వద్ద నివాళులు, టీవీలో కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఎన్టీయార్ పేర ఎన్నో పథకాలు అవతరిస్తున్నాయి. ఊరూరా విగ్రహాలు వెలిశాయి. మాట్లాడితే ఎన్టీయార్ నామజపం చేస్తున్నారు. ఆయన వంశానికి చెందినవారమని, ఆయన అనుయాయులమని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ దురదృష్టమేమిటంటే యివేవీ ఎన్టీయార్ చూడలేదు (అది సహజం) సరి కదా, యిలా జరుగుతుందని వూహించే పరిస్థితి కూడా లేని దుర్భరపరిస్థితిలో ఆయన పోయాడు. పరాజిత పరాభవం చేత చెదిరిన దర్పంతో, సంతానం చేత, ఆత్మీయుల చేత, అనుయాయుల చేత పరిత్యక్తుడై, ప్రజల ఉదాసీనతకు గురై, కకావికలమైన హృదయం పగిలి మరణించాడు. అది తలచుకుంటేనే మనసంతా దిగులై పోతుంది.
భోజనంలో చివర తినే పెరుగు కమ్మగా వుంటే భోజనం తృప్తిగా చేసినట్లుంటుంది. అది పుల్లగా వుంటే అసంతృప్తి మిగులుతుంది. రామారావుగారి జీవితంలో చరమఘట్టం దుర్భరంగా గడిచింది. ఆయన రారాజులా ఉజ్జ్వలంగా వెలిగినా, ఆఖరి నాలుగు నెలలు అంధకారం ఆవహించగా, విషాద కథానాయకుడిలా జీవితం పరిసమాప్తమైంది. ఆ నాడు ఏం జరిగిందో 35, 40 ఏళ్ల లోపున వయసున్నవారికి గుర్తుండకపోవచ్చు. వివరాలు తెలియాలంటే ఆనాటి పేపర్లు తెలియాలి. లేకపోతే ఐ.వెంకట్రావు (మహా టీవీ) గారు రాసిన ''ఒకే ఒక్కడు'', ''తెలుగుదేశం – ప్రజల మధ్య పాతికేళ్లు'' వంటి పుస్తకాలు చదవాలి.
ఎన్టీయార్‌కు రావణ పాత్ర, సుయోధన పాత్ర చాలా యిష్టం. ఎన్టీయార్ కథ తలచుకుంటే భాసుడు రాసిన ''ఊరుభంగం'' నాటకం గుర్తుకు వస్తుంది. భీముడితో గదాయుద్ధంలో తొడలు విరిగి, దుర్యోధనుడు రణరంగంలో కూలబడ్డాడు. ఆత్మీయులందరూ పోయారు. తన ప్రతిక్షకులు విజయగర్వంతో చెలరేగిపోతున్నారు. ఆ బాధ అతన్ని దహించివేస్తోంది. అప్పుడు అశ్వత్థామ వచ్చి పాండవులను చంపి, నీకు ఊరట కలిగిస్తానని మాట యిచ్చి, పాండవ శిబిరానికి వచ్చి వారే అనుకుని ఉపపాండవులను నరికి వచ్చి దుర్యోధనుడితో పాండవసంహారం జరిగిందని చెప్పాడు. శత్రువులు నిర్జింపబడ్డారనే సంతోషంతో దుర్యోధనుడు ప్రాణాలు విడిచాడు. అంతిమ ఘట్టంలో పొరపాటుగానైనా మానసిక సంతృప్తి కలిగించిన అశ్వత్థామ కూడా లేకపోవడం చేత ఎన్టీయార్ దుర్యోధనుణ్ని మించిన ట్రాజిక్ హీరో అయ్యారు. అప్పటివరకు తాను పూచికపుల్లలుగా పరిగణించినవారు యీనాడు మొనగాళ్లయి, తనపైనే చెప్పులు వేశారనే మనోవేదన ముంచెత్తిన దశలోనే ఎన్టీయార్ అసువులు బాసారు.
1996 జనవరి 18న ఆయన ఎలా మరణించాడో యిప్పటికీ మిస్టరీయే. ఆయన పోయినప్పుడు పక్కన వున్నది లక్ష్మీపార్వతి గారు మాత్రమే. ఆమెపై, ఆమె ప్రవర్తనపై ఎన్టీయార్ కుటుంబం అనేక ఆరోపణలు చేసింది.
''నా తండ్రిపై విషప్రయోగం చేశారు. రోజురోజూ కొద్దికొద్దిగా విషం యిచ్చారు. ఆయనకు ఆర్నెల్లుగా యిస్తున్న మందులేమిటి? జరిగిన చికిత్స ఏమిటి? ఆయనకు గుండెపోటు వస్తే హృద్రోగనిపుణులు, వ్యక్తిగత వైద్యులు అయిన డా|| సోమరాజుగార్ని పిలవకుండా గైనకాలజిస్టు అయిన డా||మహాలక్ష్మిని పిలిపించడంలో ఆంతర్యమేమిటి?'' అని హరికృష్ణ ప్రశ్నిస్తూ వీటన్నిటిపై హైకోర్టు న్యాయమూర్తిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ డిమాండు చేసినది మంత్రే అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణ జరిపించలేదు. విచారణలో ఎలా తేలినా అది ఎన్టీయార్‌కు, అంతిమంగా కుటుంబానికి మచ్చ తెస్తుందని బెదిరారు. ఎందుకంటే లక్ష్మీపార్వతి వర్గం 'అల్లుళ్లు, కొడుకులు చేసిన ద్రోహాన్ని భరించలేక మనోవ్యథకు గురై ఎన్టీయార్ మరణించా'రని ప్రత్యారోపణ చేసింది. విచారణ సందర్భంగా కుటుంబసభ్యులు వృద్ధాప్యంలో వున్న ఎన్టీయార్‌ను పట్టించుకోలేదని తేలితే అదీ యిబ్బందే!
దీనికి మరో కోణం కూడా వుంది. 1996 మేలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయడానికి ఎన్టీయార్ సన్నాహాల్లో వున్నారు. దానికై నిధులు సేకరించి పెట్టుకున్నారని అందరూ అనుకున్నారు. వాటి కోసం యిరువర్గాల మధ్య పెనుగులాట జరిగింది. తీరా చూస్తే చివరకు దొరికింది దాదాపు రెండు లక్షల రూ.ల పై చిలుకు మాత్రమే. మరి నోట్ల కట్టలన్నీ ఏమై పోయాయి? లక్ష్మీపార్వతి చెప్తున్నట్లు ఎన్టీయార్ తెల్లవారుఝూమున పోలేదని అర్ధరాత్రికి ముందే పోయారని, డబ్బులన్నీ బయటకు తరలించాక మాత్రమే మరణవార్త బయటపెట్టారని కథనాలు వచ్చాయి. మరణవార్త తెలియగానే పోలీసువారు వచ్చి నిఘా వేశారు. అప్పటికే సూటుకేసులు తరలిపోయాయట, నగల పెట్టెలు ఖాళీగా వున్నాయట. ఎన్టీయార్ కుటుంబసభ్యులు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఇన్వెంటరీకి ఆదేశాలు యిచ్చింది. తాళం వేసిన గది తాళం చెవి మొదటి రోజు కనబడలేదు. రెండో రోజు కనబడ్డాక చూస్తే ఇన్వెంటరీలో విలువైనవేవీ కనబడలేదు. అంటే సూటుకేసుల్లో డబ్బు గడపలు దాటిన మాట నిజమేనా? వట్టి ఆరోపణా? ఇది జరిగిన కొన్నాళ్లకు లక్ష్మీపార్వతి, ఆమె కుమారుడు కోటీశ్వర ప్రసాద్, కొందరు తమను నమ్మించి, డబ్బు నగలు పట్టుకెళ్లారని పోలీసు కేసులు పెట్టడంతో రూఢి అయిందంటారు వెంకట్రావుగారు. లక్ష్మీపార్వతి కొందర్ని నమ్మి వాళ్ల ద్వారా డబ్బు బయటకు పంపారని, వారిలో కొందరు మాత్రమే డబ్బు తిరిగి యిచ్చారని అంటారు. '500 నోట్ల కట్టలతో వెళ్లిన సూట్‌కేసు ఎంతో గొడవ చేస్తే 50 రూ.ల కట్టలతో వెనక్కి వచ్చింది' అని లక్ష్మీపార్వతి ఓ సందర్భంలో వాపోయారట. విచారణలో యివన్నీ బయటకు వస్తే ఎన్టీయార్ కున్న క్లీన్ యిమేజికి భంగం వాటిల్లుతుందని భయపడ్డారు.
అసలు ఎన్టీయార్‌కు ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ ఎందుకు వచ్చింది అన్నదే పెద్ద ప్రశ్న. ముందు రోజు రాత్రి 7 గంటలకు ఆయనకు వ్యక్తిగత జ్యోతిష్కుడు, మాజీ మంత్రి అయిన బివి మోహనరెడ్డి వచ్చారు. రెండు గంటల పాటు వున్నారు. ఇద్దరూ కలిసి చేపల పులుసు, కైమా ఉండలతో భోజనం చేశారు. మధ్యలో జెమిని టీవీలో ఎల్వీ ప్రసాద్‌పై డాక్యుమెంటరీ వచ్చింది. సాధారణంగా ఏ టీవీ ప్రోగ్రామైనా ఐదు ని||ల కంటె చూడని ఎన్టీయార్ దాన్ని పూర్తిగా చూశారు. ఆనందోద్వేగాలతో అక్కినేని నాగేశ్వరరావుకి ఫోన్ చేసి గత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. మర్నాడు యింటికి భోజనానికి రమ్మనమని పిలిచారు. ఇంత ఉత్సాహంగా వున్న మనిషి హఠాత్తుగా గుండెపోటుతో ఎలా పోయారన్నది మిస్టరీ అయింది. ఎన్టీయార్ సుగర్ పేషంటు. సరైన జాగ్రత్తలు తీసుకునేవారు కారు. హార్ట్ పేషంటు కూడా. 1984లో గుండెకు ఆపరేషన్ జరిగింది. ఎన్టీయార్‌కు తీవ్రమైన సుగర్ వ్యాధి వుంది. నియంత్రణలో పెట్టుకోలేదు. సుగర్ వున్న వాళ్లకు గుండెపోటు వచ్చినా నొప్పి పెద్దగా తెలియదు. అయితే అవేళ గుండెపోటు ఎందుకు రావాలి? అంటే మనోవేదన చేత అని యిరు వర్గాలూ అన్నాయి. లక్ష్మీపార్వతి పూర్వవివాహం చేత తనకు పుట్టిన కొడుకుని దత్తత తీసుకోమని బలవంతం చేశారని, ఆ యాతన తట్టుకోలేక గుండె ఆగిపోయిందని కుటుంబవర్గం ప్రచారం చేసింది. అంతకంటె దుర్మార్గపు వెర్షన్ కూడా వినబడింది.
దాని ప్రకారం – నిద్రమాత్రలు వేసుకునే అలవాటున్న ఎన్టీయార్ ఆ రోజు మాత్ర వేసుకోకుండా పెందరాళే పడుక్కోవడం వలన 11 గం||ల ప్రాంతంలో మెలకువ వచ్చేసింది. అప్పుడు చూడకూడని దృశ్యం చూడడం చేత బాధతో గుండె ఆగిపోయింది! అయినా ఇంట్లోంచి డబ్బు తరలించేదాకా, అన్నీ చక్కబెట్టేదాకా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వుండి తెల్లవారు ఝామున 3 గం||లకు పోయారని ప్రచారం చేశారని ఆరోపణ. మరణం సంభవించగానే కుటుంబసభ్యులకు తెలుపకుండా కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిగారికి ఫోన్ చేసి చెప్పారనే ఆరోపణ కూడా వచ్చింది. దాన్ని లక్ష్మీపార్వతి ఖండిస్తూ 'నేను చేయలేదు, వేరే ఎవరైనా చేశారేమో' అన్నారు.
ఎటాక్ రాగానే డా|| సోమరాజుగారిని పిలవలేదేం అన్న ముఖ్యమైన ప్రశ్నకు లక్ష్మీపార్వతి చెప్పిన సమాధానమేమిటంటే – 'ఎన్టీయార్ అర్ధరాత్రి నిద్రలో వుండగా పోలేదు. ఎప్పటిలాగానే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, ట్రెడ్‌మిల్ పై నడిచి, అలసట చేత కాబోలు పడుకున్నారు. నేను మాగన్నుగా పడుకుని వున్నాను. కాస్సేపటికి ఆయన గురక పెద్దగా రావడంతో కంగారు పడి లేచాను. తట్టి లేపితే ఆయన లేవలేదు. డా||సోమరాజు గారికి ఫోన్ చేస్తే బిజీగా వుంది. డా|| కుమార్ గారికి చేస్తే ఆయన వెంటనే బయలుదేరతానన్నారు. ఈ లోగా డా|| మహాలక్ష్మి, చంద్రశేఖర్‌రెడ్డిలకు ఫోన్ చేశాను. వారు ముందు వచ్చారు. వాళ్ల యిళ్లు దగ్గర. గదిలోకి వెళ్లి ఎన్టీయార్‌ను చూసి దిగాలుగా బయటకు వచ్చారు. ఇంతలో డా|| కుమార్ వచ్చి గదిలోకి వెళ్లి ఆయన్ని చూసి 'హి ఈజ్ గాన్' అన్నారు. ఇది తెల్లవారుఝామున 3 గం||ల ప్రాంతంలో జరిగింది. ఆయన మరణానికి కారణం మనోవ్యథే'.
ఎన్టీయార్‌కు మనోవ్యథ వుండడానికి కారణముందా అనే ది చూడబోతే – ఎన్టీయార్ గతంలో కూడా నాదెండ్ల భాస్కరరావు కారణంగా వెన్నుపోటుకు గురయ్యారు, కానీ ప్రజలు తిరగబడడంతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు తన వారెవరో, పరాయివారెవరో స్పష్టంగా తెలిసింది. ఈ సారి తిరుగుబాటు చేసినది సొంత అల్లుళ్లు, సొంత కొడుకులు. కూతుళ్లు, కోడళ్లు భర్తలతో చేతులు కలిపారు. లక్ష్మీపార్వతిని తప్పించమనే కోరతారు తప్ప అంతకంటె ఎక్కువగా తెగించరని ఎన్టీయార్ నమ్మారు. తీరా చూస్తే మూలవిరాట్టుకే ఎసరు పెట్టారు. చంద్రబాబు వెనుక ఎమ్మెల్యేలు చేరుతున్నారని తెలియగానే 'మీరు ఎసెంబ్లీ రద్దు చేయిస్తానని బెదిరించండి. నేను ప్రధాని పివికి సన్నిహితుణ్ని. వెళ్లి ఆయన చేత ఔననిపించుకుని వస్తాను.' అని ఒక లాయరు తప్పుడు సలహా యిచ్చాడు. ఎన్టీయార్ ఆయన్ని నమ్మి రద్దు చేయమని సిఫార్సు చేశారు. దాని వలన మరింత ఎక్కువమంది బాబు శిబిరంలోకి వెళ్లిపోయారు. ఈ సలహా యిచ్చిన లాయరు కూడా అక్కడే తేలాడు. ఈ నమ్మకద్రోహానికి ఎన్టీయార్ నివ్వెర పోయారు. పరిస్థితులు వివరిద్దామని ప్రజల్లోకి వెళితే స్పందన అంతగా కనబడలేదు. దాంతో హతాశుడయ్యారు.
ఇరువర్గాల మధ్య రాజీ కోసం చాలామంది తిరిగారు. కానీ బాబుకి, ఎన్టీయార్‌కు ఒకరి మీద మరొకరికి నమ్మకం లేకపోయింది – పరిస్థితులు చక్కబడ్డాక పగ బూని తనను పూర్తిగా తొక్కేస్తారని భయపడ్డారు. రాజీకై వచ్చిన విపి సింగ్‌కు వీడ్కోలు చెపుతూ ఎన్టీయార్ కళ్లు తిరిగి పడిపోయారు. ఆసుపత్రిలో వుండగా గవర్నరు చూడడానికి వస్తే తను రాజీనామా చేస్తున్నట్లు లేఖ ఆయన చేతిలో పెట్టారు. మళ్లీ యింటికి వచ్చాక ఎవరు చెప్పారో కానీ మనసు మార్చుకుని 'గవర్నరు నా దగ్గర్నుంచి బలవంతంగా రాజీనామా లేఖ తీసుకున్నారు' అని ఆరోపించారు. ఇది వివాదానికి దారి తీసింది. ముదిమిలో ఎన్టీయార్ మతి తప్పి ప్రవర్తిస్తున్నారని అందరూ అనసాగారు. వైస్రాయి సంఘటనతో ఎన్టీయార్ మానసికంగా తీవ్రంగా గాయపడ్డారు. అనామకులను కూడా గెలిపించుకుంటే వారు యీనాడు తనకు ఎదురు తిరుగుతారా అని అహం పొడుచుకు వచ్చింది. తను చేరదీసిిన యనమల రామకృష్ణుడు స్పీకరుగా వుంటూ తనకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం యివ్వకపోవడం మనసు కలచివేసింది.
1994 ఎన్నికలలో 219 మందిని గెలిపించుకుంటే కేవలం 29 మంది మాత్రమే ఆయన వెంట నిలిచారు. ఇంతలో ఉపముఖ్యమంత్రి పదవి యివ్వలేదని అలిగి దగ్గుబాటి వెంకటేశ్వరరావుగారు చంద్రబాబును వదిలి 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీయార్ వద్దకు వచ్చారు. దాంతో ఆయన ఉత్సాహం యినుమడించింది. అధిక సంఖ్యాకులు తన పక్షాన వున్నారు కాబట్టి తనదే అసలైన టిడిపి అని చంద్రబాబు, సంస్థాపకుణ్ని నేనే కాబట్టి నా వర్గమే అసలైనదని ఎన్టీయార్ ఎన్నికల సంఘానికి రాసుకున్నారు. అయితే వారి నిర్ణయం వచ్చేలోపునే ఎన్టీయార్ పోరాడి లాభం లేదని గ్రహించి తన వర్గానికి ఎన్టీయార్ తెలుగుదేశం అని పేరు పెట్టుకున్నారు. తాళి కట్టిన తన భార్య లక్ష్మీపార్వతిని అవమానపర్చిన కుటుంబసభ్యులందరితో చుట్టరికాన్ని తెంచుకున్నానని ప్రకటించారు. అసెంబ్లీ ఉపయెన్నికలో కొడుకు హరికృష్ణపై పోటీ పెడతానని ప్రకటించారు. 1996 మేలో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి 42లో 39 సీట్ల వరకు గెలుచుకుంటామని ప్రకటించారు. ఫిబ్రవరి 2 న విజయవాడలో సింహగర్జన పేర పెద్ద సభ ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ లీడర్లను ఆహ్వానించారు. టిడిపిలోని రెండువర్గాల్లో ఎవరి పక్షాన నిలవాలో తెలియక ఫ్రంట్ కొట్టుమిట్టులాడుతోంది. తమ పక్షానే ప్రజలున్నారని నిరూపించడానికి యిదే తరుణం అనుకున్నారు ఎన్టీయార్. సింహగర్జన ఏర్పాట్లలో ఎన్టీయార్ బిజీగా వుండగా, ఆయన ఆదేశంతో లక్ష్మీపార్వతి జిల్లాలలో విస్తృతంగా పర్యటనలు చేయసాగారు. పోటీగా హరికృష్ణ సభలు ఏర్పాటు చేయసాగారు. ఇద్దరి సభలకు జనం వస్తున్నారు. చంద్రబాబు తనను ఎలా ద్రోహం చేశారో వివరిస్తూ ఎన్టీయార్ 'జామాతా దశమ గ్రహం' అనే క్యాసెట్టు విడుదల చేశారు. ఇక పార్టీ ఆస్తుల గురించి గొడవ సాగింది. బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తూ హైకోర్టు జనవరి 17న ఉత్తర్వు యిచ్చింది. బ్యాంకులో పార్టీ పేర వున్న 75 లక్షలు యిప్పించాలని ఎన్టీయార్ బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మన్‌కు పిటిషన్ పెట్టుకుంటే బాబు దానిపై హైకోర్టుకి వెళ్లారు. జనవరి 25 వరకు ఏ చర్య తీసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. ఇది జరిగిన మర్నాడే ఎన్టీయార్ మరణించారు.
ఇలాటి ఎదురుదెబ్బలు, మహాసభ ఏర్పాట్ల అలసట, అనుయాయుల ధిక్కారం వలన ఆత్మీయుల వెన్నుపోటు వలన కలిగిన మనోక్షోభ – యివన్నీ కలిసి ఎన్టీయార్‌కు గుండెపోటు తెప్పించి వుండవచ్చు. మరణం తర్వాత కూడా అంత్యక్రియల వద్ద గలభా జరిగింది. ఎల్‌బి స్టేడియంలో ఆయన పార్థివశరీరం వున్న వేదికను లక్ష్మీపార్వతి వర్గీయులు పూర్తిగా ఆక్రమించుకున్నారు. బాబు వర్గీయులు, ఎన్టీయార్ సంతానం… ఎవరు వచ్చినా దగ్గరకు రానీయకుండా దూషించి వెనక్కి పంపారు. బాబు వేదిక వెనుక వున్న గదిలో కూర్చున్నారు. ఏం చేయాలన్నా ఆయనకు ధైర్యం చాలలేదు. అధికార పర్యటనపై హాంగ్‌కాంగ్ వెళ్లిన హరికృష్ణ తిరిగి వచ్చేవరకు అదే పరిస్థితి. ఆయన వస్తూనే గదమాయించి లక్ష్మీపార్వతి వర్గీయులను దింపేశాడు. అప్పుడు ఎన్టీయార్ కుటుంబసభ్యులందరూ వచ్చి కూర్చున్నారు. ఈ గొడవలతో సంబంధం లేకుండా సాధారణ ప్రజలందరూ ఎన్టీయార్ హఠాన్మరణంతో విలపించారు. ఏ రాజకీయనాయకుడి అంత్యక్రియలకు, ఏ సినిమా యాక్టరు అంత్యక్రియలకు అంతమంది రాలేదు. అందరూ అహో ఎన్టీయార్ అన్నారు. కానీ బతికి వుండగా ఎన్టీయార్‌కు దీనిలో పదో వంతు ఆదరణ కూడా లభించలేదు. అందుకే ఆయన జీవితం విషాదాంతం.
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2017)