అయ్‌బాబోయ్‌.. లక్షల కోట్లే.!

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చంద్రబాబు ప్రభుత్వం 'సిఐఐ భాగస్వామ్య సదస్సు'ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతా ఊహించినట్లే తొలి రోజు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన 'ఎంఓయూ'లు కుదర్చుకుంది. వివిధ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు…

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చంద్రబాబు ప్రభుత్వం 'సిఐఐ భాగస్వామ్య సదస్సు'ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతా ఊహించినట్లే తొలి రోజు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన 'ఎంఓయూ'లు కుదర్చుకుంది. వివిధ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపించాయని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈరోజు ఇంకో అడుగు ముందుకేసి, పది లక్షల కోట్ల రూపాయల 'ఎంఓయూలు' అంటూ కొత్త లెక్క చెప్పారాయన. 

అసలు ఒప్పందాలంటే ఏంటి.? ఎంఓయూలంటే ఏంటి.? అవన్నీ నిజమయ్యేదెప్పుడు.? అసలు నిజమవుతాయా.? అవ్వవా.? ఇలా సవాలక్ష ప్రశ్నలున్నాయి. ఎవరేమనుకుంటేనేం, చంద్రబాబు సర్కార్‌ తమకున్న మీడియా బలంతో ఆంధ్రప్రదేశ్‌కి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ప్రచారం చేసుకుంటోంది. ప్రత్యేక హోదా లేకపోయినా, ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ వైపు పరిశ్రమలు తరలి వచ్చేస్తున్నాయంటూ మంత్రి యనమల రామకృష్ణుడు గొప్పగా చెప్పేసుకున్నారు.

అంతిమంగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అవసరం లేదని. సరే, వివిధ దేశాలకు చెందిన కంపెనీల నుంచి ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందాలు జరుగుతోంటే, ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతోంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర ప్రభుత్వ సాయంపై ఎందుకు ఆధారపడుతోంది.? ఆర్థిక లోటు ఎప్పటికప్పుడు ఎందుకు పెరుగుతూ పోతోంది.? ఈ ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు సర్కార్‌ సమాధానం ఇవ్వదుగాక ఇవ్వదు. 

సిఐఐ సదస్సుకి విదేశీ కంపెనీలు రావడం మాటెలా వున్నా, కేంద్ర మంత్రులు పలువురు విశాఖ వైపు పరుగులు తీశారు. వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి.. ఆస్తాన 'విధ్వాంసులే'. నిర్మలా సీతారామన్‌ కూడా తెలుగింటి ఆడపడుచే. సురేష్‌ ప్రభు, ఆంధ్రప్రదేశ్‌ నుంచే రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. వీరు కాకుండా, ఇంకొందరు కేంద్ర మంత్రులు, విశాఖ సిఐఐ సదస్సు ద్వారా, ఆంధ్రప్రదేశ్‌ని నరేంద్రమోడీ సర్కార్‌ ఉద్ధరించేస్తోందంటూ ప్రచారం చేసుకున్నారు. 

ఒప్పందాల సంగతి దేవుడెరుగు.. ఇదేదో పొలిటికల్‌ మీటింగ్‌.. అనే స్థాయిలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు హడావిడి చేయడంతోనే సిఐఐ భాగస్వామ్య సదస్సు సమయం కాస్తా హాంఫట్‌ అయిపోయింది. ఇంతకీ, ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి లభించబోయే లక్షల కోట్ల పెట్టుబడులు నిజమేనా.? ఆ ఒక్కటీ అడగొద్దు. ఎందుకంటే, ఇది చంద్రబాబు జమానా.!