తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదంటే దానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ 'అయితే ఓకే' అంటారనే విమర్శలున్నాయి. ఈయన తీరు చూస్తుంటే ఈ విమర్శల్లో వాస్తవం ఉందనిపిస్తోంది. రెండు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్న ఈ మాజీ పోలీసు అధికారి తెలంగాణ వైపే ఎందుకు మొగ్గు చూపుతారనే ప్రశ్నకు సమాధానం లేదు.
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ విమర్శలకు గురైన గవర్నర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం ఆ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇష్టుడైపోయారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన గవర్నర్ ఆ పని చేయడంలేదేమోననిపిస్తోంది. కేసీఆర్ ఏదంటే దానికి 'సరే' అంటారని రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో జరిగిన విందు (ఎట్ హోమ్) కార్యక్రమంలో మరోసారి బయటపడింది.
తెలంగాణ-ఆంధ్రా మధ్య పరిష్కారం కావల్సిన సమస్యలు అనేకం ఉన్నప్పటికీ తెలంగాణవారు హైకోర్టు విభజనను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ న్యాయవాదులు ఇప్పటివరకు అనేకసార్లు ఆందోళనలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆవేశపూరితంగా, హింసాత్మకంగా కూడా వ్యవహరించారు.
హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాలు జరిగినప్పుడల్లా తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శిస్తున్నారు. హైకోర్టు ఆంధ్రోళ్ల పెత్తనం కింద ఉందని భావిస్తున్నారు. విభజనకు సంబంధించి కేసీఆర్పై చాలా ఒత్తిడి ఉంది. విందు సందర్భంగా కేసీఆర్ హైకోర్టు విభజనను ప్రస్తావించారు. విభజనకు సహకరించాలని బాబును కోరారు. వెంటనే గవర్నర్ 'హైకోర్టు విభజన గురించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో అడుగుతోంది కదా. ఏపీ ప్రభుత్వం సహకరించాలి' అని కేసీఆర్కు సపోర్టు చేశారు. నరసింహన్ ఓకే అన్నారని చంద్రబాబు అనరు కదా. ఇప్పుడొక సమస్య అప్పుడొక సమస్య పరిష్కరించుకోవడం కాకుండా అన్ని సమస్యలు ఒక్కసారే పరిష్కరించుకుందామని బాబు అన్నారు. విభజన చట్టంలోని పదో షెడ్యూలులో విభజించాల్సిన ఉమ్మడి సంస్థలు చాలా ఉన్నాయి. మూడేళ్లయినా ఆ సమస్య ముందుకు కదలడంలేదు. ఎందుకు?
అవన్నీ హైదరాబాదులోనే ఉన్నాయి. ఉమ్మడి సంస్థలను విభజించి ఆస్తులు, అప్పులు పంచుకోవాలని సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. ఈ సంస్థల విభజనకు ముందుకు రావల్సిన తెలంగాణ ప్రభుత్వం గమ్మున ఉండిపోయింది. తెలంగాణ సర్కారుతో చర్చలు జరపడానికి ఆంధ్రా సర్కారు మంత్రుల కమిటీని వేసింది. ఇలాంటి కమిటీ తామూ వేస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పినా ఇప్పటివరకు ఆ పని చేయలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవల్సిన గవర్నర్ ఏం చేస్తున్నారో తెలియదు. పదో షెడ్యూలు సంగతి తేలిస్తేనే హైకోర్టు విభజన జరుగుతుందని, అసెంబ్లీ, సచివాలయం భవనాలు అప్పగిస్తామని బాబు ఇదివరకే చెప్పారు. కాని కేసీఆర్ పదో షెడ్యూలు గురించి మాట్లాడకుండా హైకోర్టు విభజనను అడుగుతున్నారు.
హైదరాబాదులోని సచివాలయం, అసెంబ్లీ భవనాలు గవర్నర్ ఆధ్వర్యంలోనే విభజించారు. హద్దులను ఆయనే నిర్ణయించారు. ఈ భవనాలకు సంబంధించి వివాదాలు తలెత్తితే ఆయనే ఇద్దరు చంద్రులను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఈ విషయంలో ఆయన 'న్యాయంగా' వ్యవహరించడంలేదనే అనుమానాలు కలుగుతున్నాయి. సచివాలయం కూల్చి కొత్తది నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నప్పుడు వెంటనే గవర్నర్ను కలిసి ఏపీకి సంబంధించిన సెక్రటేరియట్ భవనాలు కూడా అప్పగిస్తే మొత్తం కూలగొట్టి కొత్త నిర్మాణం ప్రారంభిస్తానన్నారు. కేసీఆర్ చెప్పడమే తడవుగా గవర్నర్ ఈ విషయం చంద్రబాబు చెవిలో వేయడమే కాకుండా భవనాలు అప్పగించాల్సిందిగా కోరారు.
కేబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత నిర్ణయిస్తామని అప్పట్లో బాబు సమాధానం చెప్పారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం…విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన విషయంలో తెలంగాణ సర్కారు సహకరించడంలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం, మరికొన్ని సమస్యలు న్యాయంగా పరిష్కారమైతే భవనాలు అప్పగిస్తామన్నారు. అప్పుడు గవర్నర్ ఏం చేయాలి? ఈ విషయం కేసీఆర్కు చెప్పి సంస్థల విభజన పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలి. కాని నరసింహన్ ఆ పని చేస్తున్నట్లు లేదు. మళ్లీ పాత కథే పునరావృతమైంది. వచ్చే ఎన్నికలనాటికైనా పదో షెడ్యూలులోని సంస్థల విభజన జరుగుతుందా?