ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలి.. ఇదీ పవన్‌కళ్యాణ్ ఆకాంక్ష. కేంద్రం, దక్షిణ భారతదేశంపై చిన్నచూపు చూస్తోంది గనుక, దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా కలిసి కేంద్రంపై తిరగబడాలి.. ఇదీ పవన్‌కళ్యాణ్ ఉద్దేశ్యం. ఇక్కడ కేంద్రం.. అంటే, కేంద్రంలో అధికారంలో వున్నవారని అర్థం. నో డౌట్, కేంద్రంలో ఎవరున్నాసరే.. ఉత్తరాది పెత్తనం భారతదేశం మీద వుండి తీరుతుంది. వడ్డించేవాడు మనవాడైతే.. అన్న చందాన, దక్షిణాదిని నాశనం చేసేసి అయినాసరే, పాలకులు ఉత్తరాదికి దోచిపెడ్తుంటారు.
కానీ, పాలకులు చేసిన పొరపాటుకి, దేశంలో 'ఉత్తరాది, దక్షిణాది' అన్న భావన తీసుకురావడం ఎంతవరకు సబబు? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశంలో ఎవరికి ఒళ్ళు మండినాసరే, 'అసలు, ఈ దేశంలో మనం వున్నామా.?' అని ప్రశ్నించేస్తుంటారు. మొన్న జల్లికట్టు రగడలో ఇదే వాదన తెరపైకొచ్చింది. తెలంగాణ ఉద్యమంలోనూ అంతే. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా కూడా ఇదే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ ఆవేదన అర్థం చేసుకోదగ్గదే.
మార్చి నెలలో విశాఖ వేదికగా, ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా దక్షిణాది నిరసన.. అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్. ఈ నిరసనకు కనీసం, అరవయ్యేళ్ళు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి వున్న తెలంగాణ ప్రజలు కలిసొస్తారా.? ఈ విషయంపై ముందు పవన్‌కళ్యాణ్ స్పష్టతనివ్వాలి. కానీ, ఆయన చెప్పరు.. పిలుపునిచ్చేశారంతే. అసలా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారా.? లేదా.? ఇదీ డౌటే.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ నుంచి సానుకూల స్పందన వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీలతో కలిసి పోరాడతామన్నారు. కానీ, విశాఖలో జరిగే దక్షిణాది ఆవేదనకు తెలంగాణ మద్దతిస్తుందని అనుకోలేం. తెలంగాణనే మద్దతివ్వనప్పుడు తమిళనాడు ఎందుకు స్పందిస్తుంది.? కర్నాటక సైతం పెదవి విరిచేయకుండా వుంటుందా.?
అసలు మేటర్ వేరు.. పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నది వేరు. ఇక్కడ ప్రత్యేక హోదా ఒక్కటే సమస్య కాదు, ఇంకా చాలానే వున్నాయి. 'మాక్కావాల్సింది సమైక్యాంధ్ర.. అది తప్ప ఇంకేదీ వద్దు..' ఇదీ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటి 13 జిల్లాల సీమాంధ్ర ప్రాంతం తెరపైకి తెచ్చిన డిమాండ్. ఏం జరిగింది.? రాష్ట్రం విడిపోయింది, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ చేతిలో బొచ్చె మిగిల్చింది కేంద్రం.
ఇప్పుడూ అంతే. ప్రత్యేక హోదా కావాలి.. అలాగని, ప్రత్యేక ప్యాకేజీ వద్దంటే ఎలా.? సరే, ప్యాకేజీ వద్దు.. అనుకుందాం. రైల్వే జోన్ మాటేమిటి.? రాజధాని సంగతేంటి.? ఇవన్నీ అడగాలి కదా.! చాలా రీసెర్చ్ చేసేశానని పవన్ అంటుంటారు. కానీ, రీసెర్చ్ చేసినట్లయితే పవన్ నుంచి ఇలాంటి మాటలు రావు. పవన్ ఒక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ప్రత్యేక హోదా కోసం నినదించాలనుకున్నాసరే, 'అది తప్ప ఇంకేదీ వద్దు..' అనడం ఎంతవరకు కరెక్ట్.?
ఏం చేసినాసరే, కేంద్రం అయితే ప్రత్యేక హోదా ఇచ్చేలా కన్పించడంలేదు. కేంద్రంలో మోడీ సర్కార్‌ని పడగొట్టేంత సీన్.. ఇప్పుడు భారతదేశంలో ఇంకెవరికీ లేదు. తమిళనాడులోలా ఆంధ్రప్రదేశ్ నుంచి ’రాజకీయ ఐక్యత‘ను ఆశించలేం. ఎవరి గోల వారిదే. ఇంత గందరగోళంలో ఇప్పుడు కొత్తగా, ఈ ఉత్తరాది – దక్షిణాది రచ్చ ఏంటట.? ఏం, ఉత్తరాది నాయకుడని మోడీకి మద్దతిచ్చినప్పుడు పవన్‌కళ్యాణ్‌కి తెలియదా.!
చివరగా: ఆంధ్రపదేశ్ నుంచి అన్ని రాజకీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించగలిగితే.. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఐకమత్యం గురించి మాట్లడొచ్చు. ఏమంటారు.?