అసలు ప్రత్యేక హోదా ఇవ్వడం నరేంద్రమోడీకి ఇష్టం లేదా.? ఆ ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి చంద్రబాబుకే ఇష్టం లేదా.? ఇప్పుడీ కొత్త అనుమానం కలుగుతోంది అందరికీ. ప్రత్యేక హోదా వస్తే, తన ఆస్తులేవో కరిగిపోతాయని చంద్రబాబు బాధపడ్తున్నారు. చాలా చాలా చిత్రమైన సందర్భమిది.
సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా గతంలో నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు 'ఎంఓయూ' కుదుర్చుకున్నామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈసారి లెక్క దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలకు సంబంధించిన 'ఎంఓయూ'లట. సాధ్యమేనా.? అసలు ఇది నిజమేనా.? అన్న అనుమానాలు జనాల్లో వున్నాయి. ఎంఓయులు వేరు, ఒప్పందాలు వేరు, వాస్తవాలు వేరు. ఇది జగమెరిగిన సత్యం.
ప్రత్యేక హోదా వాస్తవం. ఎంఓయూలనేవి భ్రమ. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకీ ఈ ఎంఓయూలకీ పెద్దగా తేడాల్లేవు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తే, దానికి చట్టబద్ధత లేదు. మీడియా ముందు, ప్యాకేజీ గురించి ఇప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేస్తే దానికి చట్టబద్ధత వున్నట్లు. ఈ మాటే కదా బీజేపీ చెబుతున్నది.? దురదృష్టవశాత్తూ హైటెక్ ముఖ్యమంత్రి కూడా గంగిరెద్దులా తలాడిస్తే ఎలా.?
'బాబ్బాబూ, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వండి..' అనడుక్కుంటే, అరుణ్ జైట్లీ కనీసం చంద్రబాబు మాటల్ని లెక్క చేయలేదు. ఇప్పటికీ ఆ చట్టబద్ధత గురించి కేంద్రం మాట్లాడ్డంలేదు. కానీ, చంద్రబాబు ప్యాకేజీ గొప్ప.. ప్రత్యేక హోదా దండగ.. అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకి నిధులొచ్చాయంటే అది ప్యాకేజీ పుణ్యమని చెప్పుకుని తిరుగుతున్నారు చంద్రబాబు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?
'అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు..' అన్నది వెనకటికి ఓ సామెత. చంద్రబాబుకి చేతకాదు.. ఆ పనేదో ఆంధ్రప్రదేశ్ యువత చేస్తోంది. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఆ యువతకు అండగా నిలిచింది. జనసేన పార్టీ తనవంతుగా ఆంధ్రప్రదేశ్ యువతకు వెన్నుదన్నుగా నిలిచింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడమంటే, చంద్రబాబు ఏం సంకేతాలు పంపుతున్నట్టు.? రాచరికం కాదు, రాక్షసత్వం.. అనే స్థాయిలో చంద్రబాబు సర్కార్ విధానాలు కన్పిస్తున్నాయి.
ఇప్పటితో 'సినిమా' అయిపోలేదు. ఇంకా రెండేళ్ళుంది.. ఆ తర్వాత ఎన్నికలొస్తాయ్.. అప్పుడు పరిస్థితేంటి.? ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తేంటి.? అని చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి కదా.! ఏముందిలే, అప్పుడు బీజేపీని విమర్శిస్తే పనైపోతుందని చంద్రబాబు అనుకోవచ్చుగాక.. కానీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు ఎప్పటికీ 'ద్రోహి'గానే మిగిలిపోనున్నారని నేటితో తేలిపోయింది.
గడచిన మూడేళ్ళలో చంద్రబాబు విశాఖను ఏం ఉద్ధరించారట.? విశాఖకు కనీసం రైల్వే జోన్ కూడా తీసుకురావడం చేతకాలేదు చంద్రబాబుకి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైద్రాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరమైన విశాఖ రాజధాని రేసులో నిలబడినా, కాలదన్నేసిన ఘనుడు చంద్రబాబు కాడా.? ఈ చంద్రబాబు.. అవును, ఈ చంద్రబాబే.. విశాఖను ఉద్ధరించేస్తోంటే, విపక్షాలు అడ్డుకుంటున్నాయట. విపక్షాలు కాదు, ఆంధ్రప్రదేశ్ యువత ప్రశ్నిస్తోంది.. విశాఖకి ఊడబొడిచేసిందేంటో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి చేతనైతే.